సుమన్ , జ్యోతి దంపతులిద్దరూ ఉద్యోగస్తులే...ఇద్దరూ కష్టపడి గుంటూరు శివారులో ఓ రియల్టర్ ద్వారా స్థలం కొనుగోలు చేశారు. నెలవాయిదాలు చెల్లించి మరీ 400 గజాల ప్లాటును కొనుగోలు చేశారు. అయితే వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్య, పెళ్లిని దృష్టిలో ఉంచుకొని వారు ఆ ప్లాటును కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారి కుమారుడిని విదేశాల్లో ఎంబీబీఎస్ చేయించాలని కలలు కన్నారు. అందుకోసం ఓ కన్సల్టెన్సీని సంప్రదిస్తే సుమారు పాతిక లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దీంతో వారిద్దరూ ఏమాత్రం ఆలోచించకుండా...తమ స్థలం అమ్మేసి కుమారుడిని విదేశాల్లో ఎంబీబీఎస్ చేయించి తమ చిరకాల వాంఛ తీర్చుకోవాలని ఆశపడ్డారు. అయితే వారు తమ స్థలాన్ని అమ్మకానికి పెట్టగా మార్కెట్ రేటుకన్నా చాలా తక్కువ పలికింది. అదేంటా అని ఇద్దరూ అవాక్కయ్యారు. దీంతో వారి ఆశలపై నీళ్లు పడ్డాయి. తమ కుమారుడి డాక్టర్ కలకు ఇంకా పదిలక్షలు తక్కువ పడ్డాయి. కారణం ఏంటని న్యాయనిపుణులను అడిగితే అది లిటిగేషన్ ప్రాపర్టీ అని చెప్పారు. అయితే తమకు విక్రయించిన రియల్టర్ అది ఎలాంటి వివాదాలు లేవని చెప్పారని వాపోయారు. అయితే కొనుగోలు చేసేముందే ప్రతీ అంశం పరిగణలోకి తీసుకోవాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అసలు లిటిగేషన్ ప్రాపర్టీ అంటే ఏమిటి? ప్రాపర్టీ లేదా స్థలం కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే డాక్యుమెంట్స్‌ని పరిశీలించాలో తెలుసుకుందాం..
- చాలా మంది తాము జీవితకాలమంతా కష్టపడి దాచుకున్న సొమ్ముతో ఇల్లు లేదా ఇంటి స్థలం కొనాలనుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు కొంత మంది దళారుల చేతిలో దారుణంగా మోసపోతుంటారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ మోసాల్లో ఎక్కువగా జరిగేది ఒకే ప్రాపర్టీని ఇద్దరు, ముగ్గురికి అమ్మడం. డ్యూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసి కొందరు కేటుగాళ్లు మోసాలు చేస్తుంటారు. అందుకే మీరు కొనుగోలు చేసే ఇల్లు, ఇంటి స్థలం, పొలాలు మొదలైనవి కొనేసమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇల్లు, స్థలం, పొలం ఇలా ఏదైనా ఆస్తి అమ్మే వ్యక్తికి ఆ ఆస్తి పై సర్వాధికారాలుండాలి. ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండకూడదు. ఒక వేళ ఆస్తిపై ఇతరులకు కూడా హక్కులు ఉంటే, వారందరి సమ్మతితోనే డాక్యుమెంట్ల రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం న్యాయనిపుణుల సలమహా తీసుకుంటే మంచిది.
- ఇక మీరు కొనుగోలు చేసే ఇల్లు, లేదా స్థలంపై బ్యాంకులు లేదా ఇతర సంస్థలు తనఖా కానీ, కోర్టు డిక్రీలు, ఆర్డర్లు లాంటివి ఏమైనా ఉన్నాయా లేవా, అనేది తెలుసుకోవాలి. గతంలో వేరే ఎవరికైనా ఆ స్థలం అమ్మడానికి అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారా అన్నది తెలుసుకోవాలి.
- ఇక మీరు కొనుగోలు చేసే ఆస్తికి సంబంధించి ఏవైనా కుటుంబ వివాదాలు ఉంటే ముందుగానే పసిగట్టాలి. అంతేకాదు అలాంటి సందర్భాల్లో అసలు మీరు కొనుగోలు చేసే ఆస్తికి వారసులుగా మైనరు ఉంటే ఆ ఆస్తి అమ్మకం చెల్లదు. అలాంటి ఆస్తుల క్రయవిక్రయాలు జరపాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి.
- ఇక మీరు కొనే ఆస్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రాపర్టీకి సంబంధించిన పాత దస్తావేజులు (జిరాక్స్ కాపీలు) లింక్ దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే మీకు ఏవైనా అనుమానాలు ఉంటే స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విచారణ చేస్తే మేలు.
- ఏదైనా ఇల్లు కొనేముందు ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీలకు ఏమైన పన్ను బకాయిలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలి.
- సర్వే నెంబరు, ఇంటి నెంబరు, సరిహద్దులు, హద్దుల మధ్య విస్తీర్ణం, రాకపోకల కుదారి, మొదలగు అన్ని విషయాలు దస్తావేజులో ఉన్నాయో లేదో చూసుకోవాలి.
- మీరు కొనే ఆస్తిలో కొంత ఏదైనా లిటిగేషన్‌లో ఉందనే అనుమానం వస్తే మాత్రం వెంటనే ఆ ఆస్తికి సంబంధించిన వివరాలను స్థానిక దినపత్రికలో ప్రకటన వేయిస్తే న్యాయప్రక్రియలో మీకు ఉపయోగపడుతుంది. ఆస్తుల కొనుటకు, అమ్ముటకు సంబంధించిన అన్ని విషయాలు గురించి దస్తావేజులో అనుభవం ఉన్న డాక్యుమెంట్ రైటర్ తో రాయించుకోవాలి.
- సరైన స్టాంప్ పేపరుమీద మాత్రమే దస్తావేజులను రాయించుకుని రిజిస్టర్ చేయించుకోవాలి. ఆన్ లైన్ పద్ధతిలో చెల్లింపులు చేస్తే మేలు. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర చార్జీలు డీడీ రూపంలో చెల్లిస్తే మేలు. అయితే ప్రాపర్టీని కొనే ముందు మీరు ఏదైనా బయానాగా ఇచ్చిన డబ్బు ఇస్తే మాత్రం తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Real estate in Hyderabad