Debt Funds: కొత్త ఆర్థిక సంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వివిధ రకాల పెట్టుబడులపై కొత్త రూల్స్(New rules) అమల్లోకి రానున్నాయి. ఫైనాన్స్ బిల్లు-2023 కు చేసిన సవరణల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో కొన్ని మార్పులు రానున్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ (Debt mutual funds)పెట్టుబడిదారులు ఇకపై లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ (LTCG) ట్యాక్స్ ప్రయోజనానికి అర్హులు కారు, బ్యాంకు డిపాజిట్ల మాదిరిగానే వారు పన్ను పరిధిలోకి వస్తారు. ఈ ప్రతిపాదిత మార్పులు గోల్డ్, ఇంటర్నేషనల్ ఈక్విటీ, డొమెస్టిక్ ఈక్విటీ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌కు కూడా వర్తిస్తాయి.
2023 మార్చి 24న ఆర్థిక బిల్లు-2023కు చేసిన సవరణలను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ఇది కేవలం లాంఛనప్రాయమని నిపుణులు అంటున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఫండ్స్ ఇన్వెస్టర్లకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
కొత్త ఆర్థిక సంవత్సరంలో డెట్ ఫండ్స్, ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు), ఇంటర్నేషనల్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, కొన్ని రకాల హైబ్రిడ్ ఫండ్స్ నుంచి అందే లాభాలపై (హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా) ఇప్పుడు వ్యక్తుల ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు. అంటే ఇండెక్సేషన్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు రద్దు కానున్నాయి.
* డెట్ ఫండ్స్, ఎఫ్‌డీలు, బాండ్లలో ఏది బెస్ట్?
ప్రస్తుతం డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లకు పైగా ఉంచిన అనంతరం వెనక్కు తీసుకుంటే.. ఈ సందర్భంలో అందే లాభాలను లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌గా పరిగణిస్తున్నారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో ఈ మొత్తంపై 20 శాతం ట్యాక్స్ చెల్లించాలి. డెట్ ఫండ్స్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మూడేళ్లలోపు వెనక్కు తీసుకుంటే, దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌గా లెక్కిస్తున్నారు. ఈ లాభాలను వ్యక్తుల ఆదాయంతో కలుపుతారు, దానిపై వర్తించే ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), బాండ్లతో పోలిస్తే అధిక ఆదాయ పన్ను పరిధిలో ఉన్న లాంగ్‌టర్మ్ ఇన్వెస్టర్స్‌కు ఇది మంచి పోస్ట్-టాక్స్ ఆప్షన్‌గా ఉంటుంది. FDలు, బాండ్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై ఒక వ్యక్తి ఆదాయ పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే తాజా మార్పుల ప్రకారం.. డెట్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో మూడేళ్ల హోల్డింగ్ పిరియడ్ ఇకపై కొనసాగదు. అంటే 2023 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన డెట్ ఫండ్స్ రిడమ్షన్‌పై అందే ఏదైనా క్యాపిటల్ గెయిన్.. వ్యక్తుల ఆదాయ పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది.
వడ్డీపై పన్ను వర్తించినప్పటికీ, లిస్టెడ్ బాండ్స్‌పై మూలధన లాభాల పన్ను కూడా విధిస్తారు. లిస్టెడ్ బాండ్ల నుంచి స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఒక సంవత్సరం వరకు హోల్డింగ్ వ్యవధి ఉండేవి).. వ్యక్తి ఆదాయ పన్ను శ్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ లేకుండా 10 శాతం పన్ను విధిస్తారు. అయితే బాండ్ల విషయంలో.. మూలధన లాభం కంటే కూపన్ (వడ్డీ) ఆదాయానికి ముఖ్యమైన వనరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా రూల్స్ విశ్లేషిస్తే.. డెట్ ఫండ్స్ (క్యాపిటల్ గెయిన్స్), బాండ్లు, ఎఫ్‌డీలు (వడ్డీ ఆదాయం) మూడు ఇప్పుడు పన్ను కోణం నుంచి సమానంగా ఉన్నాయి.
Demat Account: మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందా..?మార్చి 31లోపు ఇలా చేయకుంటే అది పనికిరాదు..!
* ప్రభుత్వ లక్ష్యం ఏంటి?
ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ కంపెనీ డెజర్వ్ (Dezerv) సహ వ్యవస్థాపకుడు సందీప్ జెత్వానీ తాజా రూల్స్‌పై వ్యాఖ్యానిస్తూ.. స్థిరమైన ఆదాయాన్ని అందించే అన్ని విభిన్న పెట్టుబడి ఆప్షన్లను కామన్ ట్యాక్స్ స్ట్రక్చర్ కిందకు తీసుకురావాలనేది ప్రభుత్వ వర్గాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని చెప్పారు. ఆయన మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ.. మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు (MLDలు), బీమా పాలసీలు, ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మార్పులు వచ్చాయని, దీనివల్ల పెద్ద పెట్టుబడిదారులకు లభించే పన్ను ప్రయోజనాలు దూరం అవుతున్నాయని తెలిపారు. మరోవైపు ఇది బ్యాంకులకు మూలధన సమీకరణను సులభతరం చేస్తుందని వివరించారు.
* ఇప్పుడు డెట్ ఫండ్స్ విక్రయించాలా? డెట్ ఫండ్స్ నుంచి FDలకు మారడం మంచిదా?
ఈ విషయంపై Edelweiss AMC ప్రొడక్ట్, మార్కెటింగ్ అండ్ డిజిటల్ బిజినెస్ హెడ్, నిరంజన్ అవస్తి మనీ కంట్రోల్‌తో మాట్లాడారు. లిక్విడ్, ఓవర్‌నైట్, లో-డ్యూరేషన్ ఫండ్స్ వంటి డెట్ మ్యూచువల్ ఫండ్స్ .. ఇతర స్వల్పకాలిక పెట్టుబడి మార్గాలతో పోలిస్తే ఇప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే తాజా మార్పుల కారణంగా మీడియం నుంచి లాంగ్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెరుగుతున్న పెట్టుబడి ప్రవాహాలు ప్రభావితం కావచ్చని ఆయన వివరించారు.
షేర్‌ఖాన్ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్ హెడ్ గౌతమ్ కలియా మనీ కంట్రోల్‌తో మాట్లాడుతూ.. ఇకపై ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కి కొత్త ఇన్వెస్టర్లు మారరని చెప్పారు. ఇండెక్సేషన్ బెనిఫిట్ విత్‌డ్రా, మార్కెట్ నష్టాల అవకాశం కారణంగా.. ట్రెడిషనల్ ఇన్వెస్టర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ ఫండ్స్ తక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు.
డెట్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్ మొదలైన వాటిలో ఇప్పటికే ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్, మార్చి 31 వరకు వాటిలో చేసిన కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌పై కూడా ఈ మార్పు ప్రభావం చూపదు. ఈ ఫండ్స్ మునుపటిలాగా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలను అందిస్తూనే ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Finance, Mutual Funds