Mukesh Ambani: నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం: ముఖేష్ అంబానీ

ముకేశ్ అంబానీ (File)

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, గ్లోబల్ లీడర్‌గా ఎదిగే అవకాశం ముంగిట ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ ఎండీ ముఖేష్ అంబానీ అన్నారు.

  • Share this:
    నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ నాయకత్వ భూమిక పోషిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. టీఎం ఫోరమ్ నిర్వహించిన సదస్సులో రిలయన్స్ జియో ప్రయాణం, భారత డిజిటల్ భవిష్యత్తు అంశంపై ముఖేష్ అంబానీ ప్రసంగించారు. మొదటి రెండు పారిశ్రామిక విప్లవాలను భారత్ అందుకోలేకపోయిందని, మూడో పారిశ్రామిక విప్లవం లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నా రేస్‌లో ఇండియా కొంచెం వెనుకబడే ఉందన్నారు. ఇక నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, గ్లోబల్ లీడర్‌గా ఎదిగే అవకాశం ముంగిట ఉందన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, క్లౌడ్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఐఓటీ, స్మార్ట్ డివైజెస్, కృత్రిమ మేథస్సు, రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, జెనోమిక్స్ లాంటివి ఈ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించనున్నాయన్నారు. ఇందులో మూడు ముఖ్యమైనవి అవసరం అవుతాయని, అవి హైస్పీడ్ కనెక్టివిటీ, తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ అప్లికేషన్లు - పరిష్కారాలుగా ముఖేష్ అంబానీ చెప్పారు.

    ‘జియో రాకముందు భారత్ 2జీకే పరిమితమైంది. జియో దానికి ముగింపు పలికి డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశంలో అత్యంత వేగంగా, అత్యుత్తమ, వరల్డ్ క్లాస్ సేవలు అందిస్తోంది జియో. 2జీ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి భారత్‌కు 25 సంవత్సరాలు పడితే, జియో 4జీకి రావడానికి కేవలం మూడేళ్లు మాత్రమే పట్టింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ టారిఫ్‌లతో జియో సేవలు అందిస్తోంది. ఇక స్మార్ట్ డివైజెస్ విషయానికి వస్తే, జియో రాకపూర్వం 2జీ ఫీచర్ ఫోన్లు మాత్రమే ఉండేవి. జియోఫోన్‌తో సంస్థ ఉద్యోగులు ఓ ప్రపంచస్థాయి సౌకర్యాన్ని తక్కువ ధరకే అందించారు. ఒక్క ఏడాదిలోనే జియోఫోన్ 10 కోట్ల మంది భారతీయుల చెంతకు చేరింది. ఇక డిజిటల్ అప్లికేషన్ల విషయానికి వస్తే జియో తమ కస్టమర్లకు ఖరీదైన కంటెంట్‌ను అందిస్తోంది. లైవ్ టీవీ, సినిమాలు, సంగీతం, వార్తలు, మేగజైన్లు, ఫైనాన్షియల్ యాప్స్, పేమెంట్స్, ఇంకెన్నో. డిజిటల్ కనెక్టివిటీ, డివైజెస్, అప్లికేషన్లను సమ్మిళితం చేస్తే ఫలితాలు అమోఘం. జియో లాంచ్ చేసిన 170 రోజుల్లోనే కోటి మంది కస్టమర్లు జాయిన్ అయ్యారు. అంటే ప్రతి సెకన్‌కు ఏడుగురు చొప్పున జియో కస్టమర్లుగా మారారు. ఇప్పుడు భారత్‌లో నెలవారీ సగటు ఇంటర్నెట్ వినియోగం 0.2 జీబీ నుంచి 1.2 జీబీకి పెరిగింది. అంటే 600 శాతం పెరిగిందన్నమాట. నాలుగేళ్లలో మొబైల్ డేటా వినియోగంలో 155వ స్థానం నుంచి నెంబర్ వన్ ప్లేస్‌కి వచ్చాం. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్ కీలక భూమిక పోషిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నాలుగో పారిశ్రామిక విప్లవంలో మనం తర్వాతి తరం టెక్నాలజీని డెవలప్ చేయాల్సి ఉంది. జియో అనేది వ్యాపారం కాదు. ఓ రకంగా డిజిటల్ ఉద్యమం. 130 కోట్ల భారతీయులకు డిజిటల్ లైఫ్ అందించాలనే మిషన్. 130 కోట్ల మంది కలలు సాకారం చేసే కార్యక్రమం. డిజిటల్ సొసైటీగా భారత్ మారడంలో జియో కీలక భూమిక పోషిస్తుంది. మరింత ఉన్నతంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎవరైతే కలగనడానికి సాహసిస్తారో, వారు గెలవడానికి అక్కడో కొత్త ప్రపంచం ఉంటుంది.’ అని ముఖేష్ అంబానీ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: