Home /News /business /

HOW CAN AN INSURANCE POLICY BE REVIVED AFTER IT TERMINATION THESE ARE THE RECOMMENDATIONS OF EXPERTS PRV GH

Insurance Policies: ఇన్సూరెన్స్ పాలసీ రద్దయిన తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చా? నిపుణుల సూచనలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రద్దయిన లేదా ల్యాప్స్‌డ్‌ పాలసీని మళ్లీ ఎలా (Revive) పునరుద్ధరించుకోవాలి? అలానే లోన్స్ ఉంటే బ్యాంకులు మీ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయగలుగుతాయా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం బీమా పాలసీ (Insurance Policies)లను కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ పొందాలనుకునే వారి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో బీమా పాలసీలు కొనుగోలు చేయడం తప్పనిసరిగా ఉంటుంది. చాలామంది ఈ బీమా పాలసీలు తీసుకుని క్రమం తప్పకుండా ప్రీమియం (Premium) చెల్లిస్తారు. కానీ కొందరు మాత్రం వివిధ కారణాల వల్ల ప్రీమియం చెల్లించడంలో విఫలమవుతుంటారు. గడువు తేదీలో లేదా గ్రేస్ పీరియడ్ (Grace Period) తర్వాత కూడా ప్రీమియం మొత్తాన్ని వీరు చెల్లించలేరు. కారణమేదైనా సరే ఇలాంటి సందర్భాల్లో బీమా సంస్థలు పాలసీదారుకు అన్ని ప్రయోజనాలను నిలిపివేసి, పాలసీని రద్దు చేస్తాయి. దీన్నే పాలసీ ల్యాప్స్‌డ్‌ (Policy Lapsed) అని పిలుస్తారు. మరి రద్దయిన లేదా ల్యాప్స్‌డ్‌ పాలసీని మళ్లీ ఎలా (Revive) పునరుద్ధరించుకోవాలి? అలానే లోన్స్ ఉంటే బ్యాంకులు మీ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయగలుగుతాయా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

ప్రీమియం చెల్లించనట్లయితే..

బీమా పాలసీని కొనుగోలు చేసి తొలి రోజుల్లో ప్రీమియం చెల్లించి ఆ తర్వాత ఏళ్లపాటు ప్రీమియం చెల్లించలేకపోతుంటారు పాలసీదారులు. తమ వద్ద డబ్బులు ఉన్నప్పుడు పాలసీని పునరుద్ధరించుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మళ్లీ ప్రీమియం చెల్లించడం ప్రారంభించవచ్చా? పాలసీ రద్దు అయిందా? భవిష్యత్తులో ప్రీమియంలను సకాలంలో చెల్లించకపోతే ఏమి జరుగుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం, బీమా కంపెనీలు బకాయి ఉన్న ప్రీమియం చెల్లించడానికి పాలసీ పునరుద్ధరణ తేదీ నుంచి 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. ఈ గ్రేస్ పీరియడ్‌ తర్వాత కూడా ప్రీమియం చెల్లించనట్లయితే, పాలసీని రద్దు చేస్తాయి. అయితే, రద్దయిన పాలసీలను పునరుద్ధరించవచ్చు (Policy Can Be Revived) లేదా మళ్లీ కొనసాగించవచ్చు. మీరు ఇప్పటివరకు చెల్లించని ప్రీమియంలు, బీమాదారు విధించిన అదనపు ఛార్జీలను (Additional Charges) చెల్లించడం ద్వారా బీమా పాలసీని పునరుద్ధరించవచ్చు.

సాధారణంగా బీమా సంస్థలు రద్దయిన పాలసీలను పునరుద్ధరించడానికి ప్రత్యేక పథకాలు లేదా ఆఫర్లు ప్రకటిస్తాయి. అటువంటి పథకాలలో, వారు సాధారణంగా ఏవైనా జరిమానాలు (Penalties) లేదా అదనపు ఛార్జీలను మాఫీ చేస్తారు. మీరు భవిష్యత్తులో ప్రీమియంలు చెల్లించకూడదనుకుంటే, మీరు పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. మీ పాలసీ సరెండర్ వాల్యూని పొందాలంటే మీరు నిర్దిష్ట సంవత్సరాలపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ మూడేళ్లపాటు ప్రీమియం చెల్లించిన వారికి సరెండర్ వాల్యూ ఆఫర్ చేస్తుంది. ఈ వ్యాల్యూ అనేది కంపెనీని బట్టి మారవచ్చు.

పాలసీ అమౌంట్‌ను క్లెయిమ్ చేస్తాయా?

కొందరు వ్యక్తులు బ్యాంకులో ఇల్లు, కారు, లేదా పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. మరోవైపు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి డబ్బులు చెల్లిస్తుంటారు. అయితే తాము లోన్స్ తీర్చకపోతే బ్యాంకులు తమ పాలసీ అమౌంట్‌ను క్లెయిమ్ చేస్తాయా అనే సందేహం కొందరిలో ఉంటుంది. ముఖ్యంగా అకాల మరణం చెందినప్పుడు పాలసీదారుని నామినీకి కాకుండా పాలసీ మొత్తం బ్యాంకులు తీసుకుంటాయా? అనే డౌట్ కూడా ఉంటుంది. పాలసీ ద్వారా నామినీ అందుకున్న మొత్తాన్ని బ్యాంకులు క్లెయిమ్ చేయకుండా ఎలాంటి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

బ్యాంకులు లేదా రుణదాతలు టర్మ్ ప్లాన్ లబ్ధిదారునిగా మారవచ్చు. మీరు వారికి జీవిత బీమా పథకాన్ని కేటాయించినట్లయితేనే బ్యాంకులు పాలసీ మొత్తాన్ని క్లెయిమ్ చేయగలుగుతాయి. మీ హక్కులను మరొక వ్యక్తికి లేదా సంస్థకు బదిలీ చేసే ప్రక్రియను “అసైన్‌మెంట్” అంటారు. పెద్ద రుణ మొత్తాలకు అసైన్‌మెంట్ సాధారణం, ఇక్కడ మీరు పాలసీదారుగా మీ జీవిత బీమా పాలసీని బ్యాంక్(ల)కి కేటాయించవచ్చు. అయితే, అసైన్‌మెంట్ లేనప్పుడు, రుణాన్ని రికవరీ చేయడానికి మీ ఎస్టేట్‌ను అటాచ్ చేసి కోర్టుల ద్వారా మాత్రమే బ్యాంక్ మీ ఇన్సూరెన్స్ అమౌంట్ పై తన హక్కును క్లెయిమ్ చేయగలదు. వివాహిత మహిళ విషయానికొస్తే, వివాహిత మహిళల రక్షణ చట్టం (Married Women Protection Act) కింద పాలసీని కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకుల నుంచి పాలసీ మొత్తాన్ని సురక్షితంగా పొందవచ్చు. అటువంటి పాలసీల నుంచి వచ్చే ఆదాయం కేవలం భార్యకు మాత్రమే చెందుతుంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Insurance, Life Insurance

తదుపరి వార్తలు