మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేశారా? ఇంకా చేయలేదా? ఇప్పటికే అనేకసార్లు గడువు పొడిగించింది ఆదాయపు పన్ను శాఖ. మార్చి 31 వరకు ఉన్న గడువును జూన్ 30 వరకు మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 30 గడువు దగ్గరకొస్తోంది. ఇప్పటివరకు 32.17 కోట్ల పాన్ కార్డులకు ఆధార్ నెంబర్లు లింక్ అయ్యాయి. మీరు ఇప్పటివరకు మీ పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయకపోతే మరో వారం రోజులు గడువు ఉంది. ఒకవేళ అప్పటికి కూడా మీరు మీ పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయకపోతే చిక్కులు తప్పవని హెచ్చరిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయనివారు ఎదుర్కోబోయే పరిణామాల గురించి ఇప్పటికే వివరించింది. జూన్ 30 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటీవ్గా మారతాయి. అంటే ఆ పాన్ కార్డులు పనిచేయవు. మీరు ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డుల్ని జూన్ 30 తర్వాత ఎక్కడైనా సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్ చెల్లదు.
జూలై 1 నుంచి మీరు ఆర్థిక లావాదేవీలు చేయాలంటే తప్పనిసరిగా మీ పాన్ నెంబర్కు మీ ఆధార్ నెంబర్ లింకై ఉండాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇక అప్పట్నుంచి కొత్త పాన్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ ఇవ్వకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం రూ.10,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మీరు మీ పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసేవరకు మీ పాన్ కార్డ్ చెల్లనిదిగానే ఉంటుంది. మీరు భవిష్యత్తులో పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేస్తేనే తిరిగి మీ పాన్ కార్డును ఉపయోగించుకోగలరు. ఎన్ఆర్ఐలు పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని లావాదేవీలకు మాత్రం ఆధార్ నెంబర్ తప్పనిసరి. మరి మీరు ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఇక్కడ క్లిక్ చేసి ప్రాసెస్ పూర్తి చేయండి. ఇప్పటికే పాన్ ఆధార్ లింక్ చేసినట్టైతే 30 సెకన్లలో స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.