రూపాయి (Rupee) విలువ గత కొంతకాలం నుంచి బలహీనపడుతోంది. తాజాగా చరిత్రలో ఎన్నడు లేనంతగా పడిపోయింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతుండటంతో భారత వాణిజ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. మరోపక్క మార్కెట్లలో రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టే వారి సంఖ్య తగ్గిపోవడం, అంతర్జాతీయ కారణాల వల్ల డాలర్ విలువ నానాటికీ పెరుగుతుండడం వంటి కారణాలతో గురువారం రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 77.72కు పడిపోయింది.
రూపాయి పతనం ఇలా..
గతకొన్ని నెలలుగా రూపాయి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. రూపాయి విలువ జనవరి 12, 2022న ఒక డాలర్‌కి 73.77గా ఉండేది. అప్పటి నుండి దాదాపు రూ.4 పడిపోయి గురువారం నాటికి 77.72కి చేరుకుంది. అయితే రూపాయి పతనం నిరంతరాయంగా కొనసాగలేదు. మొదటగా జనవరి 12- మార్చి 8 మధ్య బలహీనపడిన రూపాయి 77.13కు చేరింది. ఆ తరువాత ఏప్రిల్ 5 వరకు మళ్లీ పుంజుకున్న రూపాయి. డాలర్ మారకంతో రూ.75.23కు చేరుకుంది. ఆపై మళ్లీ ఒడిదుడుకులకు లోనుకావడంతో నిరంతర పతనాన్ని చవిచూస్తూ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలను తాకింది.
* రూపాయి పతనానికి కారణాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ భౌగోళిక రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో US ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కఠినమైన ద్రవ్య విధానాన్ని అమలు చేయడంతో US డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ బలహీనపడింది. అలాగే ముడి చమురు ధరలు పెరగడం , మరోపక్క డాలర్ బలం పుంజుకోవడంతో రూపాయి పతనానికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తన నోట్లో ఇలా పేర్కొంది. ‘‘అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అల్ట్రా-లూజ్ మానిటరీ పాలసీని ఉపసంహరించుకోవడమే కాకుండా పాలసీ రేట్లను పెంచేలా ప్రపంచ దేశాల బ్యాంకులను ప్రేరేపించింది. ఆర్బీఐ కూడా మే4న పాలసీ వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఇక US ఫెడ్ తన పాలసీ రేటును మార్చి 2022లో మొదటిసారిగా 25 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. ఆ తరువాత మేలో మరో 50 బేసిక్ పాయింట్లను పెంచింది.’’ అంటూ నోట్లో పేర్కొంది.
US ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కఠినమైన ద్రవ్య విధానాన్ని అమలు చేయడంతో భారత్‌లో పెట్టుబడి ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపింది. మే 16 వరకు విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం నుంచి 21.2 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇది భారత రూపాయి, ఫారెక్స్ రిజర్వ్‌పై అకస్మాత్తుగా ఒత్తిడి తెచ్చిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది.
మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) రాహుల్ కలంత్రి మాట్లాడుతూ... విదేశీ నిధుల తరలింపు, ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ బలం పెరగడం వంటి కారణాలతో రూపాయి పతనమైందన్నారు.
కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనింద్య బెనర్జీ మాట్లాడుతూ... ఔట్ పెర్ఫార్మర్గా ఉన్న రూపాయి మే 4న ఆర్బీఐ పెంచిన వడ్డీ రేట్లు అమలులోకి రావడంతో రూపాయి అండర్పెర్ఫార్మర్గా పడిపోయిందని అన్నారు. స్పాట్ అండ్ ఫార్వర్డ్ మార్కెట్లలో US డాలర్‌ను దూకుడుగా అమ్మేవారిగా RBI మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్వార్డ్ ప్రీమియం భారీగా పడిపోవడమే అందుకు నిదర్శనమన్నారు.2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా డాలర్‌తో పోల్చితే భారత రూపాయి విలువ మారకంలో 78.19కి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.