మార్చి 31తో పాత ఆర్థిక సంవత్సరం ముగిసింది. నేటి నుంచి 2023 ఆర్థిక సంవత్సరం(Financial Year) (ఏప్రిల్ 1 2022 నుంచి మార్చి 31 2023) ప్రారంభమైంది. ఏప్రిల్(April)- జూన్(June) త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (Small Savings Schemes) వడ్డీ రేట్లను (Interest Rates) యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికంలో కొత్తగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ బాండ్లలో కదలికలు, మెచ్యూరిటీ ఆధారంగా వడ్డీ రేట్లను(Interest Rates) ప్రతిపాదిస్తారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఈ నెల ప్రారంభంలో సిఫార్సు చేసిన వడ్డీ రేటు తగ్గింపు నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకొంది. సాధారణంగా, చిన్న పొదుపు రేట్లు ప్రభుత్వ బాండ్లపై రాబడులపై ఆధారపడి ఉంటాయి. అయితే g-సెక్ ఈల్డ్‌లలో కదలిక ఉన్నప్పటికీ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా వడ్డీ రేట్లను తగ్గించలేదు.
చిన్న పొదుపు పథకాలకు వర్తించే వివిధ రేట్లు ఏవి?
అత్యంత ప్రజాదరణ పొందిన స్థిర ఆదాయ ఉత్పత్తులలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF-Public Provident Fund).. 7.1 శాతం వడ్డీ అందిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) 6.8 శాతం రాబడిని ఇస్తుంది. ఆడ పిల్లల పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఏడాదికి 4 శాతంగా కొనసాగుతుంది. త్రైమాసికానికి చెల్లించడానికి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లకు 5.5 నుంచి 6.7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది, అయితే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు అధికంగా 5.8 శాతంగా ఉంది.
ఈ రేట్లు చివరిసారిగా ఎప్పుడు తగ్గించారు?
2021-22 (ఏప్రిల్-మార్చి) మొదటి త్రైమాసికంలో వడ్డీ రేట్లను సవరించారు. 40-110 బేసిస్ పాయింట్ల మేరకు భారీగా తగ్గించారు. అయితే ఈ ఉత్తర్వులు పర్యవేక్షణ లోపంతో వెల్లడించారని, నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వడ్డీ రేట్ల తగ్గింపు, ఆ తర్వాత ఉపసంహరణ జరిగింది. దీనికి ముందు రెండేళ్ల క్రితం 2020-21 మొదటి త్రైమాసికంలో వడ్డీ రేట్లు సవరించారు.
చిన్న పొదుపు వడ్డీ రేట్లపై యథాతథ స్థితి ఎందుకు ప్రధానం?
ఈపీఎఫ్‌వో డిపాజిట్లపై వడ్డీ రేటును ఇటీవల తగ్గించారు. ఈ క్రమంలో స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లను కొనసాగించాలనే నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్చి 12న రేట్లు 8.1 శాతానికి తగ్గించారు. ఇది నాలుగు దశాబ్దాలలో కనిష్ఠం.
గత వారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా సవరణలు చేస్తున్నట్లు చెప్పారు. ఈపీఎఫ్‌వోకు అన్నింటికంటే ఎక్కువ వడ్డీ దక్కుతోందని, వీటి వడ్డీ రేట్లు 40 సంవత్సరాలుగా మారలేదని చెప్పారు. ఆ ప్రభావమే ప్రస్తుతం సవరణకు దారి తీసిందని వివరించారు.
Pension Scheme: ఈ స్కీమ్‌లో ఈరోజు చేరితే నెలకు రూ.9,250పెన్షన్ ఇచ్చే పథకం
అంతేకాకుండా, గత వారం విడుదల చేసిన ఆర్థిక వ్యవస్థ నివేదికలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9-118 బేసిస్ పాయింట్ల పరిధిలో చిన్న పొదుపు పథకాల రేటును తగ్గించాలని పిలుపునిచ్చింది. ఫార్ములా-ఆధారిత రేట్లకు అనుగుణంగా స్మాల్ సేవింగ్స్ ఇన్‌స్ట్రుమెంట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు 2022-23 మొదటి త్రైమాసికానికి 9-118 బేసిస్ పాయింట్ల పరిధిలో తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నివేదికలో స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Interest rates, Nsc, PPF