దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Government) పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. గతంలో ‘రామాయణ యాత్ర’ (Ramayana Yatra) పేరుతో చేపట్టిన రైలు యాత్రకు పర్యాటకులు, భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, ఈ సర్వీస్‌ను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఏప్రిల్ 7 నుంచి ‘రామాయణ యాత్ర’ ప్రారంభం కానున్నట్లు రైల్వే విభాగం ప్రకటించింది. ఈ టూర్‌ను కవర్ చేసే భారత్ గౌరవ్ ట్రైన్, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి, తెలంగాణలోని భద్రాచలం మీదుగా వెళుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
* 18 రోజుల యాత్ర
సీతారాములకు సంబంధించిన ప్రాంతాలను కలుపుతూ పోయేదే ఈ ‘రామాయణ యాత్ర’. ఇది 18 రోజుల పాటు కొనసాగనుంది. దేశంలోని ప్రముఖ క్షేత్రాలైన అయోధ్య, వారణాసి, హంపి, భద్రాచలం, రామేశ్వరం ఆలయాలను పర్యాటకులు సందర్శించవచ్చు. సఫ్దర్‌జంగ్ నుంచి మొదలై అయోధ్య, నందిగ్రామ్, సీతామర్హి, బక్సార్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, శృంగవేరిపురం, చిత్రకూట్, నాశిక్, హంపి, రామేశ్వరం, భద్రాచలం, నాగ్‌పూర్, ప్రాంతాలను ట్రైన్ కవర్ చేస్తూ చివరికి ఢిల్లీ చేరుకుంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.
* మొదటి దర్శనం అయోధ్య
అయోధ్యలో రామజన్మభూమి, రామమందిర సందర్శనతో రామాయణ యాత్ర మొదలవుతుంది. సరయు నదీ హారతిని పర్యాటకులు వీక్షించవచ్చు. అనంతరం నందిగ్రామ్‌లోని భరతమందిరం, సీతామర్హిలోని జానకి మందిరం, జనకపురిలోని జానకీ రామ మందిరం.. ఇలా తదితర ముఖ్య ఆలయాలను దర్శించుకోవచ్చు. వారణాసిలోని విశ్వనాథ ఆలయం, గంగా హారతి, తులసీ మానస్ ఆలయం; బక్సార్‌లోని రామ్ రేఖా ఘాట్; ప్రయాగ్ రాజ్‌లోని భరద్వాజ ఆశ్రమం, గంగా-యమున సంగమం, ఆంజనేయ ఆలయం; చిత్రకూట్‌లోని రామ్‌ఘాట్, సతీ అనసూయ ఆలయం; నాసిక్ త్రయంబకేశ్వర్, పంచవటి; హంపీలోని విరూపాక్ష ఆలయం; భద్రాచలం శ్రీ సీతారామ స్వామి ఆలయం; రామేశ్వరం రామనాథ స్వామి ఆలయాలను ఈ పర్యటనలో సందర్శించే వీలుంది.
* విలాసవంతమైన ట్రైన్
‘రామాయణ యాత్ర’కు భారతీయ రైల్వే ‘భారత్ గౌరవ్’ ఏసీ రైలును కేటాయించింది. భారత ప్రభుత్వ కార్యక్రమాలైన ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’, ‘దేఖో అప్నా దేశ్’లకు మరింత ప్రచారం కల్పించేందుకు రైల్వే విభాగం ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ ట్రైన్‌ని ఎంచుకుంది. ఇది అత్యంత విలాసవంతమైన రైలు.
ఏసీ1, ఏసీ2 క్లాస్‌లతో కూడిన కోచ్‌లు ఉంటాయి. మొత్తం 156 మంది టూరిస్టులు ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఒక్కో కోచ్‌కి ఒక్కో సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఫూట్ మసాజర్లు, సెన్సార్‌తో కూడిన వాష్‌రూమ్ ఫంక్షన్స్, డైనింగ్ రెస్టారెంట్స్, అధునాతన వంటగది ఈ రైలు సొంతం.
ఇది కూడా చదవండి : రైలు మిస్ అయితే అదే టికెట్‌పై మరో రైలు ఎక్కొచ్చు... కానీ ఓ కండీషన్
* స్టాపులు ఎక్కడ?
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషనులో రైలు ఎక్కవచ్చు. ఘజియాబాద్, అలీఘర్, టండ్లా, ఎతవాహ్, కాన్పూర్, లక్నోలో ట్రైన్ బోర్డింగ్ చేయవచ్చు. ఆగ్రా, మధుర, గ్వాలియర్, విరంగణ లక్ష్మీ భాయ్ స్టేషన్లలో రైలు దిగేందుకు వీలుంది.
* ప్యాకేజీ ఎంత
‘రామాయణ యాత్ర’కు ఒక్కొక్కరికి రూ.1లక్షకు పైగా ఖర్చు అవుతుంది. వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి రూ.1,14,065; ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించే వారు రూ.1,46,545 చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ గదుల్లో విడిది, ఏసీ హోటళ్లలో భోజనం, వెజ్ మీల్స్, ఇతర ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులన్నీ ఈ ప్యాకేజీ పరిధిలోకి వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Ayodhya Ram Mandir, Indian Railways, Ramayana