ఇండియన్ బైక్ మార్కెట్లో హీరో కంపెనీ తర్వాత హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) బాగా పాపులర్ అయింది. 125cc పైన హోండా యూనికాన్, హోండా షైన్ బైక్స్ ఇండియాలో హార్ట్ కేకుల్లా అమ్ముడుపోతాయని స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. కానీ 100cc రేంజ్‌లో హీరో స్ప్లెండర్‌కి హోండా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతోంది. ఎందుకంటే హోండా ఈ రేంజ్‌లో నిన్నటిదాకా ఒక్క బైక్ కూడా తీసుకురాలేదు. కాగా ఎట్టకేలకు హోండా ఈరోజు (మార్చి 15) ఇండియాలో 100 సీసీ బైక్‌ను లాంచ్ చేసింది. హోండా షైన్ 100 (Honda Shine 100) పేరుతో ఈ కొత్త బైక్‌ను ఇండియాలో రూ.64,900 (పన్నులు మినహాయించి) పరిచయ ధరతో రిలీజ్ చేసింది.
* మే నెలలో డెలివరీ
కస్టమర్లు ఈరోజు నుంచే హోండా షైన్ 100 బైక్‌ను అథారైజ్డ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. హోండా షైన్ 100 తయారీ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. డెలివరీలు 2023, మే నెలలో ప్రారంభమవుతాయి. ఈ ఆల్ న్యూ బైక్ బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ అనే ఐదు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇంకా షైన్ 100 పవర్, టార్క్, మైలేజ్ వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ బైక్ లీటర్‌కి 65 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వనుందని సమాచారం.
* ముఖ్యమైన ఫీచర్లు
హోండా షైన్ 100 స్పెషల్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, నారో లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో తేలికైన, మన్నికైన స్టీల్ ఫ్రేమ్‌తో లాంచ్ అయింది. ఇందులో ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం గ్రాబ్ రైల్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్, కాంబి-బ్రేక్ సిస్టమ్ సైతం అందించారు. దీని సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
బ్రేకింగ్ పవర్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో పాటు ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఫ్రంట్ కౌల్, బోల్డ్ టెయిల్ ల్యాంప్, మఫ్లర్‌తో ఉన్న దీని స్టైలింగ్ షైన్ 125 బైక్‌ను పోలి ఉంది. ఈ కొత్త బైక్ సీటు పొడవు 677 మిమీ కాగా సీటు ఎత్తు 786 మిమీ. ఇది 1245 mm వీల్‌బేస్, 168 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1.9 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో వస్తుంది. బైక్‌ను కొత్త 100 cc PGM-FI పెట్రోల్ ఇంజన్‌తో eSP టెక్నాలజీతో అందించారు. ఇది OBD2 కంప్లైంట్‌ను కలిగి ఉంది.
ఇది కూడా చదవండి : S1 స్కూటర్లలో ఫ్రంట్ ఫోర్క్ సమస్య.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఓలా!
కంపెనీ షైన్ 100పై ప్రత్యేక 6-సంవత్సరాల వారంటీ ప్యాకేజీని (3 సంవత్సరాల స్టాండర్డ్ + 3 సంవత్సరాల ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ) కూడా అందిస్తోంది. హోండా తమ కొత్త షైన్ 100సీసీ బైక్ స్పీడ్, మైలేజ్ రెండింటిలోనూ 100cc విభాగంలో బెస్ట్‌గా నిలుస్తుందని చెబుతోంది. ఈ బైక్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్, సోలనోయిడ్ టెక్నాలజీ ఇచ్చామని, దీని సాయంతో బైక్ ఏ వాతావరణంలో అయినా సులభంగా స్టార్ట్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
* హీరో స్పెండర్‌కి అసలైన పోటీ
భారతదేశంలో 33% మోటార్‌సైకిల్ విక్రయాలు 100cc సెగ్మెంట్‌లో నమోదవుతుంటాయి. హీరో స్ప్లెండర్ ఈ సెగ్మెంట్‌లో దాదాపు 2,50,000 యూనిట్ల నెలవారీ విక్రయాలతో టాప్ సెల్లింగ్ బైక్‌గా రాణిస్తోంది. హోండా ప్రస్తుతం ఈ విభాగంలో షైన్ 100 మోటార్‌సైకిల్‌తో ఆదిపత్యం చెలాయించాలని ఆశిస్తోంది. హోండా కొత్త షైన్ 100 ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మార్కెట్‌లో 15-20% వాటా కైవసం చేసుకోగలిగితే, భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించడం పెద్ద కష్టమేమీ కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.