news18-telugu
Updated: September 27, 2020, 7:00 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
Gold Rate| బంగారానికి భారతీయులకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. బంగారు ఆభరణం లేని భారతీయ గృహిణి ఉండదంటే అతిశయోక్తి కాదు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. పెట్టుబడి ఉద్దేశంతోనూ బంగారాన్ని కొనుగోలు చేస్తున్న వారు పెరుగుతున్నారు. అయితే అమ్మాయి పెళ్లి కోసం బంగారం కొనడం అనేది తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బంగారు షోరూంల వారి ఆఫర్ల మోజులో పడి షాపులకు వెళితే, మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బంగారం కొనేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక లుక్కేద్దాం. బంగారం కొనేటప్పుడు ముఖ్యంగా చూడాల్సింది దాని నాణ్యత, పసిడి నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు.

ఫ్రతీకాత్మకచిత్రం
బంగారం నాణ్యత సరిచూసుకోండి... హాల్ మార్క్ తప్పనిసరి...
24 కేరట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. అయితే బంగారు దుకాణాల్లో మనం కొనే బంగారు ఆభరణాలు సాధారణంగా 22 కేరట్ల బంగారం ఉంటుంది. నాణ్యతను బట్టి బంగారం 18, 14,12,10 కేరట్లలో దొరుకుతుంది. అయితే 22 కేరట్ల బంగారంలో 91.6 శాతం బంగారం ఉంటుంది. దీన్నే 916 బంగారం అంటారు. అయితే 18 కేరట్ల బంగారంలో కేవలం 75 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. కొంత మంది దుకాణదారులు 22 కేరట్ల బంగారం అని చెప్పి 18కేరట్ల బంగారంతో చేసిన నగలు అంటగడుతుంటారు. అలాంటప్పుడు మనం కొనే నగలపై తప్పనిసరిగా బీఐఎస్ హాల్ మార్క్ ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి. ఎంత చిన్న ఆభరణం (ఒక గ్రాము బరువు ఉన్నా) కొన్నప్పటికీ ఈ హాల్ మార్క్ తప్పనిసరి. 916 బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలనే వర్తకుల నుంచి డిమాండ్ చేసి కొనుగోలు చేయాలి.

(ప్రతీకాత్మక చిత్రం)
మజూరి, తరుగు విషయంలో జాగ్రత్త...
బంగారం కొనుగోలులో చూడాల్సిన మరో అంశం మజూరి, తరుగుదల, ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తరుగును బిల్లులో కలపడం సహజం. అయితే వీలైనంత తక్కుగా మజూరీ, తరుగు ఉండేలా వర్తకులను నుంచి డిమాండ్ చేయాలి.
తూకం విషయంలో హడావిడి వద్దు...జాగ్రత్తగా తూకం సరిచూసుకోండి...
అలాగే బంగారంలో తూకం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రాముల విషయంలో తేడా వచ్చిందంటే బిల్లు భారీగా పెరిగిపోతుంది. అయితే మిల్లీగ్రాములతో సహా లెక్కించాలని డిమాండ్ చేయాలి. అలాగే సాధారణంగా ఆభరణాల్లో రాళ్లు పొదిగిఉన్నప్పుడు వాటిని కలిపి బరువు తూస్తుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాళ్లను సెపరేట్ చేసి బరువు తూయమని డిమాండ్ చేయాలి.

(ప్రతీకాత్మక చిత్రం)
బంగారంతో సమానంగా...రశీదును భద్రపరుచుకోండి...
ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది రశీదు. బంగారు ఆభరణాలు కొన్న తర్వాత రశీదు జాగ్రత్తగా భద్రపరుచుకోవడం తప్పనిసరి. కిరాణా సరుకుల బిల్లు రశీదులా తీసిపారేయకుండా, అత్యంత జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకుంటే మున్ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రశీదు ఉంటే జవాబుదారీతనం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని దుకాణాలు 22 కేరట్ల ఆభరణమని చెప్పి 18 కేరట్ల ఆభరణం అంటగడతారు. అలాంటి సమయంలో మూడో వ్యక్తి చేత నగల నాణ్యతను టెస్ట్ చేయించినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అప్పుడు రశీదుతో వినియోగదారుల హక్కుల ఫోరం ఆశ్రయించవచ్చు.
Published by:
Krishna Adithya
First published:
September 27, 2020, 7:00 PM IST