Gold Jewellery | మీ దగ్గర ఎంత బంగారం ఉంది? వారసత్వంగా వచ్చింది ఎంత? ఎన్ని నగలు కొన్నారు? ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లో చూపించాలా? తెలుసుకోండి.
భారతీయులు బంగారాన్ని ఆభరణాల రూపంలో తరతరాలుగా వారసత్వ సంపదగా దాచుకుంటారు. ఇళ్లు, భూముల వలే బంగారాన్ని కూడా తర్వాతి తరాలకు ఇస్తుంటారు. ఒకవేళ మీరు కూడా బంగారు ఆభరణాలను వారసత్వం గా పొందినట్లయితే, మీ ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో వీటిని పేర్కొనాల్సిన అవసరం ఉందా? లేదా? అనే సందేహం సహజంగానే వస్తుంటుంది. వారసత్వంగా లభించే బంగారంపై లెక్కలు చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ, మీ వార్షిక ఆదాయం 50 లక్షలకు మించి ఉంటే మాత్రం, మీరు మీ ఆస్తులను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఇందులో వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు సమయంలో కూడా వీటి గురించి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, వారసత్వంగా లభించిన బంగారం విషయంలో, మీ పూర్వీకులు ఆ బంగారాన్ని ఎంత ధరకు కొనుగోలు చేశారో ఆ రేటును వెల్లడించవచ్చు.
ఒకవేళ, మీ వద్ద కొనుగోలుకు సంబంధించిన రశీదులు లేనట్లైతే 2001 ఏప్రిల్ 1 మార్కెట్ విలువను బట్టి ధరను లెక్కించవచ్చు. ఇక, బంగారం హోల్డింగ్స్ విషయానికొస్తే, ఒక వ్యక్తి ఎంత మొత్తంలోనైనా బంగారాన్ని కలిగి ఉండవచ్చు. దీనికి ఎటువంటి పరిమితులు లేవు. 2016లో ఆదాయపు పన్ను శాఖ ఒక సర్క్యులర్ ద్వారా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తనకు వారసత్వంగా లభించిన బంగారానికి రుజువు ఇవ్వగలిగితే, అతడు ఎన్ని బంగారు ఆభరణాలను అయినా నిల్వ చేసుకోవచ్చని సర్క్యులర్‌లో పేర్కొంది.
నిబంధనల ప్రకారం, వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల మేరకు మాత్రమే ఆదాయ రుజువు ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకోవచ్చు. పై మూడు మార్గాల్లో రుజువు లేకుండా నిర్దేశించిన పరిమితికి మించి ఇంట్లో బంగారం దొరికితే ఆదాయపు పన్ను శాఖ బంగారు ఆభరణాలను జప్తు చేసే అవకాశం ఉంటుంది. నిజానికి చాలామంది ఇంట్లో సూచించిన పరిమాణం కంటే ఎక్కువ బంగారాన్ని ఉంచుతారు, అప్పుడు వారు తమ ఆదాయ రుజువు ఇవ్వాలి. అలాగే, బంగారం కొనుగోలు చేసినట్లుగానూ, లేదా బహుమతిగా పొందినట్లు గాను దానికి సంబంధించిన రుజువు ఐటీ అధికారులకి చూపాల్సి ఉంటుంది. పన్ను పరిశీలన విషయంలో, బంగారం మూలాన్ని వివరించాలి.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, బహుమతిగా స్వీకరించిన బంగారం ఆభరణాల విలువ రూ .50,000 లోపు ఉండాలి. బంగారు ఆభరణాలు, వారసత్వంగా లభించే ఆభరణాలు పన్ను నికర పరిధిలోకి రావు. అయితే, ఈ బంగారం బహుమతిగా లేదా వారసత్వంగా వచ్చిందని మీరు నిరూపించాల్సి ఉంటుంది. అందువల్ల, కొనుగోలు చేసిన బంగారం విషయంలో రశీదులను సురక్షితంగా ఉంచుకోవడం మంచిది. మీకు వారసత్వంగా బంగారం లభించినట్లైతే మీరు అసలు ఇన్వాయిస్ల కాపీని లేదా బహుమతి దస్తావేజు, సెటిల్మెంట్ డీడ్ లేదా వీలునామా కాపీని ఐటీ అధికారులకు చూపవచ్చు. డాక్యుమెంటరీ ఆధారాలు లేకపోతే, బంగారం మూలాన్ని నిర్ణయించడానికి పన్ను అధికారులు కుటుంబ ఆచారాలు, సామాజిక స్థితిగతులు మొదలైన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.