INDIAN IT ENGINEERS ARE EARNINGS MORE SENSATIONAL REPORT MK GH
Indian IT Engineers: భారత ఐటీ ఇంజినీర్లు తెగ సంపాదించేస్తున్నారట...సంచలన రిపోర్ట్...
(ప్రతీకాత్మక చిత్రం)
భారతీయ ఐటీ నిపుణులు అత్యధిక వేతనాలను అందుకుంటున్నారు. ప్రారంభంలో ఫ్రెషర్స్ కాస్త తక్కువ జీతాలు అందుకుంటున్నప్పటికీ, అనుభవం పెరిగే కొద్ది వారికి ఆయా కంపెనీలు రెట్టింపు జీతాలను ఆఫర్ చేస్తున్నాయి.
అత్యధిక వేతనాలు అందుకునే జాబ్ ఏదంటే టక్కున గుర్తుకొచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగమే. పాతికేళ్లు నిండకుండానే ఐదంకెల జీతం అందుకునే అవకాశం, ఆ తర్వాత విలాసవంతమైన జీవితం అందుకే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే యువతలో అంత క్రేజ్ ఏర్పడింది. అయితే, నిజంగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు అందుకుంటున్నారా? ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులతో పోలిస్తే వీరి జీతాలు ఎందుకు ఇలా అమాంతం పెరుగుతున్నాయి? అనే ప్రశ్నలపై ఆసక్తికరమైన చర్చ లేపారు ఇండియా గోల్డ్ వ్యవస్థాపకుడు దీపక్ అబోట్. భారత ఐటి ఇంజనీర్ల జీతాల గురించి ఆయన ఇటీవల చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారి సోషల్‌మీడియాలో చర్చకు దారితీసింది.
ఆయన ట్వీట్లో “భారతీయ ఐటీ నిపుణులు అత్యధిక వేతనాలను అందుకుంటున్నారు. ప్రారంభంలో ఫ్రెషర్స్ కాస్త తక్కువ జీతాలు అందుకుంటున్నప్పటికీ, అనుభవం పెరిగే కొద్ది వారికి ఆయా కంపెనీలు రెట్టింపు జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారితే 1.5 నుండి 2 రెట్ల జీతం పెరుగుతోంది. స్టార్టప్ కంపెనీల వృద్ధికి ఇది ఇబ్బంకరమైన అంశం. ఎందుకంటే పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించి ఐటి నిపుణులను రిక్రూట్ చేసుకోవడం వాటికి కష్టంతో కూడుకున్న పని. ఇలా, ఎమ్ఎన్సీ కంపెనీలు ఎక్కువ జీతాలు ఆఫర్ చేస్తూ భారతీయ స్టార్టప్ సంస్థలను నష్టపరుస్తున్నాయి.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా చూపుతూ.. ‘‘నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ప్రారంభంలో రూ.15 లక్షల వార్షిక వేతనం ఉండగా.. అది ఏడాదిలోనే రూ .22 లక్షలకు పెరిగింది. ఇప్పుడు అదే వ్యక్తికి రూ .40 లక్షల వార్షిక ప్యాకేజీతో వేరే కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. కాబట్టి, అతడు ఆ కంపెనీకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇక, మరొక ఇంజనీర్ కేవలం ఒక్క ఏడాదిలోనే మూడు రెట్ల జీతం పెంపును పొందాడు.
ప్రారంభంలో అతని జీతం రూ .12 లక్షలు ఉండగా, అది రూ .36 లక్షలకు పెరిగింది. అంటే, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మారినప్పుడల్లా వారు 1.5 నుంచి 2 రెట్ల పెంపును పొందుతున్నారు. ఇది, స్టార్టప్ సంస్థలకు శరాఘాతంలా మారింది.’’ అని అబాట్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇతర పరిశ్రమలలోని వ్యక్తులతో పోలిస్తే భారతీయ ఐటీ నిపుణులు చాలా ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని గుర్తుచేశారు.
భారీ వేతనాలు స్టార్టప్ కంపెనీల వృద్ధికి ఆటంకమా?
అయితే, ప్రముఖ వెబ్సైట్ గ్లాస్‌డోర్ మాత్రం దీనికి కాస్త భిన్నమైన గణాంకాలను వెల్లడించింది. అబోట్ తెలిపిన శాలరీలతో పోలిస్తే భారతీయ ఐటీ ఇంజినీర్లు వాస్తవికంగా తక్కువే సంపాదిస్తున్నారని తెలిపింది. భారతదేశంలో ఒక ఐటీ ఇంజనీర్ సగటు వార్షిక వేతనం రూ. 6,92,585 గా ఉందని గ్లాస్‌డోర్ పేర్కొంది. అయితే, వేతనంలో పెంపుదల అనేది.. ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ, అతని అనుభవంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే, దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ ఉద్యోగులు మాత్రం అత్యధిక వేతనాలను అందుకుంటున్నారని వెల్లడించింది. గ్లాస్‌డోర్ వివరాల ప్రకారం, గూగుల్ ఇండియాలో ఒక ఐటీ ఇంజనీర్ నెలవారీ సగటు జీతం రూ .9,68,926 గా ఉంది. అనుభవాన్ని బట్టి వారి జీతం రూ .6,81,720 నుంచి రూ .28,89,579 మధ్య ఉంటుందని గ్లాస్‌డోర్ పేర్కొంది. ఇక, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో ఒక ఇంజనీర్‌కు సగటు జీతం సంవత్సరానికి రూ. 5 లక్షలుగా ఉందని, అదేవిధంగా, ఎరిక్సన్ కంపెనీలో పనిచేసే ఒక ఇంజనీర్ సగటు జీతం రూ. 5,62,041గా ఉందని తెలిపింది. ఇక సిస్కో ఇండియా సగటు జీతం రూ. 11,40,017 ఉందని పేర్కొంది.
కాగా, భారతదేశంలో చాలా మంది మిడ్-లెవల్, జూనియర్ ఐటి ఇంజనీర్లు సంవత్సరానికి 5 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఈ జీతాలు అబోట్ ట్వీట్ సూచించినంత ఎక్కువగా లేనప్పటికీ, భారతదేశంలో సగటు వేతనంతో పోలిస్తే ఇవి ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు.