• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • INDIAN RAILWAYS DEPLOYS COVID CARE COACHES IN FOUR STATES AMID RISING COVID 9 CASES MK GH

Covid Care Coaches: ఐసోలేషన్​ కేంద్రాలుగా మారుతున్న రైల్వే కోచ్​లు.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే..?

Covid Care Coaches: ఐసోలేషన్​ కేంద్రాలుగా మారుతున్న రైల్వే కోచ్​లు.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

Covid Care Coaches: ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత.. ఐసోలేషన్​ కేంద్రాలుగా మారుతున్న రైల్వే కోచ్​లు.. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే..

  • Share this:
దేశంలో కరోనా వైరస్​ సెకండ్​ వేవ్​ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఆసుత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. దీంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే బోగీలను మళ్లీ ఐసోలేషన్​ వార్డులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది కరోనా మహమ్మారి ప్రారంభంలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడటంతో రైల్వే కోచ్​లను ఐసోలేషన్​ కేంద్రాలుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. దీంతో రోగులు పడిగాపులు కాస్తూ ఆసుపత్రి బయటే ప్రాణాలొదిలేస్తున్న హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే మరోసారి కోచ్​లను ఐసోలేషన్​ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్​ మేరకు ఈ కోచ్​లను ఆయా ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కరోనా రోగుల కోసం ఈ బోగీలను ఎనిమిది క్యాబిన్లుగా విభజించారు. ఒక్కో కోచ్‌లో16 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో మూడు మరుగుదొడ్లు, దోమతెరలు, బయో టాయిలెట్లు, పవర్ సాకెట్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. రోగులకు ఫ్లూయిడ్ ఎక్కించేందుకు బాటిళ్లను, అదనపు బాటిల్ హోల్డర్లును, వాటిని వేలాడదీయడానికి క్లాంప్స్​ను ఏర్పాటు చేశారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. " ప్రస్తుతం కరోనా సెకండ్​ వేవ్​తో దేశం పోరాడుతున్నందున, కోవిడ్ కేర్ ఐసోలేషన్ కోచ్​లను తిరిగి ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కోచ్​లలో రోగుల వైద్యానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాం. ఈ కోవిడ్ కేర్ కోచ్‌లు తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్ రోగులను రక్షించేందుకు ఉపయోగపడతాయి. ఎండా కాలం కావడంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లను ఏర్పాటు చేశాం”అని పేర్కొంది.

4,000 కోవిడ్​ కేర్​ కోచ్​ల ఏర్పాటు..
కరోనా రోగుల అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం 64,000 బెడ్లతో దాదాపు 4,000 కోవిడ్ కేర్ కోచ్‌లను దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని ఇప్పటికే కరోనా ఫస్ట్​ వేవ్​లో రోగుల అవసరాలను తీర్చగా.. మరికొన్ని కొత్తగా ఏర్పాటయ్యాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలోని శకుర్​బస్తి స్టేషన్​లో 800 బెడ్లతో కూడిన 50 కోచ్​లు, మహారాష్ట్రలోని నందూర్​ బార్​ జిల్లాలో 378 బెడ్లతో కూడిన 21 కోవిడ్​ కేర్​ కోచ్​లను ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు భోపాల్ స్టేషన్‌లో 20 బోగీలు, పంజాబ్‌లో 50 కోచ్‌లు, జబల్‌పూర్‌లో 20 కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు మరిన్ని రైల్వే కోచ్​లను ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ఐసోలేషన్ కేంద్రాలు తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగుల అవసరాలను తీర్చగలవని పేర్కొంది. ఆయా రోగులకు క్యాటరింగ్ ఏర్పాట్లు అందించడానికి, ఈ కోచ్​లలో పరిశుభ్రత పాటించడానికి రైల్వే అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఐసోలేషన్ కోచ్‌లు రాష్ట్ర ప్రభుత్వాల వినియోగం మేరకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. కోచ్‌ల నిర్వహణ బాధ్యతను రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటాయి.
Published by:Krishna Adithya
First published: