2022వ సంవత్సరం స్టాక్‌మార్కెట్‌లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో) ద్వారా అడుగుపెట్టిన సంస్థలు తక్కువనే చెప్పాలి. మొత్తం 32 కంపెనీలు లిస్ట్ అవ్వగా అందులో 23 కంపెనీలు పాజిటివ్ లిస్టింగ్ గెయిన్స్ సొంతం చేసుకున్నాయి. 9 కంపెనీలు నెగెటివ్ లిస్టింగ్‌ను(Listing) ఎదుర్కొన్నాయి. 2023లో ఐపీవోల కోసం ఎక్కువ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రైమ్ డేటాబేస్(Data Base) అందించిన డేటా ప్రకారం.. దాదాపు 89 కంపెనీలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లను సమీకరించేందుకు మార్కెట్‌లోకి రానున్నాయి. 2021లో మెయిడెన్ ఇష్యూల ద్వారా 63 కంపెనీలు సమీకరించిన రూ. 1.19 లక్షల కోట్ల కంటే ఇది అధికం. 2022లో నవంబర్ వరకు 33 సంస్థలు రూ.55,145.80 కోట్లు సమీకరించాయి.
* ఐపీవోలలో ఇన్వెస్ట్ చేయడంపై ఆందోళన
2023లో IPOల పట్ల కొంతమంది ఫండ్ మేనేజర్లు ఉత్సాహంగా ఉన్నారు. IDFC MF అనూప్ భాస్కర్ మనీకంట్రోల్ మ్యూచువల్ ఫండ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లు చాలా ఫ్లాట్‌గా మారాయన్నారు. ఇటీవల లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇష్యూ ధర కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్నందున కొంతమంది ఇన్వెస్టర్లు ఇప్పుడు IPOలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతున్నారు. Nykaa, Zomato, PB Fintech వంటివి వాటాదారుల సంపదను గణనీయంగా తగ్గించాయని, ఇటీవల లిస్టెడ్ కంపెనీల ధరలు వాటి IPO స్థాయిలకు తిరిగి రాకపోతే, ఆందోళనలు కొనసాగుతాయని ఓ బ్రోకరేజ్ సంస్థలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ హెడ్ చెప్పారు.
* వెనక్కి తగ్గిన boAt
అస్థిర స్టాక్ మార్కెట్‌పై కొనసాగుతున్న ఆందోళనల మధ్య boAt తన పబ్లిక్ షేర్ విక్రయ ప్రణాళికలను వాయిదా వేసింది. ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి 60 మిలియన్ డాలర్లు సేకరించిందని నివేదికలు తెలిపాయి. Snapdeal కూడా IPO నుంచి వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఓలా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఈ సంవత్సరం IPO కోసం వెళ్లే అవకాశం ఉంది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్-ఆధారిత ఫుడ్ డెలివరీ కంపెనీ Swiggy కూడా SEBIకి ఆఫర్ పత్రాలను ఫైల్ చేయాలని చూస్తోంది. 2023లోనే IPO ద్వారా సుమారు 1 బిలియన్ డాలర్లని సేకరించాలని యోచిస్తోంది.
2023లో మార్కెట్ ఎదురుచూస్తున్న కొన్ని IPOలు
* Tata Play
టాటా ప్లే(గతంలో టాటా స్కై) క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్‌కి తన ఆఫర్ పత్రాన్ని దాఖలు చేసింది. కానీ ఇంకా క్లియరెన్స్ పొందలేదు. ఐపీవో అంచనా పరిమాణం రూ.2,500 కోట్లు. వాల్ట్ డిస్నీ కో తన మొత్తం 29.8 శాతం వాటాను ప్రతిపాదిత IPO సమయంలో ఆఫ్‌లోడ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. రూపర్ట్ మర్డోక్ నుంచి 21 సెంచరీ ఫాక్స్ ఎంటర్‌ట్రైన్‌మెంట్ బిజినెస్‌ని కొనుగోలు చేసినప్పుడు, టాటా ప్లేలో డిస్నీ వాటాను వారసత్వంగా పొందింది. 2008లో టాటా ప్లేలో 10 శాతం వాటాను కొనుగోలు చేసిన టెమాసెక్ క్యాపిటల్‌కు చెందిన బేత్రీ ఇన్వెస్ట్‌మెంట్స్ (మారిషస్) కూడా నిష్క్రమించే అవకాశం ఉంది. టాటా ప్లేలో మిగిలిన 60.2 శాతం వాటాను టాటా గ్రూప్ హెల్డ్ చేస్తోంది.
