SBI Alert: భార్య ATM కార్డును భర్త వాడటానికి వీల్లేదన్న ఎస్బీఐ..ఎందుకంటే?

SBI Alert: భార్య ATM కార్డును భర్త వాడటానికి వీల్లేదన్న ఎస్బీఐ..ఎందుకంటే?

(ప్రతీకాత్మక చిత్రం)

SBI: ఏటీఎంల్లో డబ్బు తీసుకునేటప్పుడు కేవలం కార్డును వినియోగదారుడు మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. అలా కాకుండా బంధువులు, స్నేహితులకు ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్పి వారి ద్వారా లావాదేవీలు చేయకూడదనే విషయంలో బ్యాంకులు ముందే హెచ్చరిస్తున్నాయి.

  • Share this:
ఒకప్పుడు బ్యాంకులో డబ్బు తీసుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. క్రమేణా ఏటీఎం మెషిన్లు వచ్చి ఆ కష్టాన్ని సులభతరం చేశాయి. ప్రస్తుతం డిజిటలైజ్ అయిన కారణంగా మొబైల్, ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యముంది. అయితే ఇప్పటికీ చాలా మంది ఏటీఎం కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఏటీఎంల్లో డబ్బు తీసుకునేటప్పుడు కేవలం కార్డును వినియోగదారుడు మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. అలా కాకుండా బంధువులు, స్నేహితులకు ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్పి వారి ద్వారా లావాదేవీలు చేయకూడదనే విషయంలో బ్యాంకులు ముందే హెచ్చరిస్తున్నాయి. అంతెందుకు చివరకు భార్య కార్డును భర్త కూడా వినియోగించడానికి వీలు లేదని బ్యాంకులు చెబుతున్నాయి.

ఏటీఎం పిన్ను కేవలం కార్డు హోల్డర్లు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకు షేర్ చేయకూడదు. అది సొంత భర్త అయిన సరే. భార్య కార్డును ఉపయోగించిన పాపానికి బెంగళూరులో భర్తతో పాటు దంపతులిద్దరూ నష్టపోవాల్సి వచ్చింది.

అసలు ఏం జరిగింది?

వందన-రాజేశ్ కుమార్ దంపతులు. బెంగళూరులో నివాసముంటున్నారు. మాతృత్వ సెలవుల్లో ఉన్న వందన 2013 నవంబరు 14న తన ఏటీఎం కార్డును భర్తకు ఇచ్చి డబ్బు తీసుకురామ్మని చెప్పింది. పిన్ కూడా అతడికి చెప్పింది. స్థానిక ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లిన రాజేశ్ కుమారు రూ.25,000లు విత్ డ్రా కోసం ప్రయత్నించారు. అయితే లావాదేవీ జరిగినప్పటికీ డబ్బు మాత్రం రాలేదు. అంతేకాకుండా డబ్బు కట్ అయినట్లు స్లిప్ కూడా వచ్చింది. వెంటనే రాజేశ్ ఈ విషయాన్ని ఎస్బీఐ కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయగా.. ఏటీఎం సమస్య అయి ఉంటుందని 24 గంటల్లో సొమ్ము జమ అవుతుందని బదులిచ్చారు. 24 గంటల తర్వాత కూడా డబ్బు క్రెడిట్ కాకపోవడం వల్ల అతడు ఎస్బీఐ హెలికాప్టర్ డివిజన్ బ్రాంచ్(హెచ్ఏఎల్)కు ఫిర్యాదు చేశారు.

అయితే ఎస్బీఐ మాత్రం డబ్బు తిరిగి చెల్లించేందుకు నిరాకరించింది. ఏటీఎం కార్డును కేవలం కార్డు హోల్డర్లు మాత్రమే వినియోగించాలని ఇతరుల వాడుకూడదనే నిబంధనను అనుసరించి నిరాకరించింది. కార్డు హోల్డర్ స్థానంలో ఇతరుల వాడారు కాబట్టి క్లెయిమ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే దంపతులు ఏటీఎం సీసీటీవీ ఫుటేజీ పరిశీలించినపుడు కూడా ఏటీఎం క్యాబిన్ లో డబ్బు తీసుకున్నట్లు రాలేదు. అధ్యయన కమిటీ కూడా ఫుటేజీలో కార్డు హోల్డర్ కనిపించని పాయింటు లేవనెత్తింది.

ఆర్టీఐని ఆశ్రయించగా..

దీంతో వందన దంపతులు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. క్యాష్ వెరిఫికేషన్ రిపోర్టులో రూ. 25,000 లావాదేవీ జరిగినట్లు అయితే డబ్బు మాత్రం రాలేదని సమాచార హక్కు చట్టానికి రిపోర్టు చేశారు. అయితే ఎస్బీఐ వీరికి కౌంటర్ రిపోర్టును దాఖలు చేసింది. అంతేకాకుండా వినియోగదారులు ఫోరంకు వెళ్లేముందు చివరి ప్రయత్నంగా దంపతులు బ్యాంకు అంబుడ్సు మన్ కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. పిన్ షేర్ చేశారు కాబట్టి కేసు కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

కోర్టులో ఏం తేలింది..

