రైళ్లల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు రక్షణగా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలపై మహిళా ప్రయాణికులకు (Woman Passengers) అవగాహన తక్కువే. 1989లోనే ఒంటరిగా ప్రయాణించే మహిళలకు రక్షణగా నిలిచేలా కొన్ని చట్టాలను రూపొందించారు. ఆ చట్టం ప్రకారం మహిళలు రక్షణ పొందొచ్చు. ఉదాహరణకు భారతీయ రైల్వే యాక్ట్ (Indian Railway Act) 1989 లోని సెక్షన్ 139 ప్రకారం ఒక మహిళా ప్రయాణికురాలు పురుషుల తోడు లేకుండా ఒంటరిగా లేదా తన బిడ్డతో ప్రయాణిస్తుంటే, ఆమెకు రైల్వే పాస్ లేదా టికెట్ లేదన్న కారణంతో రాత్రి సమయంలో రైలు నుంచి దిగమని రైల్వే సిబ్బంది ఆదేశించకూడదు. ఒకవేళ రైల్వే అధికారుల దగ్గర మహిళా కానిస్టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మహిళను బయటకు వెళ్లమని కోరవచ్చు.
ఇక భారతీయ రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 311 ప్రకారం మిలిటరీ సిబ్బంది మహిళల కోసం కేటాయించిన కంపార్ట్మెంట్లలోకి ప్రవేశిస్తే, అలాంటి బోగీల్లోకి ప్రవేశించకుండా వారిని మర్యాదపూర్వకంగా నిరోధించాలి. జనరల్ బోగీల్లో ప్రయాణించమని వారికి సలహా ఇవ్వాలి. భారతీయ రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 162 ప్రకారం 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయి మాత్రమే మహిళల కోసం కేటాయించిన బోగీలో ప్రయాణించడానికి అనుమతిస్తారు. లేడీస్ కోచ్‌లలోకి ప్రవేశించే మగ ప్రయాణికులు చట్టం ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
Tirupati Tour: హైదరాబాద్ టు తిరుపతి టూర్... తెలంగాణ టూరిజం ప్యాకేజీ రూ.4,000 లోపే
ఇవి కాకుండా భారతీయ రైల్వే మహిళలకు పలు సదుపాయాలను కల్పిస్తోంది. రైల్వే బెర్తుల్లో రిజర్వేషన్ కల్పిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే స్లీపర్ క్లాస్ బోగీల్లో ఆరు బెర్తులు మహిళలకు కేటాయించింది. గరీబ్ రథ్, రాజధాని, దురంతో రైళ్లల్లో థర్డ్ క్లాస్ బోగీల్లో, ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఆరు బెర్తుల్ని కూడా కేటాయించింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ బెర్తుల్ని కేటాయిస్తోంది రైల్వే.
ఇక లోయర్ బెర్తుల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. స్లీపర్ క్లాసులో ప్రతీ కోచ్‌లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్తులు, థర్డ్ ఏసీ బోగీల్లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్తులు, సెకండ్ ఏసీలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్తులు కేటాయించడం విశేషం. ఈ బెర్తుల్ని వృద్ధులు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణుల కోసం ప్రత్యేకంగా కేటాయించింది.
Jio Plans: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఐపీఎల్ ఫైనల్ ఫ్రీగా చూడండి
ఇక మహిళల భద్రత, రక్షణ కోసం నిత్యం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మహిళా సిబ్బందితో రైళ్లల్లో తనిఖీలు చేయిస్తోంది. గవర్నమెంట్ రైల్వే పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ సహాయం కూడా తీసుకుంటోంది. ఇక ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మేరీ సహేలీ కార్యక్రమాన్ని దేశమంతా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు రైలు ఎక్కిన స్టేషన్ నుంచి గమ్యస్థానం చేరుకునే వరకు భద్రతను అందిస్తోంది.
ఇక రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లల్లో కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. మహిళలతో పాటు రైల్వే ప్రయాణికుల కోసం 139 ఇండియన్ రైల్వేస్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను 24 గంటల పాటు అందుబాటులో ఉంచింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా మహిళల సమస్యల్ని తెలుసుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Railways, WOMAN, Women