కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు ఈ నెలలో డియర్‌నెస్ అలవెన్స్(DA)ను పెంచుతున్నట్లు సమాచారం. అలాగే రిటైర్డ్ సిబ్బందికి సంబంధించిన డియర్‌నెస్ రిలీఫ్‌ను కూడా కేంద్రం పెంచనుంది. సాధారణంగా డీఏ, డీఆర్‌ను సంవత్సరానికి రెండుసార్లు జనవరి, జులై నెలల్లో పెంచుతారు. ఆ లెక్కన త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ, డీఆర్ సవరణ ఉంటుంది. కాగా, దేశంలో చాలా కాలం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతానికి పైగా ఉండడం గమనార్హం.
* డీఏ ఎంత పెరగొచ్చు?
కేంద్రప్రభుత్వం జులైలో 4 శాతం వరకు డీఏను పెంచనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ఫ్రైస్ ఇండెక్స్ (AICPI) జనవరి, ఫిబ్రవరిలో వరుసగా 125.1, 125గా ఉంది. అది మార్చిలో ఒక శాతం పెరిగి 126కు చేరింది. ఇది ఇంతటితో ఆగలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఏప్రిల్‌లో ఏఐసీపీఐ 127.7, మేలో ఏకంగా 129కి పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్‌లో సీపీఐ (కన్స్యూమర్ ఫ్రైస్ ఇండెక్స్) ఆధారిత ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. జూన్‌లో మాత్రం కొద్దిగా తగ్గి 7.01 శాతానికి చేరింది.
* డీఏ లెక్కింపు ఇలా..
ఉద్యోగి బేసిక్ శాలరీ ఆధారంగా డీఏ పెంపును లెక్కిస్తారు. తద్వారా ఉద్యోగి మొత్తం జీతం పెరుగుతుంది. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో నిర్దేశిత స్థాయిల్లో డ్రా చేసుకోవడానికి అవకాశం ఉన్న వేతనాన్ని ‘బేసిక్ పే’ అంటారు. ఇందులో ఇతర రకాల స్పెషల్ పే కలిసి ఉండవు. ఆఫీస్ మెమోరాండం ప్రకారం.. డియర్‌నెస్ అలవెన్స్ అనేది FR 9(21) పరిధిలో చెల్లింపుగా కాకుండా, వేతనానికి సంబంధించిన ప్రత్యేక అంశంగా కొనసాగుతుంది.
* గత డీఏ బకాయిల సంగతి ఏంటి?
గత డీఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కేంద్రం ప్రభుత్వం ఒక సంవత్సరానికి పైగా డీఏను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మూడు DAలు ఫెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను ప్రభుత్వం జమ చేసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం డీఏ బకాయిలను చెల్లింపు విషయాన్ని కేంద్ర పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
కాగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ శాలరీపై 34 శాతం డీఏ పొందుతున్నారు. ఇప్పుడు 4 శాతం డీఏ పెంపును అమలు చేస్తే, వారు వారి మూల వేతనంపై 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందబోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, DA Hike, Employees, Salary Hike