Telangana: అప్పుడు రూ.10 లక్షలు.. ఇప్పుడు రూ. 60 లక్షలు.. ఎందుకో తెలుసా...

ప్రతీకాత్మక చిత్రం

Mahabubnagar: తమ ప్రాంతంలోనే మినీ విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూముల ధరలను అమాంతం పెంచేశారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇంకా ప్రకటన రాకపోవడంతో భూ కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు.

 • Share this:
  మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తారో సందిగ్ధం నెలకొనగా రియల్‌ వ్యాపారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. మా ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తారని ప్రచారాలు నిర్వహించి అందినకాడికి దండుకుంటున్నారు. ఒకప్పుడు ఎకరం భూమి రూ. 10లక్షల వరకు ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.60 లక్షలు పలుకుతోంది. మినీ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ అసెంబ్లీలో అట్ల అన్నారో లేదో.. ఇట్ల మహబూబ్‌నగర్‌లో భూముల రేట్లకు రెక్కలు వచ్చేశాయి. రియల్‌ వ్యాపారులు జనాలకు ఆశలు చూపి భూములకు రేట్లను అమాంతం పెంచేశారు. ఇలా రియల్‌ వ్యాపారుల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మినీ ఎయిర్ పోర్టుకు జిల్లాలో నాలుగు ప్రాంతాలను స్థానిక అధికారులతో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఏ ఏ ఐ) అధికారులు పరిశీలించారు. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తమ ప్రాంతంలోని విమానాశ్రయం వస్తుందని ప్రచారం చేస్తూ భూముల రేట్లు పెంచుతున్నారు.
  ముందుకు సాగని ప్రక్రియ..
  రెండేళ్ల కిందట శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో మినీ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ లో కూడా విమానాశ్రయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని మినీ విమానాశ్రయాల ఏర్పాటును ప్రోత్సహించింది.  ఈ క్రమంలో పలుమార్లు సర్వేలు చేసినా పాలమూరులో మాత్రం మినీ విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగడం లేదు.
  ప్రచారాలతో అదరగొడుతున్న రియల్టర్లు
  రెండేళ్ల నుంచి విమానాశ్రయం కోసం నిర్వహిస్తున్న సర్వేలను స్థిరాస్తి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు సర్వే చేయగానే ఈ ప్రాంతంలోని విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం చేస్తూ భూముల రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. వ్యాపారుల మాటలు నమ్మి కొనుగోలు చేసిన జనం విమానాశ్రయ ఏర్పాటుపై ఇంకా ప్రకటన రాకపోవడంతో లబోదిబోమంటున్నారు .
  విషయంపై స్పందిస్తూ మినీ విమానాశ్రయం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అధికారులు జిల్లాలో నాలుగు ప్రాంతాలను చూసి వెళ్లారని వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు.  ఫలాన ప్రాంతంలో ఏర్పాటు చేశారనే ప్రచారాన్ని నమ్మవద్దని అది కేవలం ఊహాగానాలే అని అన్నారు. మినీ విమానాశ్రయం కోసం జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో సర్వే చేయడంతోపాటు భూసార పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. హెచ్ ఎఫ్ ఎల్ నివేదిక కోసం సాగునీటి పారుదల శాఖ అధికారులకు రాశామని.. ఇంకా ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు.
  Published by:Veera Babu
  First published: