ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.3000... అర్హతలివే...

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పెన్షన్ యోజన" 60 సంవత్సరాలు దాటిన వారికి నెలకు రూ.3000 పెన్షన్ అందించనున్నారు. ఈ పథకంలో భాగస్వాలయ్యేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.

 • Share this:
  60 సంవత్సరాలు దాటిన వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పెన్షన్ యోజన"పై పేద, మధ్య తరగతి వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. పీఎం-ఎస్‌వైఎం పథకంగా పేర్కొంటున్న ఈ పథకాన్ని 2019 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా అసంఘటి రంగానికి చెందిన కార్మికులు, అలాగే ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న చిరుఉద్యోగులు, చిరు వ్యాపారులను ఉద్దేశించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగస్వాములు అయితే నెలకు రూ.3000 పెన్షన్ పొందే వీలుంది. ముఖ్యంగా ఏ ఆర్థిక ఆసరా లేని వయస్సు పైబడిన వారికి ఈ పీఎం-ఎస్‌వైఎం పథకం తోడ్పాటు అందిస్తుంది.

  ఈ స్కీమ్‌లో ప్రధాన అంశం ఏమిటంటే.. పెన్షన్ పొందుతున్న కుటుంబ పెద్ద మధ్యలోనే మరణిస్తే అతడి భార్యకు పెన్షన్ బదిలీ అవుతుంది. అలాగే పీఎం - ఎస్‌వైఎం పథకం ముఖ్యంగా మలివయస్సులో గౌరవంగా జీవించేలా సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉపయోగపడనుంది.

  పీఎం - ఎస్‌వైఎం పథకంలో భాగస్వాములవ్వాలంటే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈపీఎఫ్ ఇండియా వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంది. అలాగే ప్రావిడెంట్ ఫండ్ వారు ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్స్ లలో కూడా పొందవచ్చు.

  పీఎం - ఎస్‌వైఎం పథకానికి ఎవరు అర్హులు :
  1. పెన్షన్ పొందే వ్యక్తి ఏదైనా ఒక ప్రైవేటు సంస్థలో కార్మికుడై ఉండాలి. లేదా చిరు వ్యాపారులు, ఇతర అసంఘటిత కార్మికులు అర్హులు
  2. పెన్షన్ పథకంలో చేరే వ్యక్తి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
  3. నెలవారీ ఆదాయం రూ.15000కు మించరాదు.

  అయితే ఆర్గనైజ్డ్ సెక్టార్లలో పనిచేస్తూ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీం, ఈఎస్ఐసీ పథకాల్లో భాగస్వాములైతే మాత్రం పీఎం - ఎస్‌వైఎం పథకానికి అర్హులు కారు.

  కావాల్సిన డాక్యుమెంట్లు :
  ఆధార్ కార్డు
  సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్ అయినా పర్లేదు
  ఒక ఫోన్ నెంబర్

  ఎలా అప్లై చేయాలి :
  మీ సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు, పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, మొబైల్ ఫోన్ నెంబర్ తప్పనిసరి. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఈపీఎఫ్ ఇండియా వెబ్ సైట్ లోకి వెళితే అక్కడ వివరాలు అందుబాటులో ఉంటాయి.

  ఒక వేళ కుదరకపోతే మీ సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసులకు వెళ్లవచ్చు. కామన్ సర్వీసు సెంటర్‌లో వెళ్లిన తర్వాత రెండు ఫారంలు నింపాల్సి ఉంటుంది.ఆటో డెబిట్ ఆప్షన్‌కు అనుమతిస్తూ ఫారం నింపాల్సి ఉంటుంది. రెండు ఫారంలో మీ వివరాలు తెలపాల్సి ఉంటుంది.

  ఫారం నింపిన తర్వాత, ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ పీఎం - ఎస్‌వైఎం పథకానికి అనుసంధానం అవుతాయి. ఆ తర్వాత మీ మొబైల్ ఫోనుకు ఓటీపీ పాస్‌వర్డ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్ కామన్ సర్వీసు సెంటర్‌లో తెలియజేయాలి. ఆతర్వాత మీ పేరిట పెన్షన్ స్కీమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. అలాగే పెన్షన్ స్కీమ్‌నకు సంబంధించిన పాస్ బుక్, గుర్తింపు కార్డు కూడా జారీ చేస్తారు. ఈ విధంగా పీఎం - ఎస్‌వైఎంలో భాగస్వాములు అవ్వచ్చు.

  ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాలి :
  వయస్సును బట్టి మీ తరపున నెలసరి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు వచ్చే వరకూ చందా చెల్లించాలి. అనంతరం ప్రతి నెలా రూ.3000 పెన్షన్ జీవితాంతం పొందే వీలు దక్కుతుంది. ఆటో డెబిట్ ఆప్షన్ సౌకర్యం వల్ల ప్రతినెల వాయిదా బ్యాంకు అకౌంట్ నుంచే నేరుగా పీఎం - ఎస్‌వైఎం పథకంలో జమ అవుతుంది.
  First published: