కరోనా గోల్డ్ మార్కెట్‌పై కూడా తీవ్రంగా ప్రభావం చూపిందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మన దేశంలో బంగారం దిగుమతులు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి, లాక్డౌన్ వల్ల ఆభరణాలకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ధరలు కూడా ఎక్కువగా ఉండటంతో బంగారాన్ని కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపలేదు. దీంతో 2020లో దిగుమతులు 275.5 టన్నులకు పడిపోయినట్లు గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది. గతంలో 2009లోనే విదేశీ కొనుగోళ్లు ఇంత తక్కువకు పడిపోయాయి. గత సంవత్సరం డిసెంబర్లో దిగుమతులు 18 శాతం పెరిగి 55.4 టన్నులకు చేరుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివరాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అధికారికంగా వెల్లడించలేదు. లాక్డౌన్, ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండటం, డిమాండ్ తగ్గిపోవడం, ధరలు పెరగడం వంటి కారణాల వల్ల బంగారం వినియోగం చాలావరకు తగ్గిపోయింది.
భారతదేశంలో వినియోగానికి అవసరమయ్యే బంగారం విదేశీ మార్కెట్ల నుంచే వస్తోంది. కరోనా వల్ల విదేశాలకు సరకు రవాణా కోసం వెళ్లే విమాన సర్వీసులు తగ్గడం కూడా దిగుమతులు పడిపోవడానికి కారణమైంది. కానీ గత కొన్ని నెలలుగా రిటైల్ అమ్మకాలు పెరిగాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పేతే చెబుతున్నారు. పాత బంగారాన్ని కొని, రీసైక్లింగ్ చేసే ధోరణి పెరగడంతో స్క్రాప్ సేల్స్ పెరిగాయని ఆయన చెప్పారు.
డిమాండ్, వినియోగంతో సంబంధం లేకుండా పెట్టుబడులకు బంగారాన్ని ఎంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది. గత ఆగస్టులో గోల్డ్ ఫ్యూచర్స్ 30 శాతానికి పెరిగి రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసింది. గత తొమ్మిదేళ్ల గణాకాంలతో పోలిస్తే ఇదే అత్యధికం కావడం విశేషం. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన తరువాతే పరిశ్రమ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఆశిష్ చెప్పారు. ఈ సంవత్సరం జూన్, జూలై నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందే అవకాశం ఉంది. దీంతో ఆ తరువాతే వినియోగదారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు. అందువల్ల పండుగ సీజన్‌కు ముందు రెండు, మూడు నెలలే వ్యాపారం మెరుగ్గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆశిష్ వివరిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.