దేశంలో రెండో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్(Hyundai Motor).. అత్యంత ప్రజాధారణ పొందిన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ‘శాంత్రో’ ప్రొడక్షన్(Production) ఆపేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కారుకు డిమాండ్(Demand) లేకపోవడం, ఇన్‌పుట్(Input) ఖర్చులు భారీగా పెరిగిపోతుండడంతో తమిళనాడు(Tamilanadu) ప్లాంట్‌లో శాంత్రో కార్ల ఉత్పత్తిని ఆపేయాలని కంపెనీ(Company) నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ.. 1998లో భారతదేశంలో అడుగుపెట్టింది. ఈ కొరియన్ కార్‌మేకర్(Car Maker) భారతీయ కస్టమర్‌కు(Customer) పరిచయం చేసిన మొదటి కారు శాంత్రోనే కావడం గమనార్హం.
ఈ ఆటోమేకర్ 2014 వరకు ఫస్ట్-జెనరేషన్ శాంత్రో మోడల్‌ను విక్రయించింది. అయితే, దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత, అక్టోబర్ 2018లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌తో ‘శాంత్రో’ను రంగంలోకి దించింది. అయితే అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలను నిలిపివేసి, సప్లై చైన్ పరిమితులను మరింత తగ్గించాలని హ్యుందాయ్ నిర్ణయించింది.
నివేదికల ప్రకారం.. శాంత్రో పెట్రోల్ వేరియంట్ ప్రొడక్షన్ ఆపేసినప్పటికీ, CNG వేరియంట్ అమ్మకాలు కొనసాగనున్నట్లు సమాచారం. అయితే డీలర్‌షిప్ స్టాక్‌లు ముగిసే వరకు పెట్రోల్ వెర్షన్లు కూడా విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ 2022 ఆర్థిక సంవత్సరంలో శాంత్రో కార్లను దాదాపు 2,000 యూనిట్లు విక్రయించింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఒకానొక సమయంలో హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఈ హ్యాచ్‌బ్యాక్ ఒకటి కావడం గమనార్హం. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలలో దాదాపు 76 శాతం వాటా శాంత్రో కార్లదే ఉండేది.
2018లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చిన శాంత్రో ధర అప్పట్లో 3.9 లక్షల నుండి రూ. 5.5 లక్షల మధ్య ఉండేది. అయితే ఇప్పుడు హ్యాచ్‌బ్యాక కార్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో శాంత్రో కారు ధర కూడా పెరిగింది. ప్రస్తుతం శాంత్రో ప్రారంభ ధర(ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం) రూ.4.9 లక్షల నుంచి మొదలై రూ.6.42 లక్షల వరకు ఉంది. 2018 నుంచి కార్ల ధరల పెరుగుదలకు సేఫ్టీ రూల్స్, BS6 ఉద్గార నిబంధనలు ప్రధాన కారణమని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు కూడా వాహన తయారీ సంస్థలకు గుదిబండగా మారాయి.
ఈ ఏడాది అక్టోబరు నుంచి కొత్త భద్రతా నిబంధనలు అమల్లోకి తీసుకురాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం ప్రయాణికుల భద్రత కోసం ఇకపై అన్ని కొత్త కార్లలో ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అమర్చాలి. వీటిని ఏర్పాటుకు భారీ ఖర్చు అవుతుంది. దీంతో ఆటోమెటిక్ గా కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ బ్యాక్ అమ్మకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ‘శాంత్రో’ను అప్‌డేట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న నిర్ణయానికి వచ్చింది హ్యుందాయ్. దీంతో వీటి ఉత్పత్తిని నిలిపివేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.