HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ నుంచి వీసా క్రెడిట్ కార్డులు.. పేటీఎంతో సాయంతో కస్టమర్లకు కొత్త క్రెడిట్ కార్డ్ సేవలు

HDFC Credit Card

క్రెడిట్ కార్డులను అధిక సంఖ్యలో జారీ చేయాలనే లక్ష్యంతో పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ సోమవారం వెల్లడించింది. పండుగ సీజన్‌కు ముందే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విక్రయించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులను వీసా మద్దతుతో తీసుకొస్తున్నాయి.

  • Share this:
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారుల కోసం తరచూ సరికొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. అలాగే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన సేవలను పరిచయం చేస్తోంది. తాజాగా క్రెడిట్ కార్డుల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డులను అధిక సంఖ్యలో జారీ చేయాలనే లక్ష్యంతో పేటీఎంతో హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ సోమవారం వెల్లడించింది. పండుగ సీజన్‌కు ముందే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విక్రయించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డులను వీసా మద్దతుతో తీసుకొస్తున్నాయి.

కొత్త రిటైల్ కస్టమర్లు, ధనిక కస్టమర్ల వివిధ అవసరాలను తీర్చేలా ఈ క్రెడిట్ కార్డులను తీసుకొస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అత్యుత్తమ బహుమతులు, క్యాష్‌బ్యాక్ అందిస్తామని పేర్కొంది. ఈ కార్డులు చిన్నపాటి వ్యాపారస్తులకు కూడా ప్రయోజనాలు అందిస్తాయని వివరించింది.

కస్టమర్ల ఫెస్టివల్ సీజన్ డిమాండ్లకు తగ్గట్టుగా క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు, ఈఎంఐలు, బయ్ నౌ పే లేటర్ (Buy Now Pay Later) ఆప్షన్స్ అక్టోబర్ 2021లో లాంచ్ చేయాలని ప్లాన్ చేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. డిసెంబర్ 2021 చివరి నాటికి అన్ని ప్రొడక్ట్ లపై ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ప్రస్తుతం పేటీఎం, హెచ్‌డీఎఫ్‌సీ కలిసి టైర్ 2, టైర్ 3 మార్కెట్లలోకి కూడా తమ సేవలను విస్తరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేసేందుకు నడుం బిగించాయి.

చిన్న నగరాలు, పట్టణాలకు చెందిన వ్యాపార భాగస్వాములకు అనేక ప్రయోజనాలను అందించేందుకు పేటీఎం సంస్థతో కలసి బిజినెస్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెస్తామని బ్యాంక్ ప్రకటించింది. తక్షణ, పేపర్‌లెస్ అప్రూవల్స్ తో సులభంగా క్రెడిట్ యాక్సెస్ పొందడానికి వ్యాపారస్తులకు వీలు కల్పిస్తామని బ్యాంకు చెప్పింది. ఈ బిజినెస్ క్రెడిట్ కార్డులతో పేటీఎం.. వ్యాపారుల క్రెడిట్ కార్డ్ విభాగంలో ఎంట్రీ ఇవ్వనుంది. దాంతో 21 మిలియన్లకు పైగా వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.

తమ వ్యాపార భాగస్వాముల అవసరాల ప్రకారం బిజినెస్ క్రెడిట్ కార్డులు రూపొందించామని.. ఈ ఆఫర్‌లు వారికి ప్రయోజనం చేకూరుస్తాయని తమ నమ్ముతున్నట్టు పేటీఎం లెండింగ్ సీఈఓ భావేష్ గుప్తా అన్నారు. ఫెస్టివల్ సీజన్ లో దేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కృషి చేస్తోందన్నారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను విస్తరించి వినియోగదారులకు విభిన్న అనుభవాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేమెంట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ పరాగ్ రావు అన్నారు.

ఈ భాగస్వామ్యంతో అన్ని వర్గాల కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా క్రెడిట్ కార్డులను తయారు చేయవచ్చనే నమ్మకం కలుగుతుందని వీసా గ్రూప్ ఇండియా, దక్షిణాసియా కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ అన్నారు. వినియోగదారులు ఈ కార్డుల కోసం డిజిటల్/ పేపర్‌లెస్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పేటీఎం యాప్ ద్వారా జాయినింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Published by:Krishna Adithya
First published: