Happy Birthday Ratan Tata: అతడొక కార్పోరేట్ రుషి, భారత పారిశ్రామిక రంగానికి బిగ్ బాస్, ఆయన కంపెనీ మార్కెట్ వేల్యూ చూస్తే కొన్ని దేశాల జీడీపీలు కూడా సరిపోవు, ఆయన కంపెనీల మార్కెట్ వేల్యూను తెలిపేందుకు సెన్సెక్స్, నిఫ్టీ తరహాలో ఒక ప్రత్యేక ఇండెక్స్ మెయిన్ టెయిన్ చేయాలి. అతడే భారత కార్పోరేట్ సామ్రాజ్యానికి మహారాజు రతన్ టాటా...ఆయన పుట్టిన రోజు నేడు. రతన్ టాటా పేరుకు కుబేరుడు అయినప్పటికీ, సాదా సీదా జీవితం ఇష్టపడే వ్యక్తి, టాటా సామ్రాజ్యాన్ని దాదాపు 100కు పైగా దేశాలకు విస్తరింప చేసిన వ్యక్తిగా రతన్ టాటా తన చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు ఆయన 85 ఏట అడుగుపెడుతున్నారు. 1937 డిసెంబర్ 28 నావల్ టాటా కుటుంబంలో జన్మించిన రతన్ టాటా, తమ సమీప బంధువు అయినటువంటి జెఆర్డీ టాటా కుటుంబానికి దత్తత వెళ్లాడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం అంతా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగింది. అక్కడే ఆయన అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాంను 1975లో పూర్తి చేశాడు. ఆ తర్వాత 1991లో జేఆర్డీ టాటా పదవీ విరమణ పొంది టాటా సన్స్ బాధ్యతను రతన్ టాటాకు అప్పగించారు. 1961లోనే టాటా స్టీల్ కంపెనీలో ఓ ఉద్యోగిగా తన ప్రస్థానం స్టార్ట్ చేసిన రతన్ టాటా, స్టీల్ వ్యాపారం నుంచి సంస్థను డైవర్సిఫైడ్ రంగాలకు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా టాటా టీ మరో ప్రముఖ బ్రాండ్ టెట్లీని సొంతం చేసుకోవడంతో పాటు, టాటా మోటార్స్ సంస్థ ద్వారా జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థను కొనుగోలు చేయడం, యూరప్ కు చెందిన కోరస్ ను టాటా స్టీల్ ద్వారా సొంతం చేసుకోవడం రతన్ టాటా గెలుపులో మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయన ఎన్నో స్టార్టప్ కంపెనీలకు సీడ్ ఫండింగ్ చేయడం ద్వారా తన దృక్పథం ఏంటో ప్రపంచానికి చాటాడు. అంతేకాదు రతన్ టాటా ఆధ్వర్యంలోన 21 సంవత్సరాల సారథ్యంలో సంస్థ 40 రెట్లు వృద్ధి సాధించగా, 50 రెట్లు లాభాలను పొందింది.
నానో కారుతో తలనొప్పులు..
రతన్ టాటా కలల ప్రాజెక్టు అయినటువంటి, నానో కారు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. సంస్థ ప్లాంటును పశ్చిమబెంగాల్ లోని నందిగ్రాంలో స్థాపించాలని ప్రయత్నించగా, ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన వ్యతిరేకతతో , పెద్ద ప్రజా ఉద్యమం లేచింది. సింగూరులో కాల్పులు సైతం జరిగాయి. దీంతో కలత చెందిన రతన్ టాటా, తన నానో ప్రాజెక్టును గుజరాత్ కు తరలించి రికార్డు సమయంలో ప్లాంటను నెలకొల్పి, నానో కారును రోడ్డుమీదకు తెచ్చారు. అయితే నానో కారు అనుకున్న దానికంటే ఫెయిల్యూర్ మూటగట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా మార్కెట్లోకి ప్రవేశించిన నానో, నెమ్మదిగా టెక్నికల్ అంశాలతో వెనుకబడింది. అంతేకాదు ఈ కారు అటు వాహన ప్రియుల మదిని దోచుకోలేకపోయింది. నానో చివరకు అటకెక్కాల్సి వచ్చింది.
సైరస్ మిస్త్రీతో జగడం..
రతన్ టాటా తన వారసుడిగా సమీప బంధువు అయిన షాపూర్ జీ పల్లోంజీ వారసుడు సైరస్ మిస్త్రీకి టాటా గ్రూపు బాధ్యతలు అప్పగించారు. అయితే సైరస్ మాత్రం తనదైన సంచలన నిర్ణయాలతో మార్క్ వేసుకొనే ప్రయత్నం చేశాడు. ఇది పెద్దాయన రతన్ కు ఏమాత్రం రుచించలేదు. టాటా సన్స్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా తన పంతం నెగ్గించకునే క్రమంలో సైరస్ కు అర్థాంతరంగా ఉద్వాసన పలికి, ఆ స్థానంలో టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ ను నియమించాడు. అయితే రతన్ మనసు తెలిసిన చంద్రశేఖరన్ సంస్థను మళ్లీ గాడిలో పెట్టాడు. అంతేకాదు నష్టాల్లో మునిగిపోయిన టాటా మోటార్స్ ను మరోసారి పూర్వవైభవం తెచ్చాడు. మొత్తానికి రతన్ టాటా మాత్రం రిటైర్ అయినప్పటికీ, సైరస్ వ్యవహారంతో తనదే టాటా గ్రూపులో పైచేయ అని నిరూపించాడు.
UPSC CDS 2022: నిరుద్యోగులకు అలర్ట్... 341 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్
భవిష్యత్ దిక్సూచి
ఏది ఏమైనప్పటికీ, రతన్ టాటా అధ్యాయం భారత పారిశ్రామిక రంగంలో ఓ స్వర్ణయుగం అనే చెప్పాలి. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో రతన్ సఫలీకృతం అయ్యారు. పద్మవిభూషణ్ అందుకున్న రతన్ టాటా ప్రస్తుతం 85 ఏట ప్రవేశించారు. యువ పారిశ్రామిక వేత్తలకు ఆయన ఎప్పుడు ఓ దిక్సూచిగా నిలుస్తారు.
Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Ratan Tata