HOW TO START ATM BANK BUSINESS AND EARN MONEY ATM BANK MACHINE MK
Business Ideas: ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా...నెలకు రూ.50 వేలకు తగ్గకుండా ఆదాయం...
ప్రతీకాత్మకచిత్రం
ప్రస్తుతం ఆర్బీఐ మరో అడుగు ముందుకేసి వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో కేవలం బ్యాంకులు మాత్రమే కాదు ఇతర సంస్థలు సైతం నగదు లావాదేవీలను అందుబాటులోకి తెచ్చాయి.
Business Ideas| ఏటీఎం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్థిక నాడి అనే చెప్పాలి. ప్రస్తుతం మారుమూల పల్లెటూర్లలో సైతం ఏటీఎం బ్యాంకింగ్ కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. బ్యాంకుల ముందు డబ్బు కోసం గంటల తరబడి ఎదురుచూసే కష్టం నుంచి వినియోగదార్లకు ఏటీఎం విముక్తి కల్పించింది. మన దేశంలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు మొదట్లో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఏటీఎంలను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలను నెలకొల్పి ప్రజలకు ఇంకా దగ్గరైంది. అయితే ప్రస్తుతం ఆర్బీఐ మరో అడుగు ముందుకేసి వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో కేవలం బ్యాంకులు మాత్రమే కాదు ఇతర సంస్థలు సైతం నగదు లావాదేవీలను అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం అనేక సంస్థలు 'వైట్ లేబుల్ ఏటీఎం'లను నెలకొల్పుతున్నాయి. టాటా గ్రూపు 'ఇండిక్యాష్' పేరుతో దేశంలో తొలి వైట్ లేబుల్ ఏటీఎం ఏర్పాటు చేసింది. అంతేకాదు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం కల్పించేందుకు దేశవ్యాప్తంగా 15,000 వైట్ లేబుల్ ఏటీఎంలను నెలకొల్పారు.
ఏటీఎం రంగంలో వ్యాపార అవకాశాలు ఇవే... వైట్ లేబుల్ ఏటీఎం సెంటర్లలో 67 శాతం కేంద్రాలు గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటవుతాయి. ఒక్కో ఏటీఎం స్థాపనకు బ్యాంకులు రూ. 3-4 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. దాని నిర్వహణ వ్యయం ఏడాదికి రూ.6 లక్షల వరకూ ఉంటుంది. అయితే బ్యాంకులకు ఇది భారంగా కావడంతో చాలావరకు ఏటీఎంలను మూసివేస్తున్నారు. అయితే ఏటీఎంలను బ్యాంకింగేతర సంస్థలు నిర్వహిస్తే బ్యాంకులకు వ్యయం కలిసివస్తుంది. ఇదే వైట్ లేబుల్ ఏటీఎం వ్యాపారానికి కలిసి వచ్చే అంశం. సాధారణ బ్యాంకు ఏటీఎంలో ఉండే అన్ని రకాల సదుపాయాలు వైట్ లేబుల్ ఏటీఎం'లోనూ ఉంటాయి. నగదు విత్‌డ్రా చేయటంతో పాటు, బ్యాలెన్స్ ఎంక్వైరీ తెలుసుకోవడం, మినీ స్టేట్మెంట్ తీసుకోవడం, పిన్ నెంబరు మార్చుకోవడం చేయవచ్చు.
వైట్ లేబుల్ ఏటీఎం సేవలు అందిస్తున్న కంపెనీలు...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎంలను నెలకొల్పే నిమిత్తం ఇప్పటి వరకూ ఆర్బీఐకి 19 సంస్థలు దరఖాస్తు చేశాయి. ఇందులో 12 సంస్థలకు లైసెన్సులు లభించాయి. ముత్తూట్ ఫైనాన్స్‌కు ఈ మధ్యనే లైసెన్సు వచ్చింది. ఈ సంస్థ వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 9,000 వైట్ లేబుల్ ఏటీఎంలను నెలకొల్పాలనుకుంటోంది. 1,000 కేంద్రాలను నెలకొల్పనున్నట్లు ముత్తూట్ ఫైనాన్స్ ఇప్పటికే తెలియజేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8 సంస్థలు ఈ వైట్ లేబుల్ ఏటీఎం సేవలు అందిస్తున్నాయి. అవి AGS Transact Technologies Ltd, BTI Payments Pvt Ltd, Hitachi Payment Services Pvt Ltd, Muthoot Finance Ltd, RiddiSiddhi Bullions Ltd, SREI Infra వంటి సంస్థలు తమతో కలిసి వ్యాపారం చేసే వారికి ఏటీఎం ఏర్పాటు చేసే వారికి అవకాశం కల్పిస్తున్నాయి.
ఏటీఎం నెలకొల్పడం ఎలా...
మీరు ఏటీఎం ఏర్పాటు చేయాలంటే...ముందుగా బిజీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో కనీసం 25 నుంచి 50 చదరపు అడుగుల దుకాణం కలిగి ఉంటే సరిపోతుంది. పైన పేర్కొన్న సంస్థలు వైట్ లేబుల్ ఎటిఎం ఫ్రాంచైజీ అందిస్తున్నాయి. ఏటీఎంకు అవసరమైన నిర్వహణ, విద్యుత్ ఛార్జీలు మరియు భద్రతా వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొన్ని సంస్థలు నిర్వహణ చార్జీలు వారే భరిస్తుంటారు. అయితే ఏటీఎం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని సంస్థలు రీఫండబుల్ డిపాజిట్ స్వీకరిస్తాయి.కాగా మీకు ఎటిఎమ్లో జరిగే లావాదేవీల సంఖ్య ఆధారంగా మీకు సంపాదన లభిస్తుంది. విత్ డ్రాయల్స్ తో పాటు, చెకింగ్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ మొదలైన బ్యాంకింగ్ రహిత లావాదేవీలకు 5 రూ. నుంచి 15 రూపాయల కమీషన్ మీకు లభిస్తుంది. మీ ATM కి ఎంత ఎక్కువ మంది కస్టమర్లు వస్తే అంత ఎక్కువగా సంపాదిస్తారు. ఒక రోజులో కనీసం 100 లావాదేవీలు జరిగితే మీ ఏటీఎం లాభదాయకంగా మారుతుంది.
ఆదాయం ఎంతంటే...
మీ ఏటీఎంలో ప్రతిరోజూ 200 లావాదేవీలు జరిగితే అందులో 50 నాన్ ఫైనాన్స్ ట్రాన్సక్షన్స్, 150 నగదు ఉపసంహరణలు ఉంటే సుమారు రోజుకు రూ. 2,500 సంపాదించవచ్చు. అంటే రూ. నెలకు 75,000 రూపాయలు. అద్దెతో పాటు ఇతరత్రా ఖర్చుల కింద రూ. 25,000 పోగా మీకు నికర లాభం కింద రూ.50 వేలు మిగిలే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.