చివరకు వందన నాలుగవ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల ఫోరమ్ ను 2014 అక్టోబరు 21న ఆశ్రయించింది. తన సొమ్మును తనకు తిరిగి ఇచ్చేయాలని లావాదేవీ నిర్వహించినా డబ్బు రాలేదని వాపోయింది. తను ఆ సమయంలో ఓ పిల్లాడిని ప్రసవించానని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితిలో డబ్బు విత్ డ్రా చేయమని తన భర్తకు ఏటీఎం కార్డు ఇచ్చానని కోర్టుకు తెలిపింది. అయితే సదరు ఫిర్యాదుదారులు ఏటీఎం షేర్ చేసి నియమాలను ఉల్లంఘించారని, ఏటీఎం లావాదేవీ విజయవంమతమైందని, కుమార్ డబ్బు తీసుకున్నారని ఎస్బీఐ.. కోర్టుకు విన్నవించింది.

దాదాపు మూడున్నరేళ్ల పాటు సాగిన ఈ న్యాయ పోరాటంలో వినియోగాదారుల కోర్టు 2018 మే 29న తుది తీర్పు వెలువరించింది. నియమాల ప్రకారం వందన ఏటీఎం పిన్ ఎవ్వరికీ చెప్పకూడదని, డబ్బు కోసం తన భర్తకు చెక్ లేదా అధికారిక లేఖ పూర్వకంగా రాయాల్సిందని కోర్టు చెప్పింది. ఈ కేసులో ఎస్బీఐ వాదనలను బెంగళూరు నాలుగవ అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పోరం అంగీకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య లేదా భర్త డెబిట్ కార్డును లావాదేవీల కోసం జీవిత భాగస్వామి వినియోగించకూడదని తీర్పునిచ్చింది.

ఏటీఎం లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ కూడా కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది..

-కస్టమర్ ATM / WLA లావాదేవీని పూర్తి గోప్యతతో నిర్వహించాలి.

-ఒక కార్డు హోల్డర్ మాత్రమే ఒకేసారి ఏటిఎం/డబ్ల్యూఎల్‌ఏ కియోస్క్‌లోకి ప్రవేశించి యాక్సెస్ చేయాలి.

-కార్డు హోల్డర్ తన కార్డును ఎవ్వరికి ఇవ్వకూడదు

-కార్డు హోల్డర్ తన కార్డుపై పిన్ రాయకూడదు,

-కార్డు వినియోగదారుడు ఎవ్వరితోనూ పిన్ నెంబర్ ను పంచుకోకూడదు

-ఏటీఎం సెంటర్లో పిన్ ఎంటర్ చేస్తున్నప్పుడు పిన్ చూసేందుకు ఎవ్వరికీ అనుమతించకూడదు

-సులభంగా ఊహించగలిగే పిన్ ను ఉపయోగించకూడదు

-ఎటీఎం/డబ్ల్యూఎల్ఏలో కార్డును ఎప్పుడూ ఉంచకూడదు.

-కార్డు హోల్డర్ ఆమె/అతడి మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ మొబైల్ నెంబర్ ను జారీచేసే బ్యాంకులో నమోదు చేసుకోవాలి. ఖాతాలో ఏవైనా అనధికార కార్డు లావాదేవీలు జరిగినట్లయితే సంబంధిత బ్యాంకుకు నివేదించాలి

-ఏటీఎంలకు ఏమైనా ఎలక్ట్రానిక్ పరికరాలు అనుసంధించి ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఆ డివైజ్ ల ద్వారా వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించే అవకాశముంది. ఒకవేళ ఉంటే సెక్యురుటీ లేదా బ్యాంకుకు వెంటనే సమాచారమివ్వాలి.

-ఏటీఎంల వద్ద అనుమానస్పద వ్యక్తులు లేదా సంఘటనలు జరిగినట్లయితే ఓ కన్నేసి ఉంచాలి. ఏటీఎం సెంటర్ల వద్ద అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీతో సంబాషించే ఏటీఎంలో డబ్బు తీసేందుకు సహాయపడతామన్నట్లు మోసం చేసే వీలుంటుంది.

-బ్యాంకు అధికారులు లేదా సిబ్బంది కార్డు లేదా పిన్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడగరనే విషయం కార్డు హోల్డర్లు గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా అలాంటి వివరాలు అడిగేందుకు ప్రయత్నిస్తే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి.

దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏటీఎం కార్టు వివరాలు, పిన్ లాంటి వాటిని ఎవ్వరితోనూ పంచుకోకూడూదు. ఒకవేళ ఎవరికైనా పిన్ వివరాలు ఇచ్చినట్లయితే లావాదేవీల్లో ఏవైనా తప్పులు జరిగితే అందుకు బ్యాంకులు బాధ్యత వహించవు.
Published by:Krishna Adithya
First published: