బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరేమో.. ముఖ్యంగా ఆడవాళ్లైతే బంగారానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు.. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అలంకరించుకునే ఆభరణాల రూపంలోనే కాకుండా పెట్టుబడిగానూ చాలామంది బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ముందు ఏ రూపంలో దాన్ని తీసుకుంటే ఎక్కువ లాభాలు దొరుకుతాయో తెలుసుకొని ఆ తర్వాత పెట్టుబడి పెట్టడం మంచిది.
బంగారాన్ని పెట్టుబడిగా పెడితే అది ద్రవ్యోల్భణ కాలంలోనే కాదు, నగదు రూపంలో ఉండే రిస్క్‌ను కూడా విజయవంతంగా ఎదుర్కునే ధైర్యాన్ని ఇస్తుంది. చాలా దేశాలు పసిడిపై భారీగా మూలధన లాభ పన్నును కలిగి ఉన్నాయి. నిజానికి, బంగారం లో పెట్టుబడులు పెట్టడం అనేది సులభమైన పద్ధతిలో డబ్బు సంపాదించే మార్గమని చెప్పొచ్చు. బంగారాన్ని ఆభరణాలుగా చేసి, అమ్ముకొని డబ్బు సంపాదించొచ్చు, లేకపోతే బంగారాన్ని ఉన్నది ఉన్నట్టుగానైనా అమ్మేసి డబ్బు సమకూర్చుకోవచ్చు. అందుకే ఒక్కభారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనూ బంగారానికి విలువ ఉంది. అయితే ఆర్నమెంటల్ గోల్డ్, గోల్డ్ బార్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లల్లో ఏ విధంగా బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభమో మీరే తేల్చుకోండి..!
గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)
దేశీయ భౌతిక బంగారు ధరను గుర్తించే ఎక్స్ఛేంచ్-ట్రేడెడ్ ఫండ్‌ని గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. ఇవి బంగారంతోనే కేంద్రీకృతమై, దాన్నే పెట్టుబడిగా పెట్టుకునే సాధనాలు. సాధారణంగా ఇవి బంగారు ధరలపై ఆధారపడి, బంగారు కడ్డీలో పెట్టుబడి పెడతాయి. స్సష్టంగా చెప్పాలంటే, గోల్డ్ ఈటీఎఫ్‌లు పేపర్ రూపంలో ఉండి, డిమెటీరియలైజ్డ్ యూనిట్‌లు అయినప్పటికీ అసలు బంగారు ధరను కలిగి ఉంటాయి. అంటే ఒక గ్రాము బంగారం ఒక గోల్డ్ ఈటీఎఫ్‌తో సమానమన్నమాట! ఇది అధిక స్వచ్ఛత ఉన్న భౌతిక బంగారానికి మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా సులభంగా మీ బంగారాన్ని సమానమైన ధరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. అంటే మీరు గోల్డ్ ఈటీఎఫ్‌ను కొంటున్నారంటే, ఎలక్ట్రానిక్ రూపంలో బంగారాన్ని కొంటున్నట్లే లెక్క. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లను కూడా మీరు అమ్ముకోవచ్చు, అలాగే కొనుక్కోవచ్చు కూడా. అయితే మీరు గోల్డ్ ఈటీఎఫ్‌ను రీడీమ్ చేస్తున్నారంటే అందులో మీకు నిజమైన బంగారం మాత్రం రాదు. దానికి బదులుగా సమానమైన డబ్బులు వస్తాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌లు డిమెటీరియలైజ్డ్ అకౌంట్ (డీమాట్), బ్రోకర్ల ద్వారా ట్రేడింగ్ చేస్తారు. వీటి ద్వారా ఎలక్ట్రానికల్‌గా బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం ఎంతో సులువైన పద్ధతి. అయితే 99.5 శాతం ప్యూరిటీ ఉన్న బంగారు కడ్డీలనే గోల్డ్ ఈటీఎఫ్‌లుగా వినియోగిస్తారు. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ల ధరలను బిసిఇ/ ఎన్ ఎస్ ఇ వెబ్‌సైట్లల్లో చూడొచ్చు. అలాగే స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్‌లను ఏ సమయంలోనైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. గోల్డ్ జువెల్లరీ లా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌లను భారతదేశం మొత్తం మీద ఒకే ధరకు కొనుక్కోవచ్చు, అలాగే అమ్ముకోవచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోతారేమో అన్న భయం లేకుండా హాయిగా ఉండొచ్చు.
బంగారు కడ్డీలు (Gold Bars)
బంగారంపై పెట్టే ఇన్వెస్ట్‌మెంట్లో గోల్డ్ బార్స్‌ను కొనడం కూడా ఒకటి. అయితే ఈ గోల్డ్ బార్స్ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమై ఉండాలి. ఈ 24 క్యారెట్ బంగారమే 100% గోల్డ్ కనుక ఇదే ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇక బంగారాన్ని కొనే ముందు దానికి హాల్‌మార్క్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. బిఐఎస్ (Bureau of Indian Standards) హాల్‌మార్క్ ఉన్న బంగారు కడ్డీలు కొనడమే మంచిది. మీరు గోల్డ్ బార్‌లు కొనాలనుకుంటే మంచి పేరున్న గోల్డ్ రిఫైనరీల నుంచే కొనడం ఉత్తమం. ఎందుకంటే అదే అత్యధిక స్వచ్ఛత ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. అయితే అది కొనేటప్పుడు బంగారు కడ్డీ శుద్ధీకరణ గురించి ఆరాతీయాలి. ఎమ్ఎమ్‌టిసి పిఏఎమ్‌పి (ఇది MMTC , స్విట్జర్లాండ్‌కు చెందిన PAMP SA జాయింట్ వెంచర్), అలాగే బెంగళూరు రిఫైనరీలు రెండే భారతదేశంలో ఉన్న బంగారు శుద్ధి కర్మాగారాలు.
బంగారు ఆభరణాలు (Gold Jewellery)
బంగారం కుటుంబ వారసత్వంగా ఒక తరం నుంచి మరో తరానికి అందించే సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తుంది. బంగారు ఆభరణాలకు కేవలం డబ్బుకు సంబంధించిన విలువ మాత్రమే కాదు, ఎంతో సృజనాత్మకత ముడిపడి ఉన్న ఈ వస్తువులో సెంటిమెంటల్ విలువ కూడా ఉంది. మిషిన్ మీద తయారుచేసిన జువెల్లరీ అయినా, లేక తక్కువ ఆర్ట్ వర్క్‌తో కూడిన జువెల్లరీ అయినా వీటికి మేకింగ్ ఛార్జ్ తక్కువగా ఉంటుంది. ఇది బంగారు ధరకు 6% నుంచి 14% మధ్య రేంజ్‌లో ఉండొచ్చు. ఎక్కువ మొత్తంలో ఆభరాణాలు కొంటే కొందరు వ్యాపారస్థులు ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జ్ చేస్తారు. ఇక క్లిష్టమైన డిజైన్‌తో చేసే ఆభరణాలకు మేకింగ్ ఛార్జ్ 25% వరకూ ఉండొచ్చు. ఏదేమైనా బంగారు ఆభరణాలు కొనేముందు హాల్‌మార్క్ చెక్ చేసుకోవడం మాత్రం మరిచిపోకూడదు. ఇదే బంగారం స్వచ్ఛతను తెలియజేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold jewellery, Gold rate hyderabad