news18-telugu
Updated: August 31, 2020, 9:53 PM IST
ప్రతీకాత్మక చిత్రం
భారత ఆర్థికవ్యవస్థను కరోనా వైరస్ కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ ( స్థూల జాతీయోత్పత్తి) ఏకంగా 23.9 శాతం పతనమైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటే.. ఈసారి రికార్డు స్థాయిలో క్షీణించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క వ్యవసాయ రంగం మినహా ఇతర రంగాలన్నీ భారీగా క్షీణతను నమోదు చేశాయి. వ్యవసాయం రంగం గతేడాది ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధిని నమోదు చేయగా.. ఈసారి 3.4 శాతం వృద్ధి కనబర్చింది.
ఇక కరోనాకు ముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.
మార్చిలో విధంచిన లాక్డౌన్ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల మేర ప్యాకేజీ ప్రకటించినా.. వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవనోపాధులు దారుణంగా దెబ్బతిన్నాయి. మన దేశంలో 1996 నుంచి త్రైమాసిక గణాంకాలను విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి ఇంత దారుణమైన పతనం ఎప్పుడూ నమోదు కాలేదు. తదుపరి త్రైమాసికం (జూలై, ఆగస్ట్, సెప్టెంబర్)లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
August 31, 2020, 9:50 PM IST