Hallmarking Rules: ‘గోల్డ్ హాల్ మార్కింగ్ విధానం సక్సెస్ అయింది.. గొడవ అనవసరం’ తేల్చి చెప్పిన BIS

(ప్రతీకాత్మక చిత్రం)

పసిడిపై హాల్ మార్కింగ్ నిబంధనలను వ్యతిరేకిస్తూ బంగారు వ్యాపారులు ఆగస్టు 23న సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివాదంపై స్పందించారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ.

  • Share this:
బంగారం స్వచ్ఛత విషయంలో హాల్ మార్కింగ్ నిబంధనలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జులై నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే పసిడిపై హాల్ మార్కింగ్ నిబంధనలను వ్యతిరేకిస్తూ బంగారు వ్యాపారులు ఆగస్టు 23న సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివాదంపై స్పందించారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ. ప్రభుత్వం తీసుకొచ్చిన హాల్ మార్కింగ్ విధానం విజయవంతమైందని, కాబట్టి సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరారు.

జులై 1 నుంచి ఆగస్టు 20 మధ్య కాలంలో 90 వేల మంది నగల వ్యాపారులు హాల్ మార్కింగ్ స్కీం కింద నమోదు చేసుకున్నారని ప్రమోద్ తెలిపారు. ఈ సమయంలో 1.02 కోట్ల నగలకు హాల్ మార్క్ చేశారని, మరో 1.17 కోట్లు హాల్ మార్కింగ్ జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత.. జులై 1 నుంచి 15 మధ్య కాలంలో 5,145 మంది వ్యాపారులు నగలను హాల్ మార్కింగ్‌కు పంపారు. అనంతరం ఆగస్టు 1 నుంచి 15 మధ్యలో 14,349 మంది వ్యాపారులు హాల్ మార్కింగ్ కోసం ఆభరణాలను పంపినట్లు తెలిపారు. ఈ స్కీమ్‌ను ఎంతోమంది ఆమోదిస్తున్నారని ప్రమోద్ వెల్లడించారు. జులై 15 వరకు 14.28 లక్షల హాల్ మార్క్ నగలు విక్రయించగా.. ఆగస్టు 1 నుంచి 15 మధ్యలో ఈ సంఖ్య 41.81 లక్షలకు చేరిందని స్పష్టం చేశారు.

"హాల్ మార్కింగ్ యూనిక్ ఐడీ(HUID) ఆధారిత హాల్ మార్కింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పరిశ్రమ పనితీరులో పారదర్శకతను తీసుకొస్తుంది. వినియోగదారుల డబ్బుకు సరైన వస్తువులను పొందే హక్కులను కల్పిస్తుంది. వ్యాపారులకు ప్రయోజనం కల్పిస్తుంది" అని ప్రమోద్ కుమార్ తివారీ స్పష్టం చేశారు.

ఈ కొత్త విధానం ప్రకారం.. 20, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలు హాల్ మార్కింగ్ కిందకు వస్తాయి. బంగారం స్వచ్ఛతను ఈ హాల్ మార్కింగ్ ధ్రువీకరిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీన్ని పర్యవేక్షిస్తుంది. తొలిదశలో దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ విధానాన్ని జులై నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే దేశవ్యాప్తంగా హాల్ మార్కింగ్ కేంద్రాల కొరతతో పాటు కొన్ని సంక్లిష్ట నిబంధనలు విధించడాన్ని బంగారు ఆభరణాల వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో హాల్‌మార్కింగ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఆగస్టు 23న ఆల్ ఇండియా జెమ్స్ అండ్ డొమెస్టిక్ కౌన్సిల్(BJC) సమ్మె తలపెట్టింది.
Published by:Krishna Adithya
First published: