Indian Space Companies: భారత అంతరిక్ష రంగానికి మంచి రోజులు.. స్పేస్ రేస్ లో టాప్ -3 ఇండియన్ కంపెనీలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

Indian Space Companies: భారత అంతరిక్ష రంగం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా పనిచేస్తోంది. అనేక విధాన మార్పులు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా అంతరిక్ష రంగం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది.

  • Share this:
గత దశాబ్ద కాలంలో అంతరిక్ష ప్రయోగాలు ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగాయి. అంతరిక్ష రంగంలో (Latest Telugu News) విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి కంపెనీలు ఈ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్‌లో గత కొద్ది కాలంగా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. రాకెట్లు నిర్మించడం, లాంచింగ్ వెహికల్స్, ఉపగ్రహాలను ప్రయోగించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం లాంటి వాటిపై ఖర్చు చేస్తున్నాయి.ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా పనిచేస్తోంది. అనేక విధాన మార్పులు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా అంతరిక్ష రంగం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ స్పేస్ ఎకానమీ 2 ట్రిలియన్ డాలర్లను అధిగమించగా.. ఇండియాలోనూ నిదానంగా వృద్ధి నమోదవుతుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో అంతరిక్ష రంగం వైపు చూస్తోన్న టాప్-3 కంపెనీలు ఏవో చూద్దాం.

* అగ్నికుల్ కాస్మోస్ (Agnikul Cosmos)
2016లో ప్రారంభమైన ఈ అంకుర సంస్థను ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం స్మాల్-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అయిన అగ్నిబన్‌ను డెవలప్ చేస్తోంది. ఇది 100 కిలోల పేలోడ్‌ను 700 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యంలో ఉంచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. LOX/కిరోసిన్ ఇంజిన్లు వీటి ప్రత్యేకత.

ఈ లాంచ్ వెహికల్‌లో 3డీ ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించారు. 2022లో ప్రయోగించనున్న ఈ లాంచ్ వెహికల్ మొదటి కమర్షియల్ ప్రయోగంగా భావిస్తున్నారు. ఇటీవలే ఫుల్లీ 3డీ ప్రింటెడ్ సెమీ-క్రియో రాకెట్ ఇంజిన్‌ను సంస్థ పరిక్షించింది. ఈ ఏడాది మేలో అగ్నికుల్ 11 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

* స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace)
అగ్నికుల్ మాదిరిగానే ఈ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ.. పేలోడ్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి రాకెట్లను నిర్మిస్తోంది. గత రెండేళ్లుగా ఈ స్టార్టప్ విక్రమ్ సిరీస్ లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేస్తోంది. ఈ సిరీస్‌కు భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాబాయి పేరు పెట్టారు. విక్రమ్-1 ను వాణిజ్యీకరించడంతో పాటు ఇదే వరుసలో విక్రమ్-2, విక్రమ్-3ను రూపొందించాలని ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. 2022 మధ్యలో విక్రమ్-1 లాంచ్ చేయాలని చూస్తోంది.

ఇప్పటికే కలాం-1 అనే సాలిడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌ను ఈ సంస్థ పరీక్షించింది. డిసెంబరు 2021 నాటికి విక్రమ్ రాకెట్‌కు శక్తినిచ్చే స్కేల్-అప్ వెర్షన్ ను నిర్మించి పరీక్షించనుంది. ఇప్పటికే సంస్థ 11 మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించింది. ఈ సంస్థలో పెట్టుబడిదారులుగా వాట్సాప్ గ్లోబల్ బిజినెస్ ఛీఫ్ నీరజ్ అరోర్, మింత్రా వ్యవస్థాపకులు ముఖేశ్ బన్సాల్ కూడా ఉన్నారు.

* పిక్సెల్..
అగ్నికుల్, స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలు లాంచ్ వెహికల్స్‌ను రూపొందిస్తుండగా.. పిక్సెల్ సంస్థ అంతరిక్షంలో 30 కిలోమీటర్ల పై నుంచి భూమిని పరిశీలించే సూక్ష్మ ఉపగ్రహాలపై (మైక్రో శాటిలైట్లు) పరిశోధనలు చేస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి పెట్టింది. సాంకేతికతను అభివృద్ధి చేయడం, ఉపగ్రహాల కూటమిని నిర్మించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం.
ఈ స్టార్టప్ కు మెషిన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం కూడా ఉంది.

పిక్సెల్ ఉపగ్రహాల కూటమి ప్రతి 24 గంటలకు గ్లోబల్ కవరేజీని అందిస్తుంది. ప్రపంచ దృగ్విషయాన్ని(global phenomena) పర్యవేక్షించడం, అంచనా వేయడం దీని విధులు. పిక్సెల్ తన మొదటి ఉపగ్రహమైన ఆనంద్ ను ఫిబ్రవరి 2021లో ప్రయోగించాలని అనుకుంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేశారు.

డిసెంబరు 2022 నాటికి 6 నుంచి 8 ఉపగ్రహాల కూటమిని మొదటి దశలో మోహరించాలని యోచిస్తోంది. డిసెంబరు 2023 నాటికి పూర్తి కూటమిని ప్రవేశపెట్టనుంది. 2020 ఆగస్టులో 5 మిలియన్లు సమీకరించగా.. ఈ ఏడాది మార్చిలో తన నిధులను 7.3 మిలియన్ డాలర్లకు పెంచింది.
Published by:Sridhar Reddy
First published: