దేశంలో ఆహార కొరత ఏర్పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం(Indian Government) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి నూకల ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో పాటు దేశం నుంచి ఎగుమతి అయ్యే భాస్మతీయేతర బియ్యం(Rice) పైన 20 శాతం సుంకం పెంచింది. ఈ మేరకు భారత సర్కారు ఉత్వర్వులు జారీ చేసింది. ఎగుమతి విధానంలో ఈ మార్పు భారతదేశ ప్రజల శ్రేయస్సు కోసమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల లోకల్ సప్లై పెరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న, వివిధ వాహనాల్లో లోడ్ అయి డెస్టినేషన్ పాయింట్స్‌కు చేరిన నూకల ఎగుమతులను ఆంక్షల పరిధి నుంచి తప్పించారు.ఇప్పటికే భారత ప్రభుత్వం గోధుమల ఎగుమతిపైన నిషేధం విధించింది. గోధుమలపైనే కాదు గోధుమ పిండి, మైదా, రవ్వ, ఇతర పిండి ఎగుమతిపైన కూడా నిబంధనలు విధించింది. ఉక్రెయిన్‌పైన రష్యా దాడితో ప్రపంచానికి గోధుమ సరఫరా నిలిచిపోయింది. అలా గ్లోబల్ మార్కెట్లో గోధుమల ధర పెరిగింది.
ఇక బియ్యం విషయానికొస్తే.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు గణనీయంగా తగ్గింది. దీంతోపాటు ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు తగ్గుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ఆహార కొరత ఏర్పడకుండా ఉండేందుకు భారత సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
దేశ ప్రజల అవసరాలకు ఎఫ్‌సీఐ (FCI) గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం, నూకలను ప్రభుత్వం సరఫరా చేయనుంది. తద్వారా దేశంలో ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తుంది. అయితే గోదాముల్లో నిల్వలు తగ్గినా, కేంద్రం విధించిన పరిమితి కంటే రెండింతల వరకు నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో స్థానిక సరఫరా పెంచి, సామాన్య ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఇది కూడా చదవండి :కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో తీసుకోవచ్చు... ప్రాసెస్ ఇదే
* ఆంక్షలు ఎందుకు?
గోధుమ నిల్వలు కనిష్ట స్థాయికి తగ్గడానికి ప్రధాన కారణం ప్రకృతి వైపరీత్యమని తెలుస్తోంది. గతేడాది రబీ సీజన్లో వడగాలుల వల్ల గోధుమ పంట వేసిన రైతులు నష్టపోయారు. అలా దిగుబడి తగ్గి నిల్వలపైన ఎఫెక్ట్ పడింది. ఈ క్రమంలోనే ఈ సారి ఖరీఫ్‌లో వరి సాగు గణనీయంగా తగ్గింది. దాంతో మార్కెట్లోకి వచ్చే బియ్యం తగ్గనుంది. ఇక ఇప్పటికే ఉన్న నిల్వ కూడా క్రమంగా తగ్గుతోంది. ఈసారి దిగుబడి తగ్గిపోతే ఎఫ్‌సీఐ వద్ద ఉన్న బియ్యం నిల్వలపైన తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపైన ఆంక్షలను కఠినతరం చేసింది.
భారతదేశం 150 కంటే ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఈ షిప్మెంట్లో ఏవైనా తేడాలు వస్తే ఆహార ధాన్యాల ధరలపై ఒత్తిడి పెరగనుంది. ఇప్పటికే కరువు, హీట్ వేవ్స్, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా వివిధ ఆహార ధాన్యాల ధరలు పెరిగాయి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా ధరల ఒత్తిడికి తోడవ్వనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, National News, Rice