పెరుగుతున్న వ్యాధులు, పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం కారణంగా ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీ తీసుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది. అయితే, ప్రస్తుతం చాలా ఆరోగ్య పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మీరు ఆరోగ్య పాలసీ తీసుకున్నట్లయితే దానిని గుడ్డిగా రెన్యువల్ (Renewal) చేసుకోకుండా అందుబాటులో ఉన్న ప్రయోజనాలు, ఫీచర్లను పరిశీలించాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ప్రయోజనాలు, ప్రీమియం, నాణ్యత పట్ల మీకు అసంతృప్తి ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేసుకోవచ్చు. మరి ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీ (Health Insurance Portability) అంటే ఏంటి? దీనివల్ల లాభనష్టాలు ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.
* ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీ అంటే ఏంటి? : 2011లో, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDA) హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీని ప్రవేశపెట్టింది. పాలసీదారులు పోర్టబిలిటీ ద్వారా ఎలాంటి క్రెడిట్‌ను కోల్పోకుండా మెరుగైన సేవల కోసం మరొక బీమా సంస్థకు మారొచ్చు. పోర్టబిలిటీ అనేది రిస్క్ కవర్ ఉన్న ఉత్పత్తులకు మాత్రమే పరిమితం అవుతుందని గమనించాలి.
* ఎప్పుడు పోర్ట్ చేయాలి? : బీమా కంపెనీ హామీ ఇచ్చిన ప్రకారం బెనిఫిట్స్ అందించకపోతే పాలసీని పోర్ట్ చేయవచ్చు. నిర్దిష్ట అనారోగ్యాలకు తగిన ప్రొటెక్షన్ అందించకపోయినా పోర్ట్ చేసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ స్లోగా ఉందనుకున్నా మరొక సంస్థకు పాలసీని పోర్ట్ చేయవచ్చు. ప్రస్తుత పాలసీకి చెల్లిస్తున్న ప్రీమియంకే ఇతర బీమా కంపెనీలు మెరుగైన సేవలను అందించినప్పుడు కూడా ఆరోగ్య బీమా పోర్టబిలిటీని ఎంచుకోవచ్చు.
* హెల్త్ ఇన్సురెన్స్ పోర్ట్ వల్ల ప్రయోజనాలివే..
1. పాలసీదారు పోర్టింగ్ చేస్తున్నప్పుడు వారి ప్రస్తుత ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా పాలసీని సవరించవచ్చు. 2. పోర్టబిలిటీ సమయంలో ఉన్న బోనస్‌కు ఇప్పటికే ఉన్న బీమా మొత్తం, నో క్లెయిమ్ బోనస్‌కు యాడ్ అవుతుంది. తద్వారా కొత్తగా బీమా మొత్తం నిర్ణయించడం జరిగింది. 3. పాత పాలసీ ప్రయోజనాలు కొత్త విధానంలోనూ కొనసాగుతాయి. 4. పాలసీదారులు తక్కువ ప్రీమియం ధరలకు ప్రస్తుత ప్రయోజనాలను పొందవచ్చు. 5. మెరుగైన సర్వీస్ ద్వారా పాలసీదారులు ప్రయోజనం పొందవచ్చు. 6. మెరుగైన క్లెయిమ్ సెటిల్‌మెంట్స్ పొందొచ్చు. 7. హిడెన్ నిబంధనలు, షరతులను నివారించడానికి కొత్త సర్వీస్ ప్రొవైడర్‌కు కూడా పోర్ట్ చేయవచ్చు.
* హెల్త్ ఇన్సురెన్స్ పోర్ట్ వల్ల నష్టాలు..
1. పాలసీని రెన్యువల్ చేయాల్సిన సమయంలోనే పోర్ట్ చేయడం సాధ్యమవుతుంది. మిగతా సమయాల్లో పోర్టింగ్ కుదరక పోవడం ఒక మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. 2. ఒకే రకమైన పాలసీలను మాత్రమే పోర్ట్ చేయడం పాజిబుల్ అవుతుంది. 3. కొన్నిసార్లు, పోర్టింగ్ నుంచి ఏదైనా అదనపు ప్రయోజనాలను పొందేందుకు పాలసీదారులు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల చివరికి ఎలాంటి ఉపయోగం ఉండదు.
* ఎలా పోర్ట్ చేయాలి? : పాలసీదారుడు ప్రస్తుత పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజుల ముందే పోర్టింగ్ గురించి ప్రస్తుత బీమా సంస్థకు తెలియజేయాలి. పాలసీని మార్చాలనుకుంటున్న బీమా కంపెనీని కూడా తెలియజేయాలి. అనంతరం పోర్టబిలిటీ ఫారమ్‌ను పూరించాలి. బీమా చేసిన వ్యక్తి పేరు, వయస్సు వంటి వివరాలను అందించాలి. దానితో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలి. 15 రోజులలోపు పాలసీ పోస్టింగ్ రిజెక్ట్ అయిందా లేక అప్రూవ్ అయిందా అనేది తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Insurance, Insurence, Personal Finance