కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జనం టూర్లకు దూరమయ్యారు. ఎక్కడికైనా వెళ్లాలని ఉన్నా లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేకపోయారు. లాక్డౌన్ ఎత్తేయడంతో మళ్లీ టూర్లకు బయల్దేరుతున్నారు. మరి మీరు కూడా మూడునాలుగు రోజులు రిలాక్స్ అయ్యేందుకు ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. హైదరాబాద్ నుంచి పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ ప్యాకేజీ రూపొందించింది. గోవా డిలైట్ పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఫ్లైట్‌లో గోవా వెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసి తిరిగి ఫ్లైట్‌లోనే హైదరాబాద్ రావొచ్చు.
ఐఆర్సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ 2021 సెప్టెంబర్ 24న ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 27న ముగుస్తుంది. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 2 గంటలకు గోవా చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత జువారీ రివర్ సందర్శించొచ్చు. రాత్రికి అక్కడే బస చేయాలి. రెండో రోజు సౌత్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, బసిలికా ఆఫ్ బామ్ జీసెస్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్రైట్ గ్యాలరీ, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ సందర్శించొచ్చు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు మండోవీ నదిపై బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయొచ్చు.
మూడో రోజు ఉత్తర గోవా టూర్ ఉంటుంది. ఫోర్ట్ అగ్వాడా, కండోలిమ్ బీచ్, బాగా బీచ్ సందర్శించొచ్చు. అక్కడ పర్యాటకులు తమ సొంత ఖర్చుతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ సందర్శించొచ్చు. నాలుగో రోజు ఉదయం 11 గంటలకు హోటల్ నుంచి చెకౌట్ కావాలి. మధ్యాహ్నం 2.30 గంటలకు గోవాలో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 3.35 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.15,780. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,960, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,945 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి గోవాకు, గోవా నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ టికెట్లు, 3 రాత్రులు ఏసీ హోటల్లో వసతి, 3 బ్రేక్‌ఫాస్ట్, 3 డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, ఐఆర్సీటీసీ ఎస్కార్ట్ సర్వీస్ కవర్ అవుతాయి. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, రివర్ బోట్ క్రూజ్ లాంటివాటికి పర్యాటకులే సొంతగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.