* Aadhar Housing Finance
బ్లాక్‌స్టోన్-బేస్డ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తన డ్రాఫ్ట్ పేపర్‌లను 2021 జనవరి 24న SEBIకి దాఖలు చేసింది. 2022 మే 5న గ్రీన్ సిగ్నల్ పొందింది. దీని ఇష్యూ పరిమాణం రూ.7,300 కోట్లు. డిసెంబర్ 12 వరకు SEBI అనుమతి పొందిన IPOలలో అతిపెద్దది. బ్లాక్‌స్టోన్-బేస్డ్ BCP Topco హౌసింగ్ ఫైనాన్షియర్‌లో 98.72 శాతం వాటాను కలిగి ఉంది. దాని నియంత్రణ వాటాను తగ్గించడం ద్వారా రూ.5,800 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది.
* OYO
OYO బ్రాండ్‌ను కలిగి ఉన్న Oravel Stays, దాని డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని 2021 అక్టోబర్‌లో దాఖలు చేసింది. IPOగా 2022లో రావాలని ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే అస్థిరత, బేరిష్ మార్కెట్ సెంటిమెంట్ కారణంగా వాయిదా వేసింది. 2023లో IPOని తీసుకురావడానికి SEBI అనుమతి కోసం వేచి ఉంది. రూ.8,430 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
* Mankind Pharma
మ్యాన్‌కైండ్ ఫార్మా IPO అంచనా ఇష్యూ మొత్తం రూ.5,500 కోట్లు. ఇది దేశీయ ఫార్మా కంపెనీ ద్వారా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటి కావచ్చు. బ్రాండెడ్ జెనరిక్ ఔషధాలతో పాటు, కంపెనీ ప్రముఖ బ్రాండ్లలో.. ప్రీగా-న్యూస్ ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్‌లు, మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌లు, గ్యాస్-ఓ-ఫాస్ట్ ఆయుర్వేదిక్ యాంటాసిడ్‌లు, మొటిమల నివారణ ఔషధం ఆక్నీస్టార్ ఉన్నాయి. భారతీయ మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించామని కంపెనీ తన DRHPలో పేర్కొంది. భారతదేశం తర్వాత దాని ప్రధాన మార్కెట్లు యూఎస్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్.
* Ixigo
2007లో మొదలైన ఇక్సిగో, ఒక ఆన్‌లైన్ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ. దీని పేరెంట్ కంపెనీ Le Travenues Technology. దీని IPO ఇష్యూ పరిమాణం రూ.1,600 కోట్లుగా అంచనా. FY23 మొదటి త్రైమాసికంలో, రూ. 8.7 కోట్ల నికర లాభాన్ని సాధించామని, ఐపీవో ద్వారా సమీకరించే నిధులు స్ట్రాటెజిక్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేస్తామని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడు అలోక్ బాజ్‌పాయ్ అన్నారు.
* Fabindia
ప్రముఖ దుస్తుల బ్రాండ్ ఫ్యాబిండియా ఇష్యూ పరిమాణం రూ.4,000 కోట్లు. ఫ్యాబిండియా, ఆర్గానిక్ ఇండియా వంటి దాని బ్రాండ్‌లు భారతదేశంలో మంచి గుర్తింపు పొందాయి. ఫ్రీ ప్రెస్ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినీ సింగ్ మాట్లాడుతూ.. చట్టబద్ధమైన అనుమతులు, స్టాక్ మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారులు, మధ్యవర్తుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న లాంచ్ సమయం నిర్ణయిస్తామన్నారు.
Yatra Online
క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ క్లియరెన్స్‌ని అందుకున్న ఇటీవలి కంపెనీలలో యాత్రా ఆన్‌లైన్ ఉంది. ఇది IPO ద్వారా రూ.750 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని స్ట్రాటెజిక్ ఇన్వెస్ట్‌మెంట్, అక్విజిషన్స్, ఇనార్గానిక్ గ్రోత్, కస్టమర్ అక్విజిషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్, ఇతర సేంద్రీయ వృద్ధి కార్యక్రమాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని యాత్ర యోచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPO, Oyo, Stock Market