గృహరుణాలు (Home Loan) అందించడంలో అగ్రగామి బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(HDFC Bank)తో ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు (India post payment bank) కలసి పనిచేయనుంది. ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకుకు ఇప్పటికే ఉన్న 4.7 కోట్ల వినియోగదారుల్లో అర్హులకు గృహరుణాలు మంజూరు చేయనుంది. దేశ వ్యాప్తంగా 650 శాఖలతోపాటు, 136000 పోస్టాఫీసుల ద్వారా గృహరుణాలు మరింత చేరువ చేయనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ఇప్పటికీ బ్యాంకు సేవలు (Bank Services) అందుబాటులో లేని వారికి గృహరుణాలు అందించేందుకు ఇండియా పోస్ట్ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నట్టు హెచ్ డీ ఎఫ్ సీ లిమిటెడ్ (HDFC LIMITED) ప్రకటించింది. 19000 మంది ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు సిబ్బంది ద్వారా గృహరుణాలు అందించనున్నారు. గృహరుణాల మంజూరు ప్రాసెసింగ్ వ్యవహారం మొత్తం హెచ్ డీ ఎఫ్ సీ సిబ్బంది నిర్వహిస్తారు. ఇందులో ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు సిబ్బంది సహకారం తీసుకుంటారు.
డిజిటల్, ఆన్ లైన్ గృహరుణాలు..
కరోనా మహమ్మారి వచ్చిన తరవాత డిజిటల్, ఆన్ లైన్ ద్వారా గృహరుణాలు పొందేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం గృహరుణాల్లో 88 శాతం డిజిటల్ మార్గంలో మంజూరు చేసినట్టు హెచ్ డీ ఎఫ్ సీ తెలిపింది. ఎక్కువ మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికే హెచ్డీఎఫ్సీవెబ్సైట్ను ఏడు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. డిజిటట్గా బ్యాంకు సేవలు పొందలేని వారికి ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు, హెచ్డీఎఫ్సీ సంయుక్తంగా గృహరుణాలు అందిస్తామని ఐపిపిబి ఎండీ, సీఈవో జె.వెంకట్రాము తెలిపారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని హెచ్డీఎఫ్సీ ద్వారా 2,50,000 మందికి రూ.43,000 కోట్లు గృహ రుణాలు ఇవ్వడంతో పాటు లబ్దిదారులకు రూ.5,800 కోట్ల రాయితీ కూడా అందించినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.
ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు వినూత్న సేవలు
ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు వినియోదారులకు వినూత్న సేవలు అందిస్తోంది. అనేక రకాల సేవలను గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా అందిస్తోంది. డిజిటల్ లైప్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్), ఆధార్ లో ఫోన్ నెంబరు అప్ డేట్ చేసుకోవడం, విర్చువల్ డెబిట్ కార్డు, ఆధార్ ఆధారిత పేమెంటు సిస్టమ్ సర్వీసులు, డాక్ పే యూపీఐ యాప్ సేవలు కూడా అందిస్తున్నట్టు ఇండియా పోస్ట్ పేమెంటు బ్యాంకు ఎండీ, సీఈవో జె.వెంకట్రాము తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: HDFC bank, Home loan, India post, India post payments bank