ఎలక్ట్రానిక్ వస్తువులపై స్టార్ రేటింగ్ ఎంత (Star Ratings) ఎక్కువ ఉంటే.. అంత తక్కువ కరెంటు బిల్లు వస్తుందని చెప్పవచ్చు. ఎక్కువ స్టార్స్‌తో ఎక్కువ కరెంట్ సేవ్ చేసుకోవచ్చనే అవగాహన దాదాపు వినియోగదారులందరిలో ఉంది. టీవీ, ఫ్రిజ్, ఏసీ ఇలా దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై పవర్ ఎఫీషియన్సీ రేటింగ్ ఉంటుంది. అయితే జూలై 1 నుంచి భారత్‌లోని ఏసీల కోసం కొత్త ఎనర్జీ రేటింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇటీవల బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (Bureau of Energy Efficiency) ఇండియాలోని ఏసీల కోసం విద్యుత్ వినియోగ ప్రమాణాలను సవరించింది. ఈ మేరకు ఏప్రిల్ 19న నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
అయితే ఈ కొత్త ప్రమాణాల వల్ల ఏసీ తయారీదారులతో పాటు కొనుగోలు చేసేవారిపై ప్రభావం పడనుంది. కొత్త రేటింగ్స్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ఏసీ ధరలు (AC Prices) 7-10% ప్రియంగా మారతాయి. కొత్త రేటింగ్ నిబంధనల వల్ల ఏసీ తయారీదారులు 5-స్టార్ మోడళ్ల పవర్ ఎఫీషియన్సీని మరింత పెంచాల్సి వస్తుంది.
స్టార్ రేటింగ్ అంటే ఏంటి?
ఏసీ స్టార్ రేటింగ్ దాని శక్తి సామర్థ్యానికి ఒక ఇండికేటర్‌గా పనిచేస్తుంది. ఈ రేటింగ్‌ను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (BEE) నిర్ణయిస్తుంది. స్టార్ రేటింగ్ అనేది కొనుగోలుదారులకు ఏసీ ఎంత మేర ఎలక్ట్రిసిటీని ఖర్చు చేస్తుందనేది తెలియజేస్తుంది. స్టార్స్ ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా విద్యుత్తు పొదుపు చేసుకుని బిల్లులను తగ్గించొచ్చు. ఈ రేటింగ్స్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రవేశపెట్టిన గ్రేడింగ్ సిస్టమ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో (EER)పై ఆధారపడి ఉంటాయి. కొనుగోలుదారులు ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెంట్ రేషియో (ISEER) రేటింగ్ స్టాండర్డ్‌తో ఎనర్జీ రేటింగ్స్‌ను చెక్ చేయవచ్చు. అయితే స్టార్ రేటింగ్స్ చేంజ్ 6 నెలల క్రితమే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కంపెనీలు కోవిడ్ లాక్డౌన్ వల్ల ఈ మార్పుకు సిద్ధం కాలేమని, అమలును ఆలస్యం చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (BEE)ని విజ్ఞప్తి చేశాయి.
కొత్త ఏసీలపై స్టార్ రేటింగ్స్ చూపే ప్రభాం
కొత్త స్టార్ రేటింగ్స్ అమల్లోకి వచ్చాక, ప్రస్తుత ఏసీల ఎనర్జీ రేటింగ్స్‌లో ఒక స్టార్ తగ్గుతుంది. ఒకవేళ మీరు గతంలో 5-స్టార్ ఏసీని కొనుగోలు చేస్తే.. జులై నుంచి అది 4-స్టార్ ఏసీ అవుతుంది. అలానే జులై 1 నుంచి విండో, స్ప్లిట్ ఏసీలకు స్టార్ రేటింగ్ ఒకేలా ఉండదు. ఈ రెండు రకాల ఏసీల రేటింగ్స్‌లో కాస్త మార్పు ఉంటుంది. ముందుగా చెప్పుకున్నట్లు కొత్త రేటింగ్స్ వల్ల ఏసీ ధరలు 7-10% పెరుగుతాయి. జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త ఎనర్జీ రేటింగ్స్ డిసెంబర్ 2024 వరకు వర్తిస్తాయి.
5 స్టార్ ఏసీలు ఎందుకు ఖరీదైనవిగా మారనున్నాయి?
కొత్త స్టార్ రేటింగ్స్‌కి తగినట్లుగా ఎక్కువ ఎనర్జీ ఎఫీషియన్సీ అందించాలంటే ఏసీ తయారీదారులు ఎయిర్ కండిషనర్లలో గాలి ప్రవాహాన్ని పెంచాల్సి ఉంటుంది. అలానే కాపర్ ట్యూబ్ సర్ఫేస్ ఏరియా పెంచి, సమర్థవంతమైన కంప్రెసర్‌ను ఏసీలో అందించాల్సి ఉంటుంది.
ఏసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ రేటింగ్స్ కూడా సవరించారా?
ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ల స్టార్ రేటింగ్స్‌లో ఈ ఏడాదిలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే జనవరి 2023 నుంచి రిఫ్రిజిరేటర్ల ఎనర్జీ రేటింగ్స్ మారే అవకాశం ఉంది. అయితే 5 స్టార్ రిఫ్రిజిరేటర్లను తయారు చేయడం కంపెనీలకు చాలా కష్టమవుతుందని కొందరు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ac, BUSINESS NEWS, Covid, Electronics