వస్తువుల ధరలు పెరగడంతో నష్టాలు ఎదురుకాకుండా ఆటో మొబైల్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏడాదిగా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్లో బైక్స్, స్కూటర్స్ ఎక్స్-షోరూమ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బైక్, స్కూటర్స్ ధరలు ఈసారి రూ.1500 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే వాహనం మోడల్, వాటి మార్కెట్‌ను బట్టి ధరల్లో కొంత మార్పు ఉండవచ్చు.
నాలుగోసారి ధరల పెంపు
ఈ సంవత్సరం హీరో మోటోకార్ప్ బైక్ ధరలను పెంచడం ఇది నాలుగోసారి. గత సెప్టెంబర్‌లోనూ బైక్స్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దాదాపు రూ.1000 వరకు ధరలను పెంచింది. పెంచిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. ద్రవ్యోల్బణం కారణంగానే బైక్‌ల ధరలు పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ అప్పుడు కూడా ప్రకటించింది. అంతకు ముందు ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ బైక్స్, స్కూటర్ల ధరలను హీరో మోటర్ కార్ప్ పెచ్చింది. ఈ పెంపు దాదాపు రూ.2000 వరకు ఉంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు అప్పట్లో ఈ బైక్ తయారీ కంపెనీ ప్రకటించింది.
రూ.3 వేల వరకు పెరిగిన ధరలు
కాస్ట్ ఇన్‌ప్లేషన్, కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా బైక్స్, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు హీరో మోటర్ కార్ప్ వెల్లడించిన తరువాత ఈ ఏడాది జులై 1 నుంచి ఇప్పటి వరకు స్కూటర్స్, బైక్‌ల ధరలు దాదాపు రూ. 3000 వరకు పెరిగాయి. ధరల పెంపుపై హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. కాస్ట్ ఇన్‌ప్లేషన్ కారణంగా వ్యయాలు పెరిగియాని, దీంతో ధరలను సవరించామని ఆయన తెలిపారు. కస్టమర్లపై ఈ పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి, కంపెనీ వినూత్న ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడాన్ని కొనసాగిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. కంపెనీ పొదుపు కార్యక్రమాలను కూడా అమలు చేస్తుందని, ఇది మరింత ఖర్చు ప్రభావాన్ని తగ్గించడానికి, మార్జిన్లను మెరుగుపరచడంలో సహాయపడుతుందని గుప్తా పేర్కొన్నారు. ఆర్థిక సూచికలు డిమాండ్‌లో వృద్ధిని సూచిస్తున్నాయని, రాబోయే త్రైమాసికాల్లో పరిశ్రమ మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని గుప్తా పేర్కొన్నారు.
రాబోయే రెండేళ్లలో ప్రీమియం బైక్
బడ్జెట్ బైక్ సెగ్మెంట్ (100-110సీసీ)లో భారత మార్కెట్లో ప్రస్తుతం హీరో జోరు కొనసాగుతుంది. అయితే ప్రీమియం సెగ్మెంట్(160సీసీ)లోనూ మార్కెట్‌ను పెంచుకునేందుకు హీరో మోటర్‌కార్ప్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రీమియం బైకుల తయారీ కంపెనీ హార్లే డేవిడ్సన్తో 2020లో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్న బైక్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని రాబోయే రెండేళ్లలో మార్కెట్లలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని నిరంజన్ గుప్తా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Hero moto corp, Price Hike, Two wheelers