news18-telugu
Updated: November 23, 2020, 4:59 PM IST
ప్రతీకాత్మకచిత్రం
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి స్థిరమైన ఆదాయాన్ని సమకూరుస్తుందన్న విషయం తెలిసిందే. దీనిలో పెట్టుబడికి కాస్త నష్ట భయం ఉన్నా, స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ఉత్తమ ఎంపికగానే పరిగణించవచ్చు. అయితే, కొంతమంది పెట్టుబడిదారులు మైనర్ పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. అయితే, అటువంటి వారు తమ పిల్లల వయస్సు 18 ఏళ్లు నిండిన తర్వాత, అనగా మేజర్‌గా మారిన తర్వాత తమ పెట్టుబడి స్థితిని మార్చడం చాలా ముఖ్యం. పిల్లలు 18 ఏళ్ళు నిండిన తర్వాత మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను మైనర్ నుండి మేజర్‌గా ఎలా మార్చాలో తెలుసుకుందాం.
మేజర్ గా మారిన తర్వాత ఇలా చేయండి..మీ పిల్లల పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే సందర్భంలో మీ పిల్లవాడి పేరు మీద బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశం ప్రకారం మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడి మొత్తం మైనర్ పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా నుండే రావాలి. అయితే, మైనర్ పిల్లల విషయంలో బ్యాంక్ ఖాతాలో, మ్యూచువల్ ఫండ్ ఫోలియో రెండింటిలోనూ తల్లిదండ్రుల పేరు గార్డియన్ గా చేర్చబడుతుంది. గార్డియన్ అన్ని రకాల లావాదేవీలను నిర్వహించడానికి అనుమతి ఉంటుంది. కాగా, పిల్లవాడికి 18 ఏళ్ళు వయసు నిండినప్పుడు, ఫోలియో నియంత్రణ గార్డియన్ చేతిలో నుండి పిల్లవాడి చేతులోకి మారుతుంది. దాంతో 18 ఏళ్లు నిండిన పిల్లల తల్లిదండ్రులు మైనర్ ఫోలియోలో లావాదేవీలు చేయలేరు. అంతేకాక, వారి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టిపి), సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమాటిక్ విత్ డ్రాల్ ప్లాన్ (ఎస్డబ్ల్యుపి) వంటి అన్ని స్టాండింగ్ సూచనలు నిలిపివేయబడతాయి. ఈ సేవలను పునరుద్ధరించుకోవాలంటే KYC ప్రక్రియను పూర్తి చేసి, ఫోలియోను మైనర్ నుండి మేజర్‌కు మార్చాలి.
బ్యాంకు ఖాతాలో కూడా మార్పులు చేయాలా ?
మీ పిల్లవాడు మైనర్ నుండి మేజర్ గా మారిన సందర్భంలో మ్యూచువల్ ఫండ్‌తో పాటు బ్యాంకు ఖాతాలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను మొదట, దానికి కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మైనర్ పిల్లల పేరు మీద పెట్టుబడులు పెట్టినప్పుడు, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) అవసరం లేదు. కానీ, పిల్లవాడు 18 ఏళ్ళకు చేరుకున్నప్పుడు, పాన్ వివరాలు తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. పిల్లలకి ఒకవేళ, పిల్లలకి అప్పటికే పాన్ కార్డు ఉంటే పాన్ స్టేటస్‌ను మైనర్ నుండి మేజర్‌కు మార్చాల్సిన అవసరం ఉంది. దీనికి గాను పిల్లవాడు, సంరక్షకుడు ఇద్దరూ వ్యక్తిగతంగా బ్యాంకును సందర్శించాలి. బ్యాంకులో ‘పాన్ వివరాల మార్పు’ కేవైసీ ఫారమ్ ద్వారా వివరాలను అప్డేట్ చేసుకోవాలి. KYC అప్డేట్ను ఆన్లైన్లో లేదా కాగితం రూపంలో చేయవచ్చు. రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్ల (ఆర్టీఏ) ద్వారా మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ హౌస్‌లలో దేనితోనైనా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. బ్యాంక్ ఖాతా, మ్యూచువల్ ఫండ్ ఫోలియో రెండిట్లోనూ కేవైసీ ప్రక్రియను కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.
స్టేటస్‌ను మైనర్ నుండి మేజర్‌గా మార్చడం ఎలా ?
కేవైసీతో మీ బ్యాంకు ఖాతాను ‘మేజర్’కు మార్పు చేసిన తర్వాత, మీరు ఒక మైనర్ ఫోలియో ఉన్న ఫండ్ హౌస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రతి ఫండ్ హౌస్ తన వెబ్సైట్లో లేదా బ్రాంచ్ ఆఫీసులలో ‘మైనర్ నుండి మేజర్‌కు స్టేటస్ మార్పు’ అనే ఫారమ్‌ను కలిగి ఉంటాయి. మీరు ఈ ఫారమ్‌ను నింపి మీ బ్యాంకర్ నుండి స్టాంప్ చేసుకోని, ధృవీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫారం, కేవైసీ రసీదును, పాన్ కార్డు కాపీని మ్యూచువల్ ఫండ్ లేదా ఆర్టీఏ కార్యాలయంలో సమర్పించవచ్చు. ఒకవేళ మీరు ఒకే ఫండ్ హౌస్‌లో బహుళ ఫోలియోలను కలిగి ఉంటే, మీ ఫండ్ హౌస్ అనుమతిస్తుందో లేదో తనిఖీ చేసిన తర్వాత ఒక మీ సంతకం, మీ సంరక్షకుడి సంతకంతో లేఖను రాసి సమర్పించవచ్చు. కాగా, కొన్ని ఫండ్ హౌస్‌లు ఆన్లైన్లో పత్రాలను సమర్పించడానికి కూడా అనుమతిస్తాయి. దీనికి గాను మైనర్ ఫోలియో స్థితిని మేజర్‌గా మార్చడానికి పెట్టుబడిదారులు సంతకం చేసిన ఫారమ్‌ను స్కాన్ చేసి, ఆ కాపీలను ఫండ్ హౌస్‌కు చెందిన రిజిస్టర్డ్ ఈ–మెయిల్‌కు మెయిల్ చేయవచ్చు. ఈ–మెయిల్ పంపిన తర్వాత పెట్టుబడిదారుడు ఫండ్ హౌజ్ నుండి కాల్ పొందుతాడు. ఆ తర్వాత అతను భౌతిక పత్రాలను మాకు పంపాల్సి ఉంటుంది. ఫోలియో స్టేటస్ మేజర్‌గా మార్చిన తరువాత, మేజర్ పిల్లవాడే ఫోలియో మొదటి హోల్డర్ అవుతాడు. ఆ తరువాత మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో సురక్షితంగా లావాదేవీలు చేయవచ్చు. ఫోలియోలో జాయింట్ హోల్డర్లుగా తల్లిదండ్రులతో సహా ఎవరినైనా చేర్చవచ్చు. ఫోలియో స్థితిని మైనర్ నుండి మేజర్ కి మార్చడానికి మొత్తం 20 నుండి 30 రోజులు పట్టవచ్చు.
Published by:
Krishna Adithya
First published:
November 23, 2020, 4:59 PM IST