ఈ ఏడాది కరోనా తీసుకొచ్చిన ఆర్థిక సంక్షోభంతో ఎక్కువగా నష్టపోయిన రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఉంది. కోవిడ్ కంటే ముందు నుంచే ఆ రంగం పడుతూ లేస్తూ వస్తున్నా.. కరోనా దానిని మరింత దెబ్బకొట్టింది. అయితే కొద్దికాలంగా ఆ రంగం తిరిగి పుంజుకుంటున్నది. గతంతో పోలిస్తే గృహాల అమ్మకాలు పెరుగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ను ఇలాగే కొనసాగిస్తూ.. వచ్చే పండుగల సీజన్ లో ఇది మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ క్వార్టర్ లో హౌసింగ్ సేల్స్ గత త్రైమాసికంతో పోలిస్తే 35 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.
రానున్న రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ఉండటం.. దేశంలోనూ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఈ రంగం తిరిగి గాడిన పడనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అంతేగాక తక్కువ వడ్డీకే గృహాల రుణాలు, స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా తగ్గాయి. దీనికి తోడు పండుగల సందర్భంగా రియల్టర్లు.. కొత్తగా కట్టిన ఇళ్ల మీద ఆఫర్లు ప్రకటించే అవకాశం కూడా ఉండటంతో.. ఈ డిసెంబర్ త్రైమాసికంలో గృహ అమ్మకాలు గతంలో కంటే 35 శాతం పెరుగుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అంచనా వేస్తున్నది.
హైదరాబాద్ లో డిసెంబర్ త్రైమాసికంలో గృహ అమ్మకాలలో 20-24 శాతం పెరుగుదల ఉండొచ్చునని అనరాక్ కన్సల్టెన్సీ అంచనా వేస్తున్నది. బెంగళూరులో జులై-సెప్టెంబర్ కాలంలో గృహాల అమ్మకాలు 5,400 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి ప్రస్తుత త్రైమాసికంలో 30-35 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా హౌస్ సేల్స్ 27-31 శాతం పెరగొచ్చునని అంచనా వేస్తున్నారు. కోల్ కతాలో 30 శాతం, చెన్నైలో 20 నుంచి 25 శాతం దాకా ఇళ్ల అమ్మకాలు పెరగొచ్చునని అనరాక్ తెలిపింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో టాప్ 7 నగరాల్లో దాదాపు 29,520 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది కోవిడ్ కంటే ముందు మూడు నెలలతో పోల్చితే తక్కువే అయినా.. పండుగల సీజన్.. ఇతరత్రా సానుకూల అంశాల ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందని నిపుణులు ఆశాభావంలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.