INDIAN RESIDENTIAL REAL ESTATE THE NEW HOTSPOT FOR NRI INVESTMENTS AMID COVID 19 MK GH
Real Estate: కరోనాతో రియల్ ఎస్టేట్‌కు కొత్త కళ...NRI కస్టమర్లతో డాలర్ల పంట...
ప్రతీకాత్మక చిత్రం
సాధారణంగా యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఎన్ఆర్ఐలు పంపే నిధుల్లో 42% కేవలం ఈ దేశాల నుంచే వస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లకు పౌరసత్వం ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఏళ్లుగా అక్కడ పనిచేసిన భారతీయులు కూడా స్వదేశంలో ఆస్తులు కొనడానికి ఆసక్తి చూపుతారు.
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగ, వ్యాపార అవకాశాలు దెబ్బతిన్నాయి. వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి ఇంకా పోలేదు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే భారతీయులు కరోనా కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అనుకోని విపత్తులు ఎదురైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న చాలామందిని ఆలోచింపజేసింది. ఎప్పటికైనా స్వదేశంలో ఇల్లు లేదా ఆస్తులు ఉంటే మేలనే నిర్ణయానికి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు వచ్చారు. ఈ ఉద్దేశంతోనే ఎన్ఆర్ఐలు సొంత గడ్డపై భూమి, ఆస్తులు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.
కరోనా విపత్తు ప్రస్తుతం ఎన్ఆర్ఐలకు వరంగా మారిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరోక్ విశ్లేషిస్తుంది. రూపాయి విలువ తగ్గడంతో రియల్ ఎస్టేట్‌ను పెట్టుబడి ఎంపిక చేసుకోవాలని వారు భావిస్తున్నారు. డెవలపర్లు కూడా ఈ డిమాండ్ ను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. వైరస్ విజృంభణ కారణంగా గత కొన్ని నెలలుగా పరిశ్రమ మందగించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
డిమాండ్ పెరగడానికి కారణాలేంటి ?
అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకోవడం, దేశంలో నెలకొల్పుతున్న ఉత్పత్తి, తయారీ కర్మాగారాల సంఖ్య పెరగడం వంటివి రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు ఇలాంటి పోకడలను అంచనా వేయడంలో ఎప్పుడూ ముందుంటారు. భారతదేశంలో ఎన్నారైల పెట్టుబడులు వచ్చే ఆర్థిక సంవత్సరంనాటికి 13.1 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కొన్ని సంస్థలు అంచనా వేస్తునన్నాయి. దీనికి తోడు రెరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్ఆర్ఐ రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ చట్టం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంపై విశ్వసనీయత పెరగడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
ఏయే దేశాల ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపుతున్నారు?
సాధారణంగా యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఎన్ఆర్ఐలు పంపే నిధుల్లో 42% కేవలం ఈ దేశాల నుంచే వస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లకు పౌరసత్వం ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఏళ్లుగా అక్కడ పనిచేసిన భారతీయులు కూడా స్వదేశంలో ఆస్తులు కొనడానికి ఆసక్తి చూపుతారు. కరోనా కారణంగా విదేశాలలో నివసిస్తున్న భారతీయుల ఆలోచనలు మారినట్టు తెలుస్తోంది. ఏనాటికైనా స్వదేశంలోనే స్థిరపడాలనే లక్ష్యంతో ఎక్కువమంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఎలాంటి ఆస్తులు కొంటున్నారు?
గతంలో రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్ రియల్ ఎస్టేట్‌లో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టేవారు. వాటి నుంచి అద్దె రూపంలో రాబడి ఆశించేవారు. కానీ ఇప్పడు చాలామంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ కోసమే ఆరా తీస్తున్నారు. మిడ్-సెగ్మెంట్ హౌసింగ్, ప్రీమియం, లగ్జరీ, సూపర్ లగ్జరీ ప్రాపర్టీలన్నింటికీ ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తరువాత న్యూ దిల్లీ, ముంబైలలో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ఎలాంటి ప్లాట్లకు డిమాండ్ పెరిగింది?
ప్రస్తుతం భద్రత, రక్షణ కల్పించే ప్రాజెక్టుల్లో రెడీ-టు-మూవ్-ఇన్ జాబితాకు డిమాండ్ బాగా పెరిగింది. రీసేల్ ఫ్లాట్లపై జీఎస్టీ లేకపోవడంతో, సిద్ధంగా ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో పెద్ద కంపెనీల డెవలపర్లు ప్రయోజనం పొందుతున్నారు. రూపాయి విలువ పడిపోవడంతో మన దేశంలో ఎన్నారైలు ఇల్లు కొనడానికి చేయాల్సిన ఖర్చు తగ్గింది. ఈ చర్యలన్నీ కలిసి ఎన్ఆర్ఐలు దక్షిణ భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి మార్గాన్ని సృష్టించాయి. ఎక్కువ మంది ఇళ్లు, ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో డిమాండ్ బాగా పెరిగింది.
సొంత ఇంటి అవసరాలను కరోనా, లాక్డౌన్ చాలామందికి గుర్తు చేసింది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశం. 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు రియల్ ఎస్టేట్ రంగం చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 నాటికి భారతదేశ జీడీపీలో ఈ రంగం వాటా 13శాతానికి పెరగనుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.