హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొన్న వారికి శుభవార్త. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌లో భాగంగా సుమారు రెండు లక్షల కుటుంబాలకు రూ.4,700 కోట్ల సబ్సిడీని బదిలీ చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా రూ.47,000 కోట్ల విలువైన రుణాలకు ఆమోద ముద్ర లభించింది. ఎకనమిక్ వీకర్స్ సెక్షన్-EWS, లో ఇన్కమ్ గ్రూప్-LIG, మిడిల్ ఇన్కమ్ గ్రూప్-MIG విభాగాల్లో హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈ సబ్సిడీ క్రెడిట్ అయింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం 2015 నుంచి వేర్వేరు ఆదాయ వర్గాలకు చెందిన వారు ఇల్లు కొనడానికి సహకరిస్తోంది. ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నదే ఈ స్కీమ్ లక్ష్యం. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, నేషనల్ హౌజింగ్ బ్యాంకుకు మా కృతజ్ఞతలు.
— రేణు సుద్ కర్నాడ్, మేనేజింగ్ డైరెక్టర్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్
కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశ ప్రజలందరికీ పక్కా ఇళ్లు ఉండటమే లక్ష్యంగా 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మొదటిసారి ఇల్లు కొనేవారికి ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో నాలుగు కేటగిరీలు ఉంటాయి. ఎకనమిక్ వీకర్ సెక్షన్, లోయర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 లో రూ.18 లక్షల లోపు రుణాలు తీసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ.2,57,000 సబ్సిడీ ఇస్తుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థల్లో హోమ్ లోన్ తీసుకునేవారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేయొచ్చు. ఇటీవల ఈ పథకాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఎంఐజీ కేటగిరీలో 2021 మార్చి వరకు ఈ సబ్సిడీ పథకానికి దరఖాస్తు చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కేటగిరీలో 2022 మార్చి 31 వరకు దరఖాస్తు చేయొచ్చు.