ఇటీవలే ప్రముఖ విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, ఎయిర్‌ఏషియా తమ విమాన టికెట్ల ధరలపై అదిరిపోయే రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్గజ స్వదేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ ఇండిగో కూడా ప్రయాణికులకు తీపి కబురు అందించింది. తాజాగా ఇండిగో స్పెషల్ ఫైవ్ డే ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు కేవలం రూ. 1,122 ధరకే దేశీయ విమానాల టికెట్లను కొనుగోలు చేయవచ్చు. అన్నీ ఛార్జీలు కలిపి దేశీయ విమానాల టిక్కెట్ ప్రారంభ ధరను కేవలం రూ.1,122కే అందుబాటులోకి తేవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సేల్ డిసెంబర్ 27, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు కొనసాగుతుంది. ఈ ఐదురోజుల సమయంలో ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకుని వచ్చే ఏడాది జనవరి 15-ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించవచ్చు. ఇండిగో ఎయిర్‌లైన్‌లోని 150 కంటే ఎక్కువ దేశీయ విమానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఒకవేళ ప్రయాణికులు తమ జర్నీకి మూడు రోజుల ముందు షెడ్యూల్ మారిస్తే... ఈ ఆఫర్ కింద ఒక ఫ్రీ చేంజ్ ను పొందవచ్చు. భారతదేశంలోని స్పైస్‌జెట్ లిమిటెడ్, ఎయిర్‌ఏషియా ఇండియా, గోఫస్ట్‌లతో సహా ఇతర విమానయాన సంస్థలు ఇటీవల చాలా ఆఫర్లు ప్రకటించాయి. రెండు డోసుల టీకాలు తీసుకున్న ప్రయాణికులకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తామని గోఫస్ట్ ప్రకటించగా.. ఎయిర్‌ఏషియా ఇండియా, స్పైస్‌జెట్ సోమవారం డిస్కౌంట్ స్కీమ్‌లను ప్రారంభించి రూ. 1,122 స్టార్టింగ్ ధరతో విమానం టిక్కెట్లను అందించడం ప్రారంభించాయి.
ఈ క్రమంలోనే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఇండిగో కూడా దేశీయ విమానయాన నెట్‌వర్క్ సేవలపై బంపరాఫర్లు తీసుకొచ్చింది. ఇండిగో సేల్ అనేది దేశీయ జర్నీని ముందుగానే, సరసమైన ధరలకు బుక్ చేయడంలో ప్రయాణికులకు సహాయపడుతుందని ఆ కంపెనీ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు.
కరోనా వ్యాప్తికి కళ్లెం వేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీనికితోడు ఒమిక్రాన్ భయం వల్ల చాలా మంది ప్రయాణాలు చేయడానికే జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ధరకు విమాన టికెట్లను ఆఫర్ చేయడం ద్వారా ఫార్వర్డ్ బుకింగ్‌లను పెంచవచ్చని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. డిసెంబరులో ఎక్కువ మంది ప్రయాణికులు విమానాల్లో ట్రావెల్ చేస్తున్నారు. విమానయాన సంస్థలు దాదాపు 3,80,000 మంది రోజువారీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
కానీ ఫార్వర్డ్ బుకింగ్‌లు చాలా నెమ్మదిగా వస్తున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో ప్రయాణికులు లేక నష్టపోవడానికి బదులుగా రాయితీలు ప్రకటించి ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు కృషి చేస్తున్నాయి. అలాగే విమానయాన సంస్థలు కస్టమర్‌లకు మెరుగైన ప్రయాణ సౌలభ్యాన్ని అందించడానికి డేట్ చేంజ్, రీషెడ్యూల్ ఫీజులలో మినహాయింపులను అందిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.