వస్తు సేవల పన్ను GSTకి సంబంధించిన కీలక సమావేశం ఈరోజు జరగనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని మంత్రుల బృందం (GoM) ఈ శుక్రవారం సమావేశం కానుంది. ఈ బృందాన్ని GST కౌన్సిల్ గత సంవత్సరం ఏర్పాటు చేసింది. ట్యాక్స్ రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను సూచించడం ఈ కమిటీ లక్ష్యం. ఈ నేపథ్యంలో కీలక విషయాలను చర్చించేందుకు కమిటీ జూన్ 17న సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రేట్ స్లాబ్‌ను ఐదు శాతం నుంచి ఏడు లేదా ఎనిమిది శాతానికి.. 18 శాతాన్ని 20 శాతానికి మార్చే ప్రతిపాదనపై మంత్రుల బృందం చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
తదుపరి GST కౌన్సిల్ సమావేశానికి ముందు తుది నివేదికను సమర్పించడానికి ఈ బృందానికి తగిన సమయం ఇచ్చారు. GST మినహాయింపు పొందిన వస్తువుల జాబితాను కత్తిరించడం గురించి కూడా ఈ కమిటీ చర్చించవచ్చు. టెక్స్‌టైల్స్‌లో ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిదిద్దే ప్రతిపాదనపై కూడా రాష్ట్ర మంత్రుల ప్యానెల్ చర్చించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది పూర్తయిన వస్తువుల (finished goods) కంటే, ఇందుకు కొనుగోలు చేసిన ఇన్‌పుట్స్‌పై పన్ను రేటు ఎక్కువగా ఉండే పరిస్థితిని సూచిస్తుంది.
ఈ కమిటీలో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా, కేరళ వంటి సభ్య రాష్ట్రాలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబరులో ఏర్పాటైన ప్యానెల్, 2021 నవంబర్‌లో చివరిసారిగా సమావేశమైంది. GoM సిఫార్సులు ఖరారైన తర్వాత, తుది నిర్ణయం కోసం తదుపరి సమావేశంలో కౌన్సిల్ ముందు ఉంచనున్నారు. జీఎస్టీ విధానంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ జూన్ చివరి వారంలో సమావేశమయ్యే అవకాశం ఉంది.
గత నెలలో సుప్రీంకోర్టు ఒక ప్రధాన తీర్పులో, జీఎస్టీ కౌన్సిల్ అనేది సిఫార్సు చేసే సంస్థ మాత్రమేనని, దాని సిఫార్సులకు కేంద్రం లేదా రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పే అధికారం లేదని పేర్కొంది. అయితే జీఎస్‌టీ కౌన్సిల్ సిఫార్సులకు ఆమోదయోగ్యమైన విలువ ఉంటుందని కోర్టు పేర్కొంది. జీఎస్టీకి సంబంధించిన విషయాలపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండూ సమానంగా చట్టాలు చేయగలవని కోర్టు పేర్కొంది.
ప్రస్తుతం GSTలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం.. మొత్తం నాలుగు స్లాబ్‌లు ఉన్నాయి. 18 శాతం శ్లాబ్‌లో 480 వస్తువులు ఉన్నాయి, వాటి నుంచి 70 శాతం GST వసూళ్లు వస్తాయి. ఇది కాకుండా, లెవీ వర్తించని అన్‌బ్రాండెడ్, అన్‌ప్యాక్డ్ ఫుడ్ ఐటెమ్స్ వంటి మినహాయింపు వస్తువుల జాబితా ఉంది.
మే నెలలో GST కలెక్షన్లు రూ. 1,40,885 కోట్లకు చేరుకున్నాయి. ఈ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. అయితే ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లతో పోలిస్తే మాత్రం వసూళ్లు 16 శాతం తగ్గాయి. 2022 మే నెలలో సేకరించిన స్థూల GST ఆదాయం రూ. 1,40,885 కోట్లు. ఇందులో CGST రూ. 25,036 కోట్లు, SGST రూ. 32,001 కోట్లు, IGST రూ. 73,345 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 37469 కోట్లతో కలిపి). సెస్సు రూ.10,502 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 931 కోట్లతో సహా).
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GST, GST Council, Karnataka, Supreme Court