కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఆరోగ్యం ఎప్పుడు, ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఈ రోజు వరకు బాగున్నవాళ్లు మరుసటి రోజు ఆస్పత్రిలో చేరారు అంటూ వార్తలు వింటున్నాం. తెలిసినవాళ్లలో చాలామంది ఇలాంటివాళ్లు ఉండుంటారు. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం చాలా ముఖ్యం అని ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే దేశంలో హెల్త్ పాలసీల రెన్యువల్ శాతం చాలా బాగుంది. గతేడాది తీసుకున్న హెల్త్ పాలసీల్లో 80 శాతం పైగా రెన్యువల్ చేసుకోవడమే దీనికి ఉదాహరణ. హెల్త్ పాలసీలపై ఫైనాన్సియల్ ప్లానింగ్ వెబ్సైట్ పాలసీ బజార్ నిర్వహించిన ఓ స్టడీలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గతేడాది తీసుకున్న పాలసీల రెన్యువల్ లెక్క తీస్తే... డెడ్‌లైన్ లోపు ఇండివిడ్యువల్ పాలసీల్లో 80 శాతం రెన్యువల్ అవ్వగా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో 85 శాతం రెన్యువల్ అయ్యాయట. ముందుగా అనుకున్నట్లు కరోనా సోకితే పాలసీ అవసరం ఉంటుందనే ఆలోచనే దీనికి కారణం. మహమ్మారి సమయంలో ఎవరికి, ఎప్పుడు, ఏమవుతుందో తెలియదు కాబట్టి.. ఆసుపత్రి బిల్లుల బాధపడకుండా హెల్త్ పాలసీయే సరైన విధానం అనుకుంటున్నారు. రెన్యువల్ అయిన పాలసీ సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ కావడం విశేషం.
గతేడాదికి, ఈ ఏడాదికి సంబంధించి హెల్త్ పాలసీల రెన్యువల్ రేట్ శాతం పరిశీలించినా మార్పు కనిపిస్తోంది. గతేడాది ఇష్యూ అయిన పాలసీల్లో ఎన్ని ఈ ఏడాది రెన్యువల్ అయ్యాయి అనే విషయం కూడా లెక్కించారు. రెండేళ్ల మధ్య తేడా మూడు శాతం ఉంది. గతేడాది 94 శాతం రెన్యువల్ రేట్ ఉండగా, అది ఈ ఏడాది 97 శాతంగా ఉంది. గడువు కంటే ముందే రెన్యువల్ చేయడం వల్ల పాలసీ బెనిఫిట్స్‌లో ఎలాంటి అంతరాయం ఉండదు. అలాగే నో క్లైమ్ బోనస్ బెనిఫిట్స్ కూడా సకాలంలో అందుతాయి. అందుకే ముందస్తు రెన్యువల్‌కు అందరూ ముందుకొస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకునేటప్పుడు వెల్నెస్ పాయింట్లను ఉపయోగించుకునే ఆప్షన్‌ను కూడా ఎక్కువమంది వినియోగిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో జరిగిన రెన్యువల్స్‌లో 20 శాతం వెల్నెస్ పాయింట్ల రెడీమ్తోనే జరిగింది. కరోనా కారణం వల్ల గత రెండేళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్‌లు తీసుకునేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్‌ను నిత్యావసరంగా ప్రజలు భావిస్తున్నారని ఇన్సూరెన్స్ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అత్యవసరం కూడా అని చెబుతున్నారు. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంటే రెన్యూవల్ డేట్ చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే తీసుకోండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.