ప్రపంచ దేశాల్లో యువ జనాభా (Millennials) అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌లో ముందుంటుంది. సుమారు 42.6 కోట్ల మందికి పైగా యువత ఉన్న భారత్.. రానున్న రోజుల్లో ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కే అవకాశముంది. భారత శ్రామిక శక్తిలో 47 శాతం, మొత్తం జనాభాలో 34 శాతం వాటా మిలీయనిల్స్‌దేనని పేటీఎం మనీ అనధికారిక అంచనాల నివేదిక పేర్కొంది. పెట్టుబడులు, వాణిజ్య విధానాలపై యువత ఆలోచనలు, వైఖరి వంటి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ రిపోర్టు విశ్లేషించింది. నివేదికలో ఏముందంటే..
ముందుగానే పెట్టుబడులు
పెట్టుబడుల విషయంలో యువత ముందే ఉంటున్నారు. భారత్‌లో చాలా మంది పెట్టుబడుదారుల సగటు వయస్సు 28 సంవత్సరాలే. పెట్టుబడిదారుల్లో 30 శాతం కంటే ఎక్కువ మంది వయసు 26 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంది. మరో 29 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసువారు ఉన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పెట్టుబడులు వంటి ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించాలని, దీనివల్ల పదవీ విరమణ నాటికి మంచి కార్పస్ పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా యువతలో 60 శాతం మంది ముందు నుంచే పెట్టుబడి పెడుతున్నారు. మహిళలు, తమ పురుష సహచరుల కంటే రెండింతలు పెట్టుబడి పెడుతూ.. ముందంజలో ఉన్నారు. మెట్రో నగరాల్లోనే కాకుండా దేశంలోని ఇతర చిన్న పట్టణాల్లోనూ పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్స్ పైనే ఎక్కువ ఆసక్తి..
యువకులు మ్యూచువల్ ఫండ్స్(64 శాతం), అనంతరం ఈక్విటీ (28 శాతం), చివరగా బంగారంపై(8 శాతం) పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. సగటున వినియోగదారుడు దాదాపు 10 లంప్ సమ్ (Lumpsum), 19 ఎస్ఐపీ లావాదేవీలను చేపట్టారు. పెట్టుబడి పెట్టిన సగటు మొత్తం 20 శాతం పెరిగింది. ఇంకా 76 శాతం మంది వినియోగదారులు ఆరోగ్యకరమైన సిప్‌లలో లావాదేవీలు జరుపుతున్నారు.
మన యువతలో రిస్క్ చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల పెట్టుబడి ప్లాన్స్ కు మంచి సమయం ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈక్విటీలు, ఇతర రియల్ ఎస్టేట్ లాంటి అధిక రిస్క్ కలిగిన వాటిలో వారు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మరీ అతిగా వెళ్లడం మంచిది కాదని, గ్లాంబ్లింగ్‌కు అవకాశముంటుందని యువతను హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earn money, Investment Plans, Money, Money making, Save Money, Saving money