ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్(Trend) మొదలవ్వడంతో.. మనదేశంలో కూడా ఈ-వెహికల్ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అందులోనూ మన హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ.. హైదరాబాద్(Hyderabad) నుంచి అమెరికా వరకూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారు చేస్తూ గ్రీన్ మొబిలిటీ ఎవల్యూషన్ లో ముందుంది. రాజా గాయం, రాహుల్ గాయం, హర్ష బవిరిసెట్టి.. ఈ ముగ్గురు యువ ఎంటర్ ప్రెన్యూర్స్ 'బిలిటీ ఎలక్ట్రిక్(Electric)' పేరుతో 2010లో అమెరికాలో ఒక ఎలక్ట్రిక్ వెహికిల్స్ స్టార్టప్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ స్టార్టప్‌కు తోడుగా జీఎండబ్ల్యూ (గాయం మోటర్ వర్క్స్) పేరుతో 2021లో మరొక ఈ-వెహికిల్స్ స్టార్టప్(Start Up) మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో వెహికిల్స్ తయారు చేస్తూ.. అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. త్వరలోనే బిలిటీ ఎలక్ట్రిక్ సంస్థను యూఎస్ షేర్ మార్కెట్‌లో ఐపీఓ లిస్టింగ్ చేస్తామని చెబున్నారు.
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ మొదలవడం గమనించిన ఈ ముగ్గురు యువకులు పర్యావరణానికి మేలు చేసే ఈ-వెహికిల్స్ స్టార్టప్ ప్రారంభించాలని భావించారు. అమెరికాలో బిలిటీ ఎలక్ట్రిక్ పేరుతో మొదలుపెట్టిన ఈవీ స్టార్టప్ సక్సెస్ అవ్వడంతో, హైదరాబాద్‌లో కూడా మరొక ఈవీ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు. "జీఎండబ్ల్యూ" పేరుతో ఓ సంస్థను స్థాపించి ఇక్కడి నుంచి యూఎస్‌కు వాహనాలు ఎగుమతి చేస్తున్నారు.
ఈవీ కేటగిరీలో ఎవరూ అంతగా టచ్ చేయని ఎలక్ట్రిక్ ఆటోల తయారీపై వీళ్లు ఫోకస్ చేశారు. వాహనాల తయారీకి వాడే విడి భాగాలను మొదట బయట కంపెనీల నుంచి కొనుగోలు చేసేవారు. అవి నాసిరకంగా ఉండటంతో పాటు, విడి భాగాల ధరలు కూడా రానురాను పెరిగాయి. దాంతో ఒక ఎలక్ట్రిక్ ఆటో తయారీ ఖర్చు రూ. 6 లక్షలకు చేరింది. తయారీ ఖర్చుని తగ్గించేందుకు వీళ్లే సొంతగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్(ఆర్ అండ్ డీ)ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆటో తయారీకి అవసరమైన పరికరాలను, విడి భాగాలను కావలసిన ప్రమాణాలతో సొంతగా తయారు చేస్తున్నారు.
హైదరాబాద్ లో సొంత ప్లాంట్ ఏర్పాటు చేసి బ్యాటరీలతో పాటు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కూడా తయారు చేస్తున్నారు. పూర్తిగా సొంత టెక్నాలజీతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఆటోను 2015లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ప్యాసింజర్ , కార్గో రెండురకాల ఆటోలు తయారు చేసి పలు కంపెనీలకు అందజేశారు. తక్కువ ధరలో మెరుగైన పెర్ఫామెన్స్ అందించే ఈ ఎలక్ట్రిక్ ఆటోల కోసం చాలా కంపెనీలు ముందుకొచ్చాయి.
వీరు రూపొందించిన సాంకేతికతతో ఈవీ ఆటో ధర సగానికి తగ్గటంతో పాటు పనితీరులోనూ మెరుగైన మార్పులు తీసుకువచ్చారు. పటాన్‌చెరులోని ప్లాంట్‌లో 180 మంది సిబ్బంది ఉన్నారు. నెలకు 250 ఆటోలను తయారు చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఆటో ధర రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటుంది. దీని ప్రయాణానికి కిలోమీటరుకు అయ్యే ఖర్చు 50 పైసలు మాత్రమే. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఇంధనం ధర చాలా తక్కువ . దీంతో హైదరాబాద్‌లో ఉన్న పలు ఈ -కామర్స్ సంస్థలు గాయం మోటర్ వర్క్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, డెల్హీవరి, బ్లూడాట్ వంటి సంస్థలు వీరి స్టార్టప్ తయారు చేసిన ఈ-ఆటోలను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి.
మామూలుగా డిజీల్ ఆటోలకు కి.మీ.కు రూ. 3.50 వరకు ఖర్చవుతుండగా, జీఎండబ్ల్యూ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఆటోకు కిమీ.కు 50 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. 3 గంటలు చార్జింగ్ చేస్తే సుమారు 70 కిలోమీటర్ల వరకు నడుస్తాయి. బ్యాటరీ స్వైపింగ్ టెక్నాలజీ ద్వారా బ్యాటరీలను సులువుగా మార్చుకోవచ్చు. ఈ- వాహనాల పరిశ్రమలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసే లక్ష్యంతో ఈ ముగ్గురు పనిచేస్తున్నారు. వాహనాలతో పాటు పలుచోట్ల చార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసి, ఆ తర్వాత పాసింజర్ ఆటోలను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఫౌండర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియా, యూఎస్ లలో మార్కెట్ ఉన్న ఈ సంస్థను... త్వరలోనే యూరోప్, ఆఫ్రికాల్లో కూడా ను విస్తరించే ప్లాన్ లో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Electric Vehicles, Hyderabad, Vehicles