• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • HUSQVARNA VEKTORR CONCEPT ELECTRIC SCOOTER UNVEILED GLOBALLY WITH 95 KM RANGE ON SINGLE CHARGE MK GH

Husqvarna Vektorr: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌...ఒక్క చార్జింగ్‌తో 95 కిలోమీటర్ల మైలేజ్..

Husqvarna Vektorr: మార్కెట్లోకి  కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌...ఒక్క చార్జింగ్‌తో 95 కిలోమీటర్ల మైలేజ్..

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆస్ట్రియాకు చెందిన హుస్క్వర్నా ?

  • Share this:
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఆస్ట్రియాకు చెందిన హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ కూడా చేరింది. ఈ సంస్థ 2018లో 6.7-HP మినీబైక్‌ను ఆవిష్కరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ-పిలెన్ (E-Pilen) అనే బైక్‌తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. తాజాగా వెక్టార్ మోడల్‌తో కొత్త బ్యాటరీ స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఈ సంస్థ తమ బ్రాండ్ పేరుతో ఆవిష్కరించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఈ మోడల్ రానుంది. పట్టణ ప్రాంతాల వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించారు. నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు, పెరుగుతున్న ఇంధన ధరలకు ఈ బైక్ చెక్ పెట్టనుందని కంపెనీ భావిస్తోంది. వెక్టార్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. సుమారు 95 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందించనుంది.



హుస్క్వర్నా కంపెనీ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో మార్కెట్‌ వాటా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగాన్ని విస్తరించాలని సంస్థ భావిస్తోంది. రానున్న రోజుల్లో బ్యాటరీ వాహనాలకు ఏర్పడే డిమాండ్‌పై సంస్థ ఇప్పటికే దృష్టి పెట్టింది. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలోని కొత్త డీలర్లతో కూడా ఒప్పందాలు చేసుకుంటోంది. అయితే హుస్క్వర్నా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ వెక్టర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో వెల్లడించలేదు. దీన్ని 2022లో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వెక్టార్ డిజైన్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. దీనికి ఒక ప్రత్యేకమైన సర్క్యులర్ హెడ్‌లైట్‌ ఉంది. స్కూటర్‌కు రెండు వైపులా ఫెయిరింగ్, పసుపు రంగు స్ట్రోక్‌లతో రెండు-టోన్ పెయింట్ స్కీమ్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విలక్షణమైన డిజైన్‌ దీని సొంతం.

మార్కెట్లోకి విడుదల ఎప్పుడు?
వెక్టార్ మోడల్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ద్విచక్ర వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లు, టెక్నికల్ స్పెసిఫికేషన్లను సంస్థ ఇంకా వెల్లడించలేదు. వెక్టార్ స్కూటర్‌పై అత్యధికంగా 30 మైళ్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీంతో పాటు పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత 60 మైళ్ల వరకు ప్రయాణం చేయవచ్చని సమాచారం. హుస్క్వర్నా సంస్థ కేటీఎంతో కలిసి ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్ ప్లాట్‌ఫామ్‌ను కొత్త బైక్ తయారీకి ఉపయోగించనుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.
Published by:Krishna Adithya
First published: