UPI PayNow linking: యూపీఐ, పే నౌ ఫాస్ట్​ పేమెంట్​ వ్యవస్థల విలీనం.. భారత్​, సింగపూర్ మధ్య ఈజీ ట్రాన్సాక్షన్స్​కు శ్రీకారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ను వేగవంతమైన చెల్లింపు పద్ధతిగా ఉపయోగిస్తుండగా, సింగపూర్ పేనౌ సిస్టమ్​ను ఉపయోగిస్తుంది. ఈ ఒప్పందంతో ఇతర చెల్లింపు వ్యవస్థల అవసరం లేకుండా పరస్పరం ఫండ్ ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చని ఆర్​బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

  • Share this:
UPI PayNow linking: డిజిటల్​ పేమెంట్లను ప్రోత్సహించే విధంగా భారత్​, సింగపూర్​ దేశాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. రెండు దేశాల యూజర్ల మధ్య డిజిటల్​ పేమెంట్ల కోసం ఫాస్ట్​ పేమెంట్ సిస్టమ్‌ అనే లింక్ ప్రాజెక్ట్‌ను ప్రకటించాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఎఎస్) మధ్య ఒప్పందం జరిగింది. ఈ లింక్డ్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ 2022 జూలై నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ను వేగవంతమైన చెల్లింపు పద్ధతిగా ఉపయోగిస్తుండగా, సింగపూర్ పేనౌ సిస్టమ్​ను ఉపయోగిస్తుంది. ఈ ఒప్పందంతో ఇతర చెల్లింపు వ్యవస్థల అవసరం లేకుండా పరస్పరం ఫండ్ ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చని ఆర్​బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

యూపీఐ, పే నౌ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి?
యూపీఐ అనేది భారతదేశ మొబైల్ ఆధారిత, 'ఫాస్ట్ పేమెంట్' సిస్టమ్. ఇది కస్టమర్ సృష్టించిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) ని ఉపయోగించి తక్షణమే పేమెంట్‌లు చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా బ్యాంక్ ఖాతా వివరాలను పంచుకోవాల్సిన అవసరం లేకుండానే సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది యూపీఐ పర్సన్ టు పర్సన్ (P2P), పర్సన్ టు మర్చంట్ (P2M) చెల్లింపులకు మద్దతు ఇస్తుంది. అలాగే యూజర్లు ఇతరులకు డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది.

సింగపూర్​లో అమల్లో ఉన్న పే నౌ సిస్టమ్​ కూడా ఇండియన్ సిస్టమ్ లాగానే పనిచేస్తుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సర్వీస్. యూజర్​ తన బ్యాంక్ నంబర్‌కు బదులుగా తన మొబైల్ నంబర్ లేదా NRIC/FIN లేదా UEN నంబర్‌ని ఉపయోగించి ఇతరుకు మనీ సెండ్​ చేసుకునేందుకు అనుమతిస్తుంది. పే నౌ మొత్తం తొమ్మిది బ్యాంకులు, మూడు నాన్-బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్​స్టిట్యూషన్స్ (NFI) కి మద్దతు ఇస్తుంది.

రెండు దేశాల మధ్య చెల్లింపులు మరింత సులభతరం
భారతదేశం, సింగపూర్ మధ్య సులభతరమైన చెల్లింపుల కోసం చేసుకున్న ఈ ఒప్పందం చెల్లింపు వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆర్​బీఐ పేర్కొంది. G20 సభ్య దేశాల మధ్య వేగంగా, చౌకగా, పారదర్శకంగా చెల్లింపులను నిర్వహించేందుకు ఈ విధానం దోహదం చేస్తుందని తెలిపింది. భారతదేశం, సింగపూర్ దేశాల మధ్య కార్డులు, క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి చేసే డిజిటల్​ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం జరిగింది. ఎన్​పీసీఐ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (NIPL), నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్స్ (NETS) భాగస్వామ్యంతో ఈ అనుసంధానం జరిగిందని ఆర్​బీఐ తెలిపింది. ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్​, ట్రావెల్​, పేమెంట్లు ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆర్​బీఐ పేర్కొంది
Published by:Krishna Adithya
First published: