news18-telugu
Updated: November 4, 2020, 8:00 PM IST
(ప్రతీకాత్మకచిత్రం)
భార్య-భర్త ఇద్దరూ ఉద్యోగస్థులయితే ఆ లెక్కలు, చెల్లింపులు, పన్నులు వేరే లెక్క. అదే భార్య గృహిణి అయి, భర్త మాత్రమే ఉద్యోగం చేస్తుంటే, ఇంటి ఖర్చులు భార్య తన సొంత అకౌంట్ నుంచి చెల్లింపులు చేస్తే ఆదాయపు పన్ను కట్టాల్సిందేనా? సామాన్యులందరికీ వచ్చే చాలా సహజమైన సందేహం ఇదే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భర్త ఆదాయం.. భార్య అకౌంట్ నుంచి చెల్లింపులు చేస్తే ఐటీ పడుతుందా? ఒకవేళ ట్యాక్స్ పడితే వీటినుంచి తప్పించుకునే (tax evasion) మార్గాలున్నాయా?
డిజిటల్ పేమెంట్స్ వల్లే ఇదంతా..
అసలు ఈ అనుమానం, భయం ఎందుకనేగా మీ సందేహం. గతంలో కేవలం నగదు చెల్లింపులు చేసేవారు కాబట్టి ఇటువంటి సందేహాలకు అస్సలు తావే ఉండేది కాదు. కానీ డిజిటల్ యుగంలో, అన్నీ ఆన్ లైన్ చెల్లింపులు (online payments) కావడంతో మనం వెచ్చించే ప్రతి పైసా ఆదాయపన్ను రికార్డుల్లోకి ఎక్కుతోంది.

ప్రతీకాత్మకచిత్రం
కోవిడ్ తో మారిన చెల్లింపులు
నగదు చెల్లింపులతో నోట్లు చేతులు మారి కరోనా వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. కనుక డిజిటల్ పేమెంట్లు (digital payments) బాగా పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఏ అకౌంట్ నుంచి, ఎవరి పేరు నుంచి ఏ కారణంతో డబ్బు బదిలీ అవుతోందనేది కీలకమైన అంశంగా మారుతోంది. ఒకవేళ రోజువారి ఇంటి ఖర్చులను భార్య డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లిస్తుంటే ఆమెకు ఆదాయపు పన్ను నోటీసులు (income tax notice) వస్తాయా? ఆమె వెచ్చించే మొత్తాన్ని ఐటీ శాఖ లెక్కించి, వాటిపై ఐటీ శాఖ కన్నేస్తుందా? ఇలా అయితే ఇక పాలు, పళ్లు, పూలు, కూరగాయలు, పూజాసామాన్లు కొనాలంటే భయపడాలేమో అనే అనుమానాలు వద్దే వద్దు.

ప్రతీకాత్మక చిత్రం
భర్త బదిలీ చేసిన మొత్తమే..
ఒకవేళ భర్త సంపాదనలో కొంత మొత్తాన్ని రోజువారి ఖర్చుల కోసం భార్య అకౌంట్లోకి బదిలీ చేశారనుకోండి, ఆ డబ్బును పలు నిత్యావసరాల కోసం భార్య వెచ్చిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆన్ లైన్ పేమెంట్లు కనుక వీటికి పక్కా లెక్కలుంటాయి. ఇలా భార్య బ్యాంక్ అకౌంట్ నుంచి చెల్లింపులు జరుగుతున్న పక్షంలో భార్యపై ఆదాయ పన్ను భారం పడుతుందా అనేది సామాన్యులను వేధిస్తున్న సమస్య. అయితే దీన్ని నగదు కానుకగా మార్చి లెక్కల్లో చూపి ఆదాయపన్ను ఎగవేయచ్చా అన్నది మరో సందేహం.

ప్రతీకాత్మక చిత్రం
పెట్టుబడి పెట్టకపోతే సరి
ప్రతినెలా భార్య అకౌంట్లోకి భర్త నగదు బదిలీ చేసి దాన్ని ఇంటి ఖర్చుల నిమిత్తం లేదా నగదు కానుకగా పేర్కొన్నట్టయితే భార్యపై ఇన్ కం ట్యాక్స్ భారం పడదు. ఈ రెండు రకాల మొత్తాన్ని భర్త ఆదాయంగానే పరిగణిస్తారు. కాబట్టి భార్య ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కనుక ఇటువంటి మొత్తాలపై ఐటీ శాఖ నుంచి ఎటువంటి నోటీసులు అందవు. కానీ ఈ డబ్బును పదేపదే పెట్టుబడులుగా పెడుతూ భార్య ఆదాయాన్ని ఆర్జిస్తే మాత్రం పన్ను కట్టాల్సిందే. అది కూడా భర్త ట్రాన్స్ ఫర్ చేసిన మొత్తాన్ని భార్య మదుపు చేయగా వచ్చిన ఆదాయంపై మాత్రమే పన్ను పడుతుందని గ్రహించండి. ఎందుకంటే ఈ ఆదాయం భార్య సంపాదించిన మొత్తం అవుతుంది కనుక. ఇది ఏడాది చొప్పున లెక్కవేసి, ఐటీ చెల్లింపులు జరపాల్సి వస్తుంది.
డిస్కౌంట్ ఉండదు
ఆదాయపన్ను చట్టాల కింద భార్యకు నగదును కానుకగా ఇస్తే మీకు చట్టబద్ధంగా ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ దీనిపై ఎటువంటి పన్ను రాయితీ లభించదు. భర్తగా మీరు ఆర్జిస్తున్న సంపాదనలో కొంత భాగం భార్యకు ఇస్తున్నారే కానీ స్థూలంగా చూస్తే ఇది భర్త రాబడి కనుక ఈ ఆదాయ-వ్యయాల భారమంతా భర్త మోయాల్సిందేనని ఐటీ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. జీవిత భాగస్వామిని బంధువులుగానే ఐటీ చట్టాలు పేర్కొంటాయి. కాబట్టి నగదును కానుకగా బదిలీ చేసినా ఎటువంటి పన్ను విధించరు.
భార్య ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు
భర్తగా మీరు కొంత మొత్తాన్ని మీ భార్య అకౌంట్లోకి బదిలీ చేశారనుకుందాం. ఆమె ఈ మొత్తాన్ని ఎస్ఐపీ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్ లో (mutual fund) పెట్టుబడి పెట్టిందనుకుందాం. అయినప్పటికీ ఈ మొత్తంపై భార్య ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి పన్ను చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఈ మొత్తానికి పన్ను భారాన్ని భర్త నుంచి రాబడతారు ఎందుకంటే ఇది భర్త ఆర్జన కాబట్టి ఐటీ కూడా ఆయనపైనే విధిస్తారు. కానీ ఈ మొత్తాన్ని మరోచోట మళ్లీ ఆమె పెట్టుబడిగా పెట్టి ఆదాయం ఆర్జిస్తే ఆ వచ్చే మొత్తంపై మాత్రం ఆదాయపన్ను చెల్లించాల్సిందే. ముందుజాగ్రత్తగా ఆదాయం ఏదో రూపంలో వస్తుంది కనుక ఐటీఆర్ (IT Returns) దాఖలు చేయడం మంచిది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 4, 2020, 7:28 PM IST