కొన్నిసార్లు అనుకోని అవసరాలతో చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చవుతుంది. ఆస్తులు ఉన్నా, డబ్బుకోసం వాటిని అమ్మాల్సినంత అత్యవసర పరిస్థితులు ఉండవు. దీంతో నిధుల కోసం లోన్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్తులను అమ్మకుండా, వాటిపై తక్కువ వడ్డీ రేట్లతో లోన్ తీసుకునే అవకాశాన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కల్పిస్తున్నాయి. వీటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఇవి వ్యక్తులు తమ ఆస్తులను అమ్మకుండా, కీలకమైన ఆర్థిక లక్ష్యాలపై రాజీ పడకుండా నిధులను సేకరించే వీలు కల్పిస్తాయి. లోన్లు తిరిగి చెల్లించలేని సందర్భంలో, తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను అమ్ముకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ లోన్లకు క్రెడిట్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా కస్టమర్ల క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం పడదు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్లతో పోలిస్తే.. సెక్యూర్డ్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ విభాగంలో నాలుగు ప్రధానమైన లోన్ ఆప్షన్లు ఉన్నాయి.
సెక్యూరిటీలపై తీసుకునే లోన్లు (Loan against securities)
బాండ్లు, షేర్లు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్లు, NSC, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, KVPలు.. వంటి వాటిపై ఆర్థిక సంస్థలు లోన్లను అందిస్తాయి. లోన్ తీసుకున్న తరువాత కూడా లబ్ధిదారులకు ఈ సెక్యూరిటీల నుంచి వడ్డీ, డివిడెండ్, బోనస్ వంటివి అందుతాయి. వాటి కాలవ్యవధి ఉన్నంత వరకు ఈ ప్రయోజనాలను ఎలాంటి నిబంధనలు లేకుండా పొందవచ్చు. సెక్యూరిటీలపై రిజర్వు బ్యాంక్ నిర్దేశించిన లోన్ టు వ్యాల్యూ (LTV) నిష్పత్తి ఆధారంగా రుణదాత సంస్థలు కస్టమర్లకు ఇవ్వాల్సిన లోన్‌ను లెక్కిస్తాయి.
సెక్యూరిటీలపై ఇచ్చే లోన్లను నిర్ణీత క్రెడిట్ లిమిట్‌తో ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో అందిస్తారు. కస్టమర్లు అవసరాలకు అనుగుణంగా మొత్తం మంజూరు చేసిన లిమిట్‌ను ఒకేసారి.. లేదా దాంట్లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. రీపేమెంట్ చేసే వరకు కస్టమర్లు తీసుకున్న మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌పై తీసుకున్న మొత్తాన్ని గడువు లోపు ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు. ఇందుకు ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
గోల్డ్ లోన్
గోల్డ్ లోన్లను వీలైనంత త్వరగా పొందవచ్చు. సాధారణంగా కస్టమర్లు దరఖాస్తు పెట్టుకున్న రోజే ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్ మంజూరు చేస్తాయి. దీని రీపేమెంట్ పీరియడ్ మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని సంస్థలు 4-5 సంవత్సరాల కాలపరిమితిని కూడా అందిస్తున్నాయి. తాకట్టు పెట్టిన బంగారం, ఆర్బీఐ LTV నిష్పత్తి ఆధారంగా లోన్ మొత్తాన్ని నిర్దేశిస్తారు. గోల్డ్ లోన్ తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు కస్టమర్లకు సౌలభ్యం కల్పిస్తున్నాయి. EMI, బుల్లెట్ రీ పేమెంట్ విధానంతో పాటు... రుణగ్రహీత వడ్డీ మొత్తాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. లోన్ గడువు ముగిసే సమయంలో ప్రిన్సిపల్ అమౌంట్‌ను చెల్లించవచ్చు.
ఆస్తులపై తీసుకునే లోన్ (Loan against property)
నివాస సముదాయాలు, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీలపై ఆర్థిక సంస్థలు లోన్ మంజూరు చేస్తాయి. సంబంధిత ఆస్తి మార్కెట్ విలువలో 50-70 శాతం వరకు లోన్ పొందవచ్చు. లోన్ తిరిగి చెల్లించే రీపేమెంట్ పీరియడ్ 15 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని సంస్థలు 20 సంవత్సరాల గడువుతో కూడా లోన్లు ఇస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమైన వారు, తక్కువ ఈఎంఐలు చెల్లించాలి అనుకునేవారు ఈ లోన్లను ఎంచుకోవచ్చు. అత్యవరంగా నిధులు అవసరమైన వారికి ఈ విధానం సరైనది కాదు. ఎందుకంటే కస్టమర్లకు లోన్ మంజూరు చేసేందుకు 2-3 వారాల సమయం పట్టవచ్చు.
టాప్-అప్ హోమ్ లోన్
ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారు టాప్ అప్ హోమ్ లోన్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మెరుగైన రీపేమెంట్ హిస్టరీ ఉన్న కస్టమర్లకే రుణదాతలు ఈ అవకాశాన్ని కల్పిస్తాయి. సాధారణంగా ముందు మంజూరు చేసిన హోమ్ లోన్ మొత్తానికి, బకాయి ఉన్న హోమ్ లోన్ మొత్తానికి మధ్య తేడాను టాప్ అప్ హోమ్ లోన్ అమౌంట్‌గా గుర్తిస్తారు. ఈ లోన్ చెల్లించే గడువు.. అసలు గృహ రుణం రీపేమెంట్ పీరియడ్‌కు మించి ఉండకూడదు. సాధారణంగా ఈ గడువు 15 సంవత్సరాలకు పరిమితం అవుతుంది. దీనిపై అసలు హోమ్ లోన్ కంటే కాస్త ఎక్కువ వడ్డీ ఉండవచ్చు. ఈ లోన్ల పంపిణీకి 1-2 వారాల సమయం పడుతుంది.