టెక్ దిగ్గజం గూగుల్ (Google) పది రోజుల క్రితమే 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంజనీర్ల నెత్తిన పిడుగు పడినంత పని అయింది. ఆ వార్త నుంచి ఇంకా కోలుకోక ముందే గూగుల్ ఐటీ ఇంజనీర్లకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్(PERM)ను ఆపేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీని అర్థం గూగుల్ ఈ ప్రోగ్రామ్ కోసం కొత్త అప్లికేషన్లను ఇకపై తీసుకోదు. PERM ప్రోగ్రామ్ అనేది విదేశీ ఉద్యోగులు ఎంప్లాయర్-స్పాన్సర్డ్ గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియలోని ఒక భాగం. అయితే ఈ ప్రోగ్రామ్‌ను టెంపరరీగా మాత్రమే నిలిపేస్తున్నట్లు గూగుల్ తమ ఫారిన్ ఉద్యోగులకు ఒక ఈమెయిల్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
ఈ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా ఆపివేయడం వల్ల కొంతమంది ఉద్యోగులు, వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే నిజం తాము గ్రహించగలమని ఈ-మెయిల్‌లో గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా భారమైనా దానిని ఎంత త్వరగా చెప్తే అంత మంచిదని తాము భావించినట్లు ఈమెయిల్‌లో రాసుకొచ్చారు.
ఈ మార్పు ఇతర వీసా దరఖాస్తులు లేదా ప్రోగ్రామ్‌లను ప్రభావితం చేయదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ హామీ ఇచ్చారు. PERM ప్రక్రియలో సంస్థల యజమానులు ఒక జాబ్ కోసం అర్హత ఉన్న యూఎస్ వర్కర్స్ తమకు అందుబాటులో లేరని నిరూపించాల్సి ఉంటుంది.
* కొనసాగుతున్న లేఆఫ్స్
టెక్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో అమెరికన్ వర్కర్స్ కూడా జాబుల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎందరో వర్కర్స్ అందుబాటులో ఉన్న పరిస్థితులలో వారు లేరని చెప్పడం, నిరూపించడం అసాధ్యం. అందుకే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* కొన్ని మినహాయింపులు
ఇప్పటికే సమర్పించిన PERM అప్లికేషన్‌లకు సపోర్ట్‌ను కొనసాగిస్తామని గూగుల్ తెలిపింది. ప్రస్తుత PERM నియమాలు 2005 నుంచి అమలులో ఉన్నాయి. PERM అనేది నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట ఉద్యోగ స్థానం కోసం కార్మిక శాఖ (DOL) నుంచి సర్టిఫికేషన్ పొందేందుకు ఒక అప్లికేషన్.
ఎంప్లాయర్-స్పాన్సర్డ్ ఇమ్మిగ్రంట్ వీసా లేదా గ్రీన్ కార్డ్ కోసం కొత్తగా ఫైలింగ్స్ యాక్సెప్ట్ చేయమని గూగుల్ తెలిపింది కాబట్టి ఇతర దేశస్తులు, ముఖ్యంగా ఇండియన్స్ ఈ చర్య గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. PERM ప్రోగ్రామ్ ఇతర దేశాల ప్రజలు కనీసం 10 ఏళ్లు పాటు అమెరికాలో ఉండటానికి వీలు కల్పించే ఒక మార్గం. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ముందు ఒక యజమాని విదేశీ ఉద్యోగిని నియమించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత, విదేశీ ఉద్యోగి దేశంలో శాశ్వత బస కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి అప్లికేషన్‌పై ఆమోద ముద్రపడితే వారికి గ్రీన్ కార్డ్ జారీ అవుతుంది. ఇది వారు శాశ్వతంగా యూఎస్‌లో ఉండడానికి సహాయపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.