భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. కరోనా వైరస్ ప్రభావంతో తేజస్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసింది రైల్వే. అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ రూట్లో నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ రైలును 2021 ఏప్రిల్ 2 నుంచి ఓ నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐఆర్సీటీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. మహారాష్ట్రలో ఇటీవల కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఐఆర్సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
భారతీయ రైల్వే ప్రైవేట్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. వీటిలో అహ్మదాబాద్-ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ రూట్లో తేజస్ ఎక్స్ప్రెస్ రైలును నడుపుతోంది. ఈ రైలు గతేడాది జనవరి 17న ప్రారంభమైంది. 2020 జనవరి 17 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే గతేడాది మార్చిలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా భారతీయ రైల్వే రైళ్లన్నీ రద్దు చేయడంతో తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఆగిపోయాయి. ఆ తర్వాత భారతీయ రైల్వే దశలవారీగా రైళ్లను పునరుద్ధరించినా తేజస్ ఎక్స్ప్రెస్ సేవలు అప్పుడే ప్రారంభం కాలేదు. 2021 ఫిబ్రవరి 14 నుంచి వారంలో నాలుగు రోజులు తేజస్ ఎక్స్ప్రెస్ను నడిపింది ఐఆర్సీటీసీ.
కానీ మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 50 వేలకు పైగా యాక్టీవ్ కేసులున్నాయి. ఐఆర్సీటీసీ రద్దు చేసిన తేజస్ ఎక్స్ప్రెస్ మహారాష్ట్రలోని ముంబై-గుజరాత్లోని అహ్మదాబాద్ రూట్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు నడియాడ్, వడోదర, భరుచ్, సూరత్, వాపి, బోరివలి స్టేషన్లలో ఆగుతుంది. అందుకే ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ రైలును రద్దు చేసింది రైల్వే. నెల రోజుల పాటు అహ్మదాబాద్-ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ రూట్లో తేజస్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉండదు. మరోవైపు మరో రెండు నెలల్లో భారతీయ రైల్వే సేవలు కోవిడ్ కన్నా ముందు స్థాయికి చేరుకుంటాయని భారతీయ రైల్వే భావిస్తోంది. కానీ ఇటీవల కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రైల్వే సేవల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తారా లేదా అన్న డైలమా ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.