భూమి సూర్యూడి చుట్టూ తిరుగుతుంటే.. ప్రపంచం గూగూల్ చుట్టూ తిరుగుతోంది. ఏ చిన్నపనికైనా ఈ సెర్చ్ ఇంజన్ దిగ్గజాన్ని నమ్ముకోవాల్సిందే. ముఖ్యంగా ప్రయాణసమయంలో దారిచూపే దేవతలాగా గూగూల్ మ్యాప్స్ పనిచేస్తుంటాయి. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. వీటిని నమ్ముకుని హాయిగా సాగిపోతున్న ప్రయాణాన్ని బురదలోకి దించుకున్న పర్యాటకుల గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. జర్మనీ, ఉత్తరాఖండ్‌కు చెందిన కొందరు పర్యాటకులు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు బయల్దేరారు. తమ గ్రాండ్ ఐ10 వాహనంలో నవానియా హైవేపై వీరి ప్రయాణం సజావుగా సాగుతుండగా... గూగూల్ మ్యాప్ ఒక దగ్గరి దారిని చూపింది. ఈ దారిలో ఉదయ్‌పూర్‌కు చేరడం మరింత తేలిక అని, సమయం ఆదా అవుతుందని తెలిపింది. సహజంగానే పర్యాటకులు ఈ దగ్గరి దారిని ఎంచుకున్నారు. హైవేపై నుంచి టర్నింగ్ తీసుకున్న వీరి కారు కొంతదూరం సజావుగానే వెళ్లింది. ఆ తరువాత అసలు సినిమా మొదలైంది.
సింగిల్ లైన్ రహదారి అయిన ఈ మార్గం పూర్తిగా బురదతో నిండి ఉండటమే కాకుండా కార్ టైర్లు జారిపోతూ ప్రయాణం నరకంగా మారింది. చివరకు ఒకచోట వీరి కారు పూర్తిగా బురదలో చిక్కుకుంది. ఆపైన ముందుకు కదలక మొరాయించింది. దీంతో పర్యాటకులందరూ కారు దిగి ,దాన్ని కదిలించడానికి కుస్తీలు పట్టారు. కానీ ఉపయోగం లేకపోయింది. దీంతో తమ స్నేహితులను సహాయం చేయడానికి రావాల్సిందిగా అభ్యర్థించారు.
కారు చిక్కుకున్న దారి అద్వాన్నంగా ఉంది. స్థానికులు కూడా ఈ మార్గాన్ని వాడరని తెలుస్తోంది. గతంలో ఓ మాదిరి భారీ వాహనాలు కూడా ఇక్కడి బురదలో చిక్కకుపోయాయని స్థానికులు తెలిపారు. ఇక కారును బయటకు తీయడం అంత సులభం కాదనుకున్న పర్యాటకుల బృందం తమ స్నేహితులకు ఫోన్ చేశారు. వారు వెంటనే సంఘటనాస్థలికి బయల్దేరారు. అయితే వాహనాన్ని బయటకు లాగడానికి ట్రాక్టర్‌ను తీసుకురావాల్సి వచ్చింది. ఆ ట్రాక్టర్ కోసం తాము ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్లినట్లు యాత్రికులు తెలిపారు.
ఆ తరువాత ట్రాక్టర్‌కు కారుకు కట్టి ఎట్టకేలకు బురద నుంచి దాన్ని బయటకు తీయగలిగారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బురదలో చిక్కకున్న కారు సాయంత్రం ఆరుగంటలకు గానీ బయటకు రాలేదు. బురదలో దిగబడిన ట్రాక్టర్‌ను బటయకు తీసేందుకు రెండుగంటల సమయం పట్టింది. ఈ సంఘటన గురించిన నివేదికను ఇండియా ఆటో న్యూస్ పోర్టల్ కార్టోక్ ప్రచురించింది. గూగూల్‌ను గుడ్డిగా నమ్మకూడదని ఈ సంఘటన చెపుతోంది కదూ!